అందమైన ప్రజా ప్రతినిధులు | Beautiful people's representatives | Sakshi
Sakshi News home page

అందమైన ప్రజా ప్రతినిధులు

Published Thu, Jun 16 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM

అందమైన ప్రజా ప్రతినిధులు

అందమైన ప్రజా ప్రతినిధులు

ఆలోచన అందంగా ఉంటే మనిషీ అందంగా కనిపిస్తాడు!ఇదిగో వీరంతా అందానికి కాకుండా అందమైన ఆలోచనకు ప్రతినిధులు! ప్రజా ప్రతినిధులు!! ఆకుల చాటున దాగి ఉండే పువ్వుల్లా కాకుండా...సూర్యుడు భూమి మీదే వికసించాడా అన్నంత గొప్పగా కనిపిస్తున్నారు! అందం దేవుడిచ్చాడు.. అర్హత ప్రజలు ఇచ్చారు.. ఇక గౌరవం వీళ్లు నిలబెట్టుకోవాలి!

 

రాజకీయం... ఒకప్పుడు పురుషులకు మాత్రమే తెలిసిన మంత్రం.. వాళ్లకు మాత్రమే చేతనైన తంత్రం.. వాళ్లు మాత్రమే రాణించదగ్గ రంగం.. కానీ ఇప్పుడు... స్త్రీలకూ తెలిసిందా వ్యూహం! వాళ్లూ నెరుపుతున్నారు రాజకీయం... అందుకుంటున్నారు అధికారం! యుక్తి, యోగ్యత, శక్తిసామర్థ్యాలు కలిగిన మహిళానేతలున్న దేశాలే దీనికి నిదర్శనం! అంతెందుకు మొన్నటికిమొన్న మన దగ్గర జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, మమతాబెనర్జీ, మహబూబా ముఫ్తీసహీద్‌లు ముఖ్యమంత్రులవడం మరో మంచి ఉదాహరణ! అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ ఇంకో ప్రతీక! ఈ సంగతి అలా ఉంచితే..


సహజంగానే ఆడవాళ్లు అందానికి పర్యాయపదాలు! నటన, మోడలింగ్, క్రీడలు, సైనికబలగాలు వంటి రంగాల్లో అందమైన మహిళలున్నట్టే రాజకీయాల్లో కూడా చతురతతో పాటు అందాన్ని కలబోసుకున్న ఆడవాళ్లు ఉన్నారు. ఓ ఇంటర్నేషనల్ వెబ్ జర్నల్ ఈ విషయంమీద ఓటింగ్ ద్వారా ఓ పోటీ నిర్వహించాలనుకుంది. అనుకున్నదే తడవుగా 2015లో ప్రపంచవ్యాప్తంగా ఓటింగ్ పెట్టింది. అందులో గెలిచి నిలిచిన టాప్ టెన్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ పొలిటీషియన్స్ జాబితాను విడుదల చేసింది! ఆ సుందర రాజకీయ మహిళామణులెవరో చూద్దాం...

 

1. వంజా హెడ్జోవిక్...
సెర్బియా విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖలో సలహాదారు. కవ్వించే ఫోటోగ్రాఫ్స్‌తో కంట్రావర్సీకి కేంద్రంగా మారారు అందాల వంజా హెడ్జోవిక్ . ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాల్సివస్తే బ్రెయిన్‌తో బ్యూటీని డామినేట్ చేసి సమర్థవంతురాలిగా పేరుతెచ్చుకున్నారు. పనిపట్ల ఆమెకున్న నిబద్ధత, నిజాయితీలు ఆమెను సెర్బియాలోని సోషలిస్ట్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్‌ను చేశాయి! ఇక ఆమె అందమేమో ... వెబ్‌జర్నల్ నిర్వహించిన బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ పాలిటీషియన్స్ ఇన్ ద వరల్డ్ కాంటెస్ట్‌లో వంజా హెడ్జోవిక్‌ను మొదటి స్థానంలో నిలిపింది.


2. మారా కార్‌ఫెగ్నా
ఇటాలియన్ రాజకీయ నేత. రాజకీయాల్లోకి రాకముందు ఆమె  ప్రసిద్ధ మోడల్. టెలివిజన్ సిరీస్‌లో కూడా నటించారు. 2004లో రాజకీయారంగప్రవేశం చేశారు. బెర్లుస్కోని ఫోర్త్ కాబినెట్‌లో ఈక్వల్ ఆపర్చునిటీ శాఖా మంత్రిగానూ ఉన్నారు. యూరప్‌మీడియా అంతా ఆమెను  ది మోస్ట్ బ్యూటిఫుల్ ఇటాలియన్ మినిస్టర్‌గా అభివర్ణించింది. ఓ యూరప్ మ్యాగజైన్ అయితే మారాను టాప్ హాటెస్ట్ ఫీమేల్ పొలిటీషియన్స్‌గా పేర్కొంది. అలాగే ఈ వెబ్ జర్నల్ నిర్వహించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ పొలిటీషియన్స్ ఇన్ ద వరల్డ్ కాంటెస్ట్‌లో మారా కార్‌ఫెగ్నా రెండోస్థానం పొందారు.

 
3. కష్మాలా తారీఖ్

నలభైమూడేళ్ల ఈ పాకిస్తానీ నేత పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ ై‘ఖెద్ ఎ అజమ్’ సభ్యురాలు. ఆ పార్టీ నుంచే నేషనల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మానవ హక్కుల కార్యకర్త కూడా అయిన కష్మాలా తారీఖ్ పాకిస్తాన్‌లో పరువు హత్యలకు వ్యతిరేకంగా గళం వినిపించారు.

 

4. డింపుల్ యాదవ్
మనందరికీ బాగా పరిచయం ఉన్న మహిళ. అవును.. అఖిలేశ్ యాదవ్ భార్య, ములాయంసింగ్ యాదవ్ కోడలు! సమాజ్‌వాదీ పార్టీ నేత. 2012లో ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేతగానే కాదు ఫంక్షన్లు, పార్టీలకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానం అందుకుంటూ సెలబ్రెటీగా కూడా పాపులర్ అయ్యారు ఆమె. ప్రస్తుతం మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ ఫీమేల్ పొలిటీషియన్స్ ఇన్ ద వరల్డ్‌లో నాలుగో స్థానంలో ఉన్నారు.

 

 
5. ఇవా కైలి

పాన్‌హెల్లెనిక్ సోషలిస్ట్ మూవ్‌మెంట్ నుంచి యురోపియన్‌పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. 37 ఏళ్ల ఇవాకైలీ విద్యార్థి రాజకీయాల్లో కూడా చురుకుగా ఉండేవారు. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2004లో ప్రధానస్రవంతి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నేషనల్ డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో శాశ్వత సభ్యురాలిగా కొనసాగుతున్నారు. 2014లో జరిగిన యూరోపియన్ ఎన్నికల్లో నాటో పార్లమెంటరీ అసెంబ్లీలోని డెలిగేషన్స్ ఫర్ రిలేషన్స్‌కి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు ఇవాై కెలి.

 
6. సెత్రిడా జియాజియా

49 ఏళ్ల ఈ లెబనీస్ నేత 1994లో రాజకీయాల్లోకి వచ్చారు. లెబనాన్‌లోకి సిరియా శక్తులు దూసుకువచ్చినప్పుడు ఆ శక్తులు వెనక్కివెళ్లేలా పోరాడారు సెత్రిడా జియాజియా. లెబనీస్ ఫోర్సెస్ పార్టీని నిలబెట్టి తిరిగి అధికారం పొందేలా చేశారు. లెబనీస్ మెరోనైట్ లీగ్ సభ్యురాలిగా రహదారి భద్రత మీద ప్రత్యేక దృష్టిపెట్టి విజయం సాధించారు. అంతకుమించి సామాజిక సేవనూ అందించారు. ఈ సాహస వనిత మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ ఫిమేల్ పొలిటీషియన్స్ ఇన్ ద వరల్డ్‌లో ఆరో స్థానాన్ని సాధించారు.
 

7. అలినా కబీవా

 ఈ రష్యన్ నేత పూర్వాశ్రమంలో రిథమిక్ జిమ్నాస్ట్. 33 ఏళ్ల అలినా క్రీడల నుంచి రిటైరయ్యాక రాజకీయాల్లోకి వచ్చారు. యునెటైడ్ రష్యా పార్టీ తరపున 2007లో పబ్లిక్ చాంబర్ ఆఫ్ రష్యా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2014 వరకు కొనసాగారు. 2014లో రష్యాలోనే అతిపెద్ద మీడియా కార్పోరేషన్ అయిన నేషనల్ మీడియా గ్రూప్‌కి బోర్డ్ ఆఫ్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ ఫిమేల్ పొలిటీషియన్స్ జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు.

 

 8.నినా సైఖలీ మొరాదీ

 ఇరానియన్ రాజకీయ నేత. ఇరానియన్ కౌన్సిల్ సభ్యురాలూ అయిన నినా ఆర్కిటెక్ట్ కూడా. అయితే ఆమె అందమే అమెకు శత్రువైంది. నినా అందానికి అందకూ ఆకర్షితులవుతుండడం, కౌన్సిల్‌లో అందరి కళ్లూ ఆమె మీదకే మళ్లుతుండడం వల్ల కౌన్సిల్ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోందని కౌన్సిల్ ఆమె సభ్యత్వాన్నే రద్దు చేసింది. అలాంటి ఈ అద్భుత సౌందర్యరాశి టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ పొలిటీషియన్స్‌లో స్థానం సంపాదించడంలో ఆశ్చర్యం లేదు.

 
9. ఆంజెలా జెరెకోవ్

 గ్రీక్ వనిత. ఈమె కూడా రాజకీయాల్లో రాణిస్తూనే ఆర్కిటెక్ట్‌గానూ కొనసాగుతున్నారు. సమరస్ ప్రభుత్వంలో క్రీడలు, సాంస్కృతిక శాఖా డిప్యుటీ మంత్రి. పూర్వశ్రమంలో సినీ నటి. ది గర్ల్ ఆఫ్ మానిలో నటించారు. 2009లో రాజకీయరంగంలోకి వచ్చారు. రావడం రావడంతోనే టూరిజం శాఖా బాధ్యతలను తీసుకున్నారు. చూడగానే ఆకట్టుకునే ఈ గ్రీకు నేత ది టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ పొలిటీషియన్స్ జాబితాలో తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు.

 

 

10. ఓర్లీ లెవీ
ఇజ్రాయేలీ విదేశీవ్యవహారాల మాజీ మంత్రి డేవిడ్ లెవీ ముద్దుల బిడ్డ. తండ్రిబాటలోనే నడిచి నేతగా ఎదిగారు ఓర్లీ. రాజకీయాల్లో చేరిన కొత్తలోనే క్నెస్సెట్ సభ్యురాలైంది. అంతేకాదు డిప్యుటీ స్పీకర్‌గానూ ఎన్నికయ్యారు. తలతిప్పుకోనివ్వని సౌందర్యంతో ఓర్లీ లెవీ ది టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ పొలిటీషియన్స్‌లో పదో స్థానంలో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement