ముఖ చర్మం జీవం లేనట్టు కనపడుతుంటే మృతకణాల సంఖ్య పెరిగిందని అర్ధం చేసుకోవాలి. మృతకణాలు తగ్గి, స్వేదరంధ్రాలలోని మురికి వదిలితే చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది. ఇందుకు కొన్ని టిప్స్ ఫాలో అవొచ్చు.
∙కలబంద (అలొవెరా) ఆకు నుంచి తీసిన జెల్‌లాంటి పదార్ధం మృతకణాలను తొలగించడంలో మహత్తరంగా పనిచేస్తుంది. కలబంద రసాన్ని వేళ్లతో అద్దుకొని, ముఖానికి పట్టించి, మృదువుగా మర్దనా చేయాలి. తర్వాత ఓ పది నిమిషాలు వదిలేసి, నీళ్లతో కడిగేయాలి. గరుకుగా తయారైన చర్మం మృదువుగా అవుతుంది. ఈ అలొవెరా జ్యూస్‌తో చేసిన స్క్రబ్, మసాజ్‌లకు వాడాలి.
∙సబ్బు, మేకప్ ఉత్పత్తులలో ఉండే రసాయనాలు చర్మంలోనికి ఇంకిపోవడం వల్ల కూడా జీవకళ తగ్గుతుంది. ఇలాంటప్పుడు చర్మతత్వాన్ని బట్టి ఏది ఉపయోగమో దానితో క్లెన్సింగ్ చేయించాలి.
∙మృతకణాల తొలగింపులో బొప్పాయి, పైనాపిల్‌లోని సహజ ఔషధాలు బాగా పనిచేస్తాయి. బొప్పాయి, పైనాపిల్ పండ్లను రోజూ ఒక కప్పు తిన్నా, వీటి గుజ్జును మసాజ్, ఫేస్‌ప్యాక్‌గా ఉపయోగించినా మృతకణాలు తగ్గుతాయి. బొప్పాయి, పైనాపిల్ గుణాలు ఉన్న సౌందర్య ఉత్పత్తులను కూడా మృతకణాల తొలగింపుకు వాడచ్చు. అయితే అవి మన చర్మానికి సరిపడాలి.
వెచ్చని నీరు.. చల్లని నీరు
మృతకణాల తొలగింపుకు ముందు.. ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. మసాజ్‌కి ఏదైతే ఉపయోగిస్తారో దానిని రాస్తూ వేళ్లతో వలయాకారంలో మర్దనా చేయాలి. ఎక్కువ ఒత్తిడి చేస్తే ముఖచర్మంపై గీతలు పడే అవకాశం ఉంది. తర్వాత చల్లని నీటితో శుభ్రపరచాలి. తర్వాత మాయిశ్చరైజర్‌ని రాసుకోవాలి. మొటిమలు, యాక్నె సమస్య ఉన్నవారు ముఖాన్ని స్క్రబ్ చేయకపోవడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment