బ్యూటిప్స్
పెదవులు పొడిబారకుండా, మృదువుగా ఉండాలంటే తరచూ లిప్ బామ్ రాస్తుండటం ఎంతో మేలు. అలా అని మార్కెట్‌లో దొరికే లిప్‌బామ్ వాడితే ఒక్కోసారి సైడ్‌ఎఫెక్ట్స్ బాధ కూడా తప్పదు. అలా కాకుండా పెదాలు అందంతో పాటు ఆరోగ్యంగానూ ఉండాలంటే హోమ్మేడ్ లిప్‌బామ్ వాడితే మంచిది. దాని తయారీ విధానం చాలా సింపుల్. ఒక టేబుల్ స్పూన్ క్రాన్‌బెర్రీ జూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల పెట్రోలియం జెల్లీ (వ్యాజెలిన్) వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఓ చిన్న బాటిల్లో నింపి డీప్ ఫ్రిజ్‌లో రెండు రోజుల పాటు ఉంచాలి. అంతే! ఆరోగ్యకరమైన లిప్‌బామ్ రెడీ.
వర్షాకాలంలో రోడ్లపై ఉండే నీళ్లలో నడిచినా, ఇంట్లో ఎక్కువగా నీళ్లలో ఉన్నా చాలామంది మహిళలకు పాదాలు పగులుతుంటాయి. కొంతమందికి ఆ పగుళ్ల నుంచి రక్తం కూడా వస్తుంటుంది. అలాంటి వారు రోజూ రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు ప్యాక్ వేసుకోవాలి. దానికోసం కరిగించిన ప్యారాఫిన్ వ్యాక్స్‌లో కొద్దిగా ఆవనూనె కలిపి ప్యాక్ వేసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీటితో మర్దన చేసుకుంటూ పాదాలను కడిగేసుకోవాలి. ఇలా 10-15 రోజులు రెగ్యులర్‌గా చేస్తే పగుళ్లు లేని మృదువైన పాదాలు మీ సొంతం.