
పసుపు ఎంత చాయ...
కాస్తంత పసుపు ఉంటే చాలు... అందం, ఆరోగ్యం తేలికగా కాపాడుకోవచ్చు.
బ్యూటిప్స్
కాస్తంత పసుపు ఉంటే చాలు... అందం, ఆరోగ్యం తేలికగా కాపాడుకోవచ్చు. సహజ చర్మకాంతికి పసుపును మించిన ఔషధమేదీ లేదు. ఎండకు కమిలిపోయి పొడిదేరిన ముఖానికి పసుపులో పాలమీగడ, తేనె కలిపి ఫేస్‌ప్యాక్‌లా పట్టించి, అరగంటసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. తరచు ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. తరచు మొటిమలతో బాధపడుతున్నట్లయితే, పసుపు, వేపాకు కలిపి ముద్దగా నూరుకోవాలి. ఆ ముద్దలో కొద్దిచుక్కల రోజ్‌వాటర్, నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట ఆరనిచ్చాక, గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేస్తే మొటిమలు మాయమవుతాయి.
ముఖంపై ముడతలు వస్తుంటే, వయసు మళ్లినట్లు కనిపిస్తారు. చిన్న వయసులోనే ఇలాంటి సమస్య ఎదురైతే ఇబ్బందే. పసుపులో కొద్దిగా టొమాటో గుజ్జు, పచ్చిపాలు కలిపి పేస్టులా చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి, పొడిగా ఆరిపోయేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
తలలో చుండ్రు ఇబ్బంది కలిగిస్తుంటే, పసుపులో వేపాకులు కలిపి గుజ్జుగా చేయాలి. దీనికి కలబంద గుజ్జు చేర్చి, తలకు పట్టించాలి. అరగంట ఆరనిచ్చాక కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే చుండ్రు మాయమవుతుంది.