విదేశీ విద్య
ఐర్లాండ్ ప్రత్యేకతలు:
యూరో జోన్‌లో ఇంగ్లిష్ అధికార భాషగా గల ఏకైక దేశం ఐర్లాండ్. ఇదే కారణంతో ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో వేల సంఖ్యలో వివిధ బహుళజాతి సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. వీటిల్లో దాదాపు 600 వరకు సాఫ్ట్‌వేర్ కంపెనీలున్నాయి. రిటెన్, స్పోకెన్ ఇంగ్లిష్‌లో పట్టున్న మన దేశ విద్యార్థులకు అనుకూలంగా ఉండటంతోపాటు కోర్సు పూర్తికాగానే ఉద్యోగావకాశాలు కూడా త్వరగానే లభిస్తున్నాయి. దీంతో మన దేశం నుంచి వెళ్లే విద్యార్థులు ఐర్లాండ్‌ను ఎంచుకుంటున్నారు. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ జీవన ప్రమాణాలు ఉన్న దేశాలకు, ప్రజలకు సురక్షితమైన జీవనాన్ని అందించే దేశాలకు, శాంతియుత దేశాలకు ఇలా వివిధ అంశాల్లో ప్రముఖ సంస్థలు ఇచ్చే ర్యాంకింగ్స్‌లో ఐర్లాండ్ టాప్-5 దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఐర్లాండ్ వర్సిటీలు అందించే కోర్సులకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు ఐర్లాండ్ వర్సిటీలు అందించే సర్టిఫికెట్స్‌కు గుర్తింపునిస్తున్నాయి. కోర్సులు పూర్తికాగానే ఏ దేశం వెళ్లైనా ఉన్నత విద్య చదువుకోవచ్చు. లేదంటే ఉద్యోగావకాశాలు పొందొచ్చు. ప్రస్తుతం 1500 మంది భారతీయ విద్యార్థులు అక్కడ విద్యనభ్యసిస్తున్నారు.
ప్రవేశాలు సెప్టెంబర్‌లో
ఐర్లాండ్ అంతర్జాతీయ విద్యార్థులకు ఏడాదిలో రెండుసార్లు ప్రవేశం కల్పిస్తోంది. ప్రధానంగా ప్రతి ఏటా సెప్టెంబర్‌లో దరఖాస్తులను స్వీకరిస్తుండగా.. మరికొన్ని కోర్సులకు జనవరిలో కూడా ప్రవేశాలుంటాయి. కాబట్టి విద్యార్థులు మూడు, నాలుగు నెలల ముందుగానే దరఖాస్తుకు సిద్ధంగా ఉండాలి. దరఖాస్తుతోపాటు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ప్రస్తుత విద్యాభ్యాసం వరకు సంబంధిత సర్టిఫికెట్లను, ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం ఉన్నట్లు రుజువు చేసే ఐఈఎల్‌టీఎస్ స్కోర్ కార్డ్, అక్కడ విద్యాభ్యాసానికి అవసరమయ్యే ఖర్చులన్నింటినీ భరించగలిగే స్థోమత ఉన్నట్లు తెలిపే ఆస్తి డాక్యుమెంట్ల వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవేకాకుండా పాస్‌పోర్ట్‌ను, మీ లక్ష్యాలను క్లుప్తంగా వివరిస్తూ స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్‌ఓపీ)ని విద్యార్థులు దరఖాస్తుతోపాటు సమర్పించాలి. వివిధ యూనివర్సిటీల వెబ్‌సైట్స్ ద్వారా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీసా కోసం మన దేశంలో ఉన్న ఐర్లాండ్ రాయబార కార్యాలయంలోనూ, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న వీసా ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనూ సంప్రదించాలి. వెళ్లడానికి కనీసం 8 వారాల ముందుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.5000 చెల్లించాలి. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఐర్లాండ్ వీసా అప్లికేషన్ సెంటర్ ఉంది.
పాపులర్ కోర్సులు.. వ్యవధి:
ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, లైఫ్ సెన్సైస్, కంప్యూటర్ సెన్సైస్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ వంటి కోర్సులకు ఐర్లాండ్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. మనదేశం నుంచి వెళ్తున్న విద్యార్థులు కూడా ఎక్కువగా ఇవే కోర్సులను ఎంచుకుంటున్నారు. కోర్సుల విషయానికొస్తే ఐర్లాండ్ యూనివర్సిటీలు సాధారణ డిగ్రీ కోర్సులు మొదలుకొని బ్యాచిలర్ డిగ్రీలో ఆనర్స్ కోర్సులు, మాస్టర్స్ కోర్సులు, డాక్టోరల్ కోర్సులు, డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ కోర్సుల వ్యవధి ఏడాదికాగా, బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల వ్యవధి కోర్సును బట్టి మూడు నుంచి నాలుగేళ్లు ఉంటుంది. అదేవిధంగా డిప్లొమా కోర్సుల వ్యవధి ఏడాది. మనదేశంలో 10+2 పూర్తిచేసినవారు బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరొచ్చు. అయితే విద్యా సంస్థ, కోర్సును బట్టి 10+2లో 75 శాతం నుంచి 85 శాతం మార్కులు సాధిస్తే మంచి ఇన్‌స్టిట్యూట్‌లో కోరుకున్న కోర్సులో చేరే అవకాశముంటుంది. పీజీ కోర్సులకు కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు.
కోర్సు ఫీజులు
అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు రుసుములు కోర్సును, ఇన్‌స్టిట్యూట్‌ను బట్టి వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా 9100 యూరోల నుంచి 37,000 యూరోల వరకు, పీజీ కోర్సు రుసుములు కూడా 9150 యూరోల నుంచి 37,000 యూరోల వరకు ఉంటాయి. నివాసం, భోజనం, బుక్స్, ఇతర ఖర్చుల కింద నెలకు మరో 1300 యూరోల వరకు అవుతాయి.
పార్ట్‌టైం జాబ్స్.. శాశ్వత నివాసం..
ఐర్లాండ్‌లో విద్యనభ్యసించే అంతర్జాతీయ విద్యార్థులకు మరో సౌలభ్యం పార్ట్‌టైం జాబ్స్. విద్యార్థులు.. తమ కోర్సులు పూర్తయ్యేవరకు వారానికి 20 గంటలు పనిచేసుకోవడానికి అనుమతిస్తారు. సెలవు దినాల్లో అయితే వారానికి 40 గంటలు పార్ట్‌టైం జాబ్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా నిర్దేశిత గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తై తర్వాత కనీసం ఏడాదిపాటు ఉద్యోగం చేసుకోవడానికి వర్క్ పర్మిట్ పొందొచ్చు. ఈ సమయంలో ఏడాదికి కనీసం 30,000 యూరోలు పొందొచ్చు. ఆ తర్వాత మరో ఏడాదికి వీసా పొడిగింపు లభిస్తే ఐరిష్ ఎంప్లాయర్‌గా నమోదుచేసుకుని రెండేళ్ల కాలానికి గ్రీన్‌కార్డ్ లేదా ఎంప్లాయ్‌మెంట్ పర్మిట్ పొందొచ్చు. ఈ రెండేళ్లు కూడా పూర్తై పర్మినెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
స్కాలర్‌షిప్స్:
విద్యనభ్యసించే విద్యార్థులకు ఐర్లాండ్ ప్రభుత్వం, యూనివర్సిటీలు, వివిధ సంస్థలు ఎన్నో స్కాలర్‌షిప్స్‌ను అందిస్తున్నాయి. వాటిలో కొన్ని.. ఐర్లాండ్ స్కాలర్‌షిప్ ఫర్ ఫారిన్ టీచర్స్ ఆఫ్ ఇంగ్లిష్, గవర్నమెంట్ ఆఫ్ ఐర్లాండ్ స్కాలర్‌షిప్స్, ఐర్లాండ్ హోమ్ కమింగ్ స్టడీ ప్రోగ్రామ్ మొదలైనవి. ఇవే కాకుండా ది ఐరిష్ యూనివర్సిటీస్ అసోసియేషన్ కూడా భారతీయ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. కొన్ని యూనివర్సిటీలు ట్యూషన్ ఫీజులో 50 శాతం తగ్గింపును కూడా ఇస్తున్నాయి.
ఐర్లాండ్ గురించి క్లుప్తంగా..
రాజధాని: డబ్లిన్
అధికార భాషలు: ఐరిష్, ఇంగ్లిష్
కరెన్సీ: యూరో (ఒక యూరో భారత కరెన్సీలో దాదాపు 82 రూపాయలకు సమానం)
జనాభా: 45,93,100
సమయం: ఐర్లాండ్ కాలమానం కంటే భారత కాలమానం దాదాపు ఐదు గంటల ముందుంటుంది. (ఐర్లాండ్‌లో ఉదయం తొమ్మిది అయితే ఇండియాలో మధ్యాహ్నం రెండు అవుతుంది)
బెస్ట్ స్టడీస్.. బెటర్ ఫ్యూచర్.. ఐర్లాండ్
Published Sun, Jul 6 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM
Advertisement
Advertisement