ప్రియ మోదీజీ బేటీ బచావో | Beti Bachao dear modiji | Sakshi
Sakshi News home page

ప్రియ మోదీజీ బేటీ బచావో

Published Mon, Aug 28 2017 12:06 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

ప్రియ మోదీజీ బేటీ బచావో - Sakshi

ప్రియ మోదీజీ బేటీ బచావో

ఆగస్టు 15 వ తారీఖున జెండా పండుగకు వెళ్తున్న ఓ స్కూలు విద్యార్థినిని చెత్తలోకి లాక్కెళ్లారు. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ చెత్తలను దులుపుతుంది. అలాగే.. మగాడిలో ఉన్న చెత్తను దులపాలి. స్వచ్ఛ భారత్‌ను మాత్రమే కాదు.. మహిళకు కావలసిన స్వేచ్ఛా భారత్‌ను కూడా ఇవ్వాలి. జెండా పండుగ రోజు మాత్రమే కాదు. ప్రతి రోజూ జెండా... మన అమ్మాయిలకు అండగా ఉండాలి.

‘‘ప్రియమైన నరేంద్రమోదీజీ... స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కింద రేపిస్ట్‌లనే చెత్తను ఏరిపారేసి దేశాన్ని స్వచ్ఛంగా మార్చండి. చెత్తలోనైనా  బతకగలం.. కాని  ఏ క్షణంలో ఎవరిమీద లైంగిక దాడి జరుగుతుందోనన్న భయంతో మాత్రం బతకలేం! మీ ‘బేటీ బచావో’ ఏది? ఇప్పటికైనా ఆడపిల్లలను కాపాడండి. కంటే కూతురినే కనాలనే ఆశతో ఉన్నాను.

కాని ఈ పరిస్థితులను చూస్తుంటే అమ్మాయిని కనాలంటేనే భయమేస్తోంది. కని.. చూస్తూ చూస్తూ ఈ నరకంలో ఎలా పడేయగలను? మోదీ సర్‌.. ఈ రేపిస్ట్‌లకు ఎలాంటి శిక్ష వేయాలంటే.. జీవితంలో స్త్రీని కన్నెత్తి చూడాలనే ఆలోచనకే వాళ్లు భయపడాలి. మీ మీద నమ్మకం ఉంది. అమ్మాయిల రక్షణ కోసం ఏమైనా చేయండి. స్వతంత్య్ర భారతావనిలో ఇప్పుడు జరగాల్సింది మహిళా స్వాతంత్య్ర పోరాటమే!’ అంటూ ప్రధానికి ఘాటుగా చిన్న ఉత్తరంలాంటి ట్వీట్‌ చేశారు ఓ వ్యక్తి.

అంతేకాదు ‘‘70 ఏళ్ల స్వపరిపాలన మనకు స్వేచ్ఛనివ్వలేదు. అలాంటి పార్టీలకు మనం ఓటెందుకు వేయాలి? స్త్రీలను అలక్ష్యం చేసే పార్టీలకు వోటు వేయకండి. మహిళలకు చోటులేని గడ్డ ఇది. రేపిస్ట్‌ల స్వర్గం. పార్టీలూ ఇప్పటికైనా కళ్లు తెరవండి. ఈ దేశంలోని ప్రతి ఆడపిల్లకూ రక్షణకావాలి’’ అంటూ మహిళలను అభ్యర్థిస్తూ కూడా మరో ట్వీట్‌ చేశారు అదే వ్యక్తి.

వీటికి కారణం, నేపథ్యం..
చంఢీఘర్‌లో మొన్న పంద్రాగస్టు రోజు  ఉదయం.. స్కూల్లో జెండావందనం కోసం వెళ్తున్న పన్నెండేళ్ల అమ్మాయిపై ఓ వ్యక్తి జరిపిన లైంగికదాడి. ఈ విషాదాన్ని అన్ని వార్తా చానళ్లు తెలిపాయి. సున్నిత హృదయులు స్పందించారు. ఆ స్పందనల్లోవే పైన ట్వీట్స్‌ కూడా! 70 ఏళ్ల స్వాతంత్య్ర ఫలం... 71వ స్వాతంత్య్రదినోత్సవం మూటగట్టుకున్న అపకీర్తిని.. ఆగ్రహం, ఆవేదన, అభ్యర్థనగా వెలిబుచ్చిన ఆ ట్వీట్స్‌ ఒక స్త్రీ మూర్తివి.

కాజల్, ఐ లైనర్, మస్కారా, లిప్‌స్టిక్, ఆర్క్‌లైట్స్‌ మధ్య ఆర్టిఫీషియల్‌ నవ్వులు, గ్లిజరిన్‌ ఏడుపులు, లాజిక్‌కి అందని సెంటిమెంట్ల అభినయాలు పూసే గ్లామర్‌ తోటలోని ఓ పువ్వు ఆమె! బుల్లితెర నటి.. పేరు దివ్యాంకా త్రిపాఠి. వయసు 32 ఏళ్లు. ‘‘బనూ మై తేరీ దుల్హన్‌’’ ఫేమ్‌.. ఇంకా చెప్పాలంటే అశేషజనాన్ని ఆకట్టుకుంటున్న ‘‘యే హై మొహబ్బతే’’ నటి! అడుగడుగునా పొంచి ఉన్న ప్రమాదాల నుంచి తన పిల్లలను కాపాడుకునే తల్లి పాత్రను అద్భుతంగా పోషించింది. ఆ మనసు కేవలం సీరియల్‌ వరకే కాదు రియల్‌గా కూడా ఉందని నిరూపించింది తన ట్వీట్స్‌ ద్వారా! ఆ మనస్తత్వం, ఆమె వ్యక్తిత్వమే ఈ వారం దివ్యాంక ‘బయో’ను ఆవిష్కరించేలా చేసింది.

టీవీచిత్రంగా...
తన భవిష్యత్‌ గురించి తండ్రి ఒక కలకన్నాడు. అడ్వంచర్‌ అంటే ప్రాణం పెట్టే తను ఆర్మీఆఫీసర్‌ కావాలనే గోల్‌ను సెట్‌ చేసుకుంది. పోటీలంటే సహజంగా ఉన్న ఆసక్తి అందాల, అభినయ పోటీల్లో పాల్గొనేలా చేసింది. అయితే ఎక్కడ గురి తప్పని దివ్యాంక తన ఆశయం, లక్ష్యం విషయంలో మాత్రం గురి తప్పి.. చిత్రంగా నటిగా టర్న్‌ తీసుకుంది.

ముందుగా దూరదర్శన్‌లో ప్రసారమయ్యే టెలీఫిలిమ్స్‌తో డెబ్యూ ఇచ్చింది. ఆ తర్వాత కామెడీ సర్కస్‌ సీజన్స్‌లోనూ సందడి చేసింది. ఆర్‌జే మంత్ర, అనూప్‌ సోనీతో జతకట్టి చేసిన కామెడీ సర్కస్‌ ఆమెకు మంచి గుర్తింపునే ఇచ్చాయి. అదే.. జీటీవీ ‘బనూ మే తేరి దుల్హన్‌’ అనే సీరియల్‌లో ఆమెకు చాన్స్‌నిచ్చింది. ఇది దివ్యాంక తొలి టీవీ సీరియల్‌. నటనా కౌశలాన్ని ప్రదర్శించే స్కోప్‌ దొరికింది. ఆ అభినయానికి అబ్బురపడ్డారు యావత్‌దేశ మహిళా ప్రేక్షకులు. ఈ సీరియల్‌ ఆమెకు స్టార్‌ టీవీ ప్రొడక్షన్స్‌లోనూ బోలెడు అవకాశాలను తెచ్చిపెట్టాయి.

సామాజిక స్పృహ
దివ్యాంకకు చిన్నప్పటి నుంచీ పుస్తకాలంటే పిచ్చి. జానపద కథలు, పౌరాణికాల దగ్గర్నుంచి సాంఘిక నవలలు, జీవిత చరిత్రల వరకు అన్నిటినీ చదువుతుంది. ఇష్టమైన నవల ‘గాడ్‌ఫాదర్‌’. పుస్తకాలంటే మోజు పెరిగినప్పటి నుంచి గాడ్‌ఫాదర్‌ను ఎన్నిసార్లు చదివిందో లెక్కేలేదట. అలాగే ఆ నవల ఆధారంగా వచ్చిన గాడ్‌ఫాదర్‌ సినిమా అంటే కూడా అంతే ఇష్టం అంటుంది.

పుస్తక పఠనం వల్లే సమాజంలోని సమస్యల పట్ల సోయి పెరిగిందని, అవగాహన వచ్చిందని, స్పందించే తత్వమూ అలవడిందని చెప్తుంది. అందుకే బుల్లితెర సెలబ్రిటీగా కాకుండా తనకున్న వ్యక్తిగత ఆసక్తితోనే సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటానంటుంది. అలాంటిదే 2011లో గ్లోబల్‌ ఇనీషీయేటివ్‌ ‘ౖసైబర్‌డూడూ డిఫెండర్‌ ఆఫ్‌ లైఫ్‌’కి అంబాసిడర్‌గా వ్యవహరించడం. ఇది చైల్‌ ్డరైట్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సంస్థ. ఇలాంటి సామాజిక అంశాలకు చెందిన ఎన్నో టెలీఫిలిమ్స్‌లో నటించి దేశ పౌరురాలిగా తన బాధ్యతను చాటుకుంది ఆమె. జానపద కథలంటే ఉన్న ఆసక్తితో బుందేల్‌ఖండ్‌ (మధ్యప్రదేశ్‌)కి చెందిన ఓ జానపదకథ ఆధారంగా తీసిన ‘లాలా హర్‌దువాల్‌’ అనే సినిమాలో నటించింది. ఇందులో ఆమె రాణి పద్మావతి పాత్రను పోషించింది.

యే హై మొహబ్బతే..
ఇవన్నీ ఒకెత్తయితే.. డాక్టర్‌ ఇషితా భల్లా పాత్ర ఒకటి ఒకెత్తు. అది యే హై మొహబ్బతే సీరియల్‌లో మెయిన్‌రోల్‌. ఇషితా భల్లా పేరే తన అసలు పేరుగా స్థిరపడ్డంత పాపులర్‌ అయింది ఆ సీరియల్‌లోని తన రోల్‌. అవార్డ్స్‌ ఫంక్షన్స్‌లో తనను స్టేజ్‌ మీదకు కూడా డాక్టర్‌ ఇషితా భల్లా ఉరఫ్‌ దివ్యాంక త్రివేది అని పిలిచేంతగా నోటెడ్‌ అయింది.

ఒక ఇల్లాలిగా.. తన కుటుంబాన్ని, తల్లిగా పిల్లలను సంభాళించుకునే తీరు, మల్టీటాస్కింగ్‌ ఉమెన్‌గా తను చూపిన ప్రతిభకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. అయితే తల్లి మినహా మిగిలినవన్నీ ఆమెలోని గుణాలే కాబట్టి.. యే హై మొహబ్బతేలో దివ్యాంక డాక్టర్‌ ఇషితా భల్లా పాత్రలో సహజంగా ఒదిగిపోయింది. కాబట్టే ఆ పాత్రకు అంత జీవం వచ్చింది. ప్రేక్షకుల అభిమానానికి నోచుకుంది. మొన్న పదిహేను ఆగస్ట్‌న ఓ ఆడపిల్లకు జరిగిన అన్యాయానికి ఘాటుగా స్పందించి తనలోని తల్లి మనసునూ చూపించింది.

అనుబంధాలు.. బంధాలు
దివ్యాంకలోని చురుకుదనం, అందం, సామాజిక బాధ్యతను చూసి శరద్‌ మల్హోత్ర అనే నటుడు ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆ మాటే దివ్యాంకతో చెప్పాడు. కెరీర్‌లో పీకల్లోతులో మునిగిపోయిన ఆమె ప్రేమలో పడే చాన్స్‌ లేదంది. ఆ సమాధానంతో మిన్నకుండి పోలేదు శరద్‌. మళ్లీ అడిగాడు. ఒప్పుకుంది దివ్యాంక. ప్యూర్‌వెజిటేరియన్‌ అయిన ఆమె అతనికోసం నాన్‌వెజ్‌ వండడం కూడా నేర్చుకునేంత ప్రేమలోపడింది. తొమ్మిదేళ్లు సాగిన ఆ అనుబంధం దివ్యాంకకు వచ్చిన ఫేమ్‌తో శరద్‌కు పుట్టిన అసూయ కారణంగా బీటలు వారి కూలిపోయింది. కుంగిపోయింది దివ్యాంక.

అయితే ఓటమి అంటే నచ్చని ఆమె అంతే వేగంగా కోలుకుంది. యే హై మొహబ్బతే విజయంతో పూర్వపు ఉత్సాహాన్ని తెచ్చుకుంది. ఆ క్రమంలోనే ఆ సీరియల్‌లోని నటుడైన వివేక్‌ దహియాకు దివ్యాంకా అంటే అభిమానం పెరిగింది. కామన్‌ఫ్రెండ్స్‌ ద్వారా ఆమె గురించి విన్న ఆయన ఆ అభిమానాన్ని ఇష్టంగా మార్చుకున్నాడు. కష్టంలో నిబ్బరం కోల్పోని ఆమె మనోధైర్యం వివేక్‌ ఎంతో నచ్చింది. ఆ కామన్‌ఫ్రెండ్స్‌ ద్వారే దివ్యాంక పట్ల తనకున్న ప్రేమను ఆమెకు తెలియ జేశాడు. అప్పుడప్పుడే కోలుకుంటున్న దివ్యాంక ఆ ప్రేమసందేశాన్ని విని నవ్వి ఊరుకుంది. స్నేహితుడిగానైనా కొనసాగనివ్వ మనే రిక్వెస్ట్‌ వివేక్‌ నుంచి. అదే మౌనంతో అంగీకారం తెలిపింది ఆమె. కొన్నాళ్లకు ఆ స్నేహం ప్రేమగా మారి 2016, జూలై 8న పెళ్లిబంధంగా ముడిపడింది. టీవీ ఇండస్ట్రీలోనే చక్కటి జంటగా పేరూ పొందింది.



ఆకాశవాణి : దివ్యాంక పుట్టింది,పెరిగింది మధ్యప్రదేశ్‌ రాజధాని భూపాల్‌లో. తండ్రి నరేంద్ర త్రిపాఠి. ఫార్మాసిస్ట్‌. తల్లి నీలం త్రిపాఠి.. గృహిణి. దివ్యాంక అక్క.. ప్రియాంక త్రిపాఠి, తమ్ముడు.. ఐశ్వర్య త్రిపాఠి. అతను పైలట్‌. స్థూలంగా ఇదీ ఆమె కుంటుంబం. భోపాల్‌లోని కార్మెల్‌ కాన్వెంట్‌ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసుకుంది దివ్యాంక. ఆ ఊళ్లోనే సరోజినీ నాయుడు గవర్నమెంట్‌ గర్ల్స్‌ పీజీ కాలేజ్‌లో గ్రాడ్యూయేషన్‌ చేసింది. స్కూల్లో ఉన్నప్పుడే రేడియో అనౌన్సర్‌గా చేరింది. ఇది ఆమె తొలి కొలువు. అందుకున్న జీతం ఎనిమిదివందల రూపాయలు. టీవీ నటిగా ఇప్పుడు ఎపిసోడ్‌కు లక్షరూపాయల పారితోషికం తీసుకుంటున్నా ఆ ఎనిమిది వందల రూపాయల వేతనమే చాలా విలువైంది అంటుంది దివ్యాంక.

మిస్‌ భూపాల్‌ : కూతురిని ఎన్‌సీసీలో చేర్పించాలని దివ్యాంక వాళ్ల నాన్న కోరిక. ‘భూపాల్‌ రైఫిల్‌ అకాడమీ’లో తన పేరు నమోదు చేసుకుంది. షూటింగ్‌లో శిక్షణ కూడా పొందింది. బంగారు పతకమూ సాధించింది. ఆమె గురి అలాంటిది మరి! అందుకే మల్టిపుల్‌ టాస్క్‌ను చేధించింది. తండ్రికోసం ఎన్‌సీసీ.. సాహసాలంటే తనకు ఆసక్తి కాబట్టి ఉత్తరకాశిలోని నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌లో జాయిన్‌ అయింది. పట్టుతప్పకుండా ఆ కోర్స్‌ను కంప్లీట్‌ చేసింది.

కెరీర్‌ను ఆ దిశగా నిర్మించుకునేలోపే 2003లో స్నేహితుల బలవంతం మీద ‘పాంటీన్‌ జీ తీన్‌ క్వీన్‌’ బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొంది. ‘మిస్‌ బ్యూటిఫుల్‌ స్కిన్‌’గా ఎన్నికైంది. దీంతో ఆ తర్వాత యేడాది జరిగిన ‘ఇండియా బెస్ట్‌ సినీస్టార్స్‌ కి ఖోజ్‌’ అనే ఓ టీవీ కాంటెస్ట్‌కు తన పేరును పంపించారు ఇంట్లోవాళ్లు. పెద్ద ఆసక్తితో వెళ్లలేదు కాని పాల్గొన్నాక ఇంట్రెస్ట్‌ పెరిగింది దివ్యాంకకు. భోపాల్‌జోన్‌కు గెలుపు ఖాయం చేసుకుంది. ఈ ఉత్సాహంతో తానే 2005లో జరిగిన ‘మిస్‌ భూపాల్‌’ బ్యూటీ కాంటెస్ట్‌కి వెళ్లింది. అడుగుపెట్టిన చోటల్లా విజయమే కనుక.. అక్కడా మిస్‌ భూపాల్‌ క్రౌన్‌ను ధరించి వచ్చింది.

అవార్డులు..: 2007లో డ్రామా కేటగరీ కింద ఇండియన్‌ టెలివిజన్‌ అకాడెమీ అవార్డ్‌ అందుకుంది. అదేయేడు ఇండియన్‌ టెలీ అవార్డ్స్‌ ‘ ఫ్రెష్‌ ఫేస్‌’అవార్డునూ సొంతం చేసుకుంది. ఇవికాక 2008, 2012, 2014, 2015, 2016, 2017ల్లో వివిధ చానెళ్లకు సంబంధించి బెస్ట్‌ యాక్ట్రెస్‌ అవార్డులనూ తీసుకుంది.

– శరాది

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement