
అతిగా తాగితే... అతిగా తింటారు... జాగ్రత్త!
ప్రతిరోజూ పరిమితంగా వైన్ తీసుకుంటే గుండెజబ్బులు రావని సాకు చెబుతూ తాగేస్తుంటారు కొంతమంది.
కొత్త పరిశోధన
ప్రతిరోజూ పరిమితంగా వైన్ తీసుకుంటే గుండెజబ్బులు రావని సాకు చెబుతూ తాగేస్తుంటారు కొంతమంది. గుండెజబ్బుల మాట ఎలా ఉన్నా వైన్ తీసుకున్న తర్వాత తినడంపై ఆసక్తి పెరుగుతుందని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. కొందరు పరిశోధకులు 35 ఏళ్లు పైబడిన ఆరోగ్యవంతులైన వ్యక్తులను తమ పరిశోధనల కోసం ఎంచుకున్నారు. వాళ్లను రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపునకు ప్రతిరోజూ పరిమితంగా వైన్ ఇవ్వడం మొదలుపెట్టారు. రెండో గ్రూపునకు వైన్ ఇవ్వలేదు. ఈ రెండు గ్రూపులవారికీ క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఎమ్మారై స్కాన్ చేసేవారు. వైన్ తీసుకునేవారి మెదడులోని రక్తనాళాల్లో రక్తం ప్రవహించే వేగం పెరిగినట్లుగా గుర్తించారు. ఒక గ్రూపునకు వైన్ తాగడానికి ఇచ్చిన కాసేపటి తర్వాత రెండు గ్రూపులకూ భోజనం పెట్టేవారు.
వైన్ తీసుకున్న గ్రూపులోని వారి హైపోథలామస్ గ్రంథి ఆహారం నుంచి వచ్చే మంచి వాసనల పట్ల బాగా స్పందించడం గుర్తించారు. అంతేకాదు... ఆ సువాసనలతో ప్రేరేపితమై, ఆకలి పెరిగి సాధారణం కంటే ఎక్కువగా భోజనం చేయడం కూడా గుర్తించారా పరిశోధకులు. ఈ వైన్ తీసుకున్న వారిలో మూడింట రెండొంతుల మంది చాలా ఎక్కువ ఆహారం తీసుకోవడాన్ని కూడా పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాలను ‘ఒబేసిటీ’ అనే జర్నల్‌లో పొందుపరిచారు. అందుకే వైన్‌తో గుండెజబ్బుల నివారణ మాట ఎలా ఉన్నా, స్థూలకాయం వచ్చి మళ్లీ అది గుండెజబ్బులకు ఒక రిస్క్‌ఫ్యాక్టర్‌గా పరిణమించవచ్చు. అందుకే వైన్‌ను గుండెజబ్బుల నివారణ అంశంగా పరిగణించక పోవడమే మంచిదని నిపుణుల అభిప్రాయం.