పోరు సింధూరం | Biography Rohini Sindhuri | Sakshi
Sakshi News home page

పోరు సింధూరం

Published Mon, Apr 16 2018 12:43 AM | Last Updated on Mon, Apr 16 2018 1:44 PM

Biography Rohini Sindhuri - Sakshi

అదిగో వేకువ... (కూతురు సిరిణ్యతో సింధూరి)

కలెక్టర్‌గా ఆమె నిబద్ధతతో పనులు చేస్తుంటే బదిలీలు చేస్తున్నారు పాలకులు. ప్రజలే ఆమె కోసం పోరాడారు. అదే ఈ పోరు సింధూరం కథ. 

ఉదయించేటప్పుడు... అస్తమించేటప్పుడు కనిపించే రంగు సింధూరం.సమాజంలో ఉన్న చీకటి...సాయం వేళ సింధూరాన్ని మింగేస్తుంది.కానీ... సింధూరం తన శక్తిని తాను మళ్లీ పూరించుకుని వేకువలో 
పోరు సింధూరంగా ఉదయిస్తుంది.రోహిణి సింధూరి ఐఎఎస్‌ ప్రతిభపై...దుర్మార్గపు చీకట్లు ఎన్ని ముసిరినా...పౌర సేవల వెలుగునే చూపుతోందామె.రోహిణి సింధూరి తెలుగమ్మాయి, ఖమ్మం జిల్లాలో పుట్టింది.హైదరాబాద్‌లో పెరిగింది. ఢిల్లీలో కోచింగ్‌ తీసుకుంది. కర్ణాటకలో పోస్టింగ్‌ అందుకుంది. కరవు రైతులకు పరిహారం ఇప్పించింది, కొబ్బరి నీటితో కొర్పొరేట్‌ వ్యాపారం చేయడమెలాగో రైతులకు నేర్పించింది. గోమఠేశ్వరుని సాక్షిగా మస్తకాభిషేకాన్ని పరిపూర్ణం చేసింది. చట్టానికి చుట్టాలుండరని, సామాన్యుల సేవ కోసమే చట్టమైనా, ప్రజా ప్రతినిధి అయినా అని నమ్ముతోంది. నమ్మింది  నమ్మినట్లే్ల ఆచరణలో పెడుతోంది. తుముకూరు, మండ్య, హసన్‌ జిల్లాల్లో ఆమె నిర్వర్తించిన విధులే ఆమె ఎంత కచ్చితమో చెప్తాయి. ఆమెలోని ఆ కచ్చితమే మంత్రి అధికార దుర్వినియోగానికి తాళం పెట్టించింది.

తొలి పరీక్ష!
సింధూరికి ఇంజనీరింగ్‌ పూర్తయ్యేటప్పుడు వచ్చింది సివిల్స్‌ ఆలోచన. అదే పెద్ద మలుపు ఆమె జీవితంలో. పెళ్లి చేయాలన్న అమ్మానాన్నలను రెండేళ్లు గడువు అడిగింది. సివిల్స్‌ పరీక్షలకు నెల ముందు యాక్సిడెంట్‌ రూపంలో తొలి పరీక్ష ఎదురైంది. మల్టిపుల్‌ ఫ్రాక్చర్స్‌తో బెడ్‌ మీద నుంచే ప్రిపరేషన్‌. ఐఎఎస్‌ కావాలనుకున్నప్పటి నుంచి మొదలైన ఎదురీత, బాధ్యతలు చేపట్టాక కూడా తప్పడం లేదు. ఒక పనిని సమర్థంగా పూర్తి చేస్తుంటే నాయకుల నుంచి అడ్డంకులు. జీవితమంటే అడ్డంకులను అధిగమించడమే అంటోంది... ఉలి దెబ్బలను ఓర్చుకున్న ఈ శిల్పం.

ఎన్నికలొచ్చాయి!
ప్రస్తుతం కర్నాటకలో అసెంబ్లీకి ఎన్నికల సమయం. మంత్రి ఎ. మంజు అధికార దుర్వినియోగం మీద మీడియా కన్ను పడింది. కర్ణాటక ఎలక్షన్‌ కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత ఇన్‌స్పెక్షన్‌ బంగ్లాలోని ఆఫీస్‌లో ఫైళ్లు క్లియర్‌ చేస్తున్నట్లు సమాచారం. వీడియో క్లిప్‌లతో సహా టీవీల్లో వార్త వచ్చింది. వెంటనే సింధూరి ఆదేశాల మేరకు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ వెళ్లి ఆఫీస్‌కి తాళం వేసింది. మంత్రి వెనుకటి తేదీలు వేసి (ఎన్నికల కోడ్‌ అమలు కావడానికి ముందు తేదీలు) వెయ్యి మందికి వ్యవసాయ భూములిస్తూ సంతకాలు చేశారనేది మీడియా, ప్రతిపక్షాల వాదన. అసలైన నిరుపేదలకు భూములివ్వకుండా తమకు ఓట్లు వేసే వాళ్లెవరు, వేయని వాళ్లెవరో చెప్పే పార్టీ నివేదికలు ఆలస్యం కావడంతో మంత్రి ఈ పనికి పాల్పడ్డారనేది మరో ఆరోపణ. ఎలక్షన్‌ ఆఫీసర్‌ విచారణలో వెయ్యి మందికి భూములివ్వడం ద్వారా ఐదువేల మంది ఓటర్లను ప్రభావితం చేసినట్లు నిర్ధారణ అయింది. విచారణ తీవ్రమయ్యే కొద్దీ మంత్రి మాట మెల్లగా మృదుత్వాన్ని సంతరించుకుంటోంది. ‘జిల్లా కలెక్టర్‌ తన కూతురితో సమానమని, ఆమె మీద తనకు ఎటువంటి కోపమూ లేదు’ అంటున్నారిప్పుడు.

పని చేయాలంటే తట్టుకుని నిలవాలి
‘మనకెందుకొచ్చిన రిస్క్‌ అనుకుంటే ఏ పనినీ కచ్చితంగా చేయలేం. కొత్తగా వచ్చిన అధికారి అక్కడి సమస్యలు, పరిస్థితులు, సంస్కృతిని అర్థం చేసుకుని, ఉద్యోగుల్లో ఒక టీమ్‌ను తయారు చేసుకోవడానికి ఆరు నెలలు పడుతుంది. ఈ టైమ్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేస్తే ఇక పని చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది. నిజాయితీగా పరిపాలన చేయాలంటే ఇన్ని అడ్డంకులు ఉంటాయి’ అంటారు సింధూరి. 

ఏడాదిలో లక్ష టాయిలెట్‌లు 
మండ్య జిల్లాలో ఏడాదిలో లక్ష టాయిలెట్‌లు కట్టించి జాతీయస్థాయి రికార్డు సృష్టించారామె. టాయిలెట్‌లు కట్టడానికి ముందు వాటిని వాడేటట్లు గ్రామస్థుల మైండ్‌సెట్‌ను మార్చాల్సి వచ్చింది. చెరకు పొలాల్లో పాము కాట్లు, కుక్క కాట్ల వంటి అనేక ప్రమాదాలు, మహిళల మీద అఘాయిత్యాలు బయటకు వెళ్లినప్పుడే జరిగేవి. పోకిరీ పిల్లలు కాపు కాచి ఆడవాళ్లను ఏడిపించేవారు. ఇలా ఉన్నా సరే టాయిలెట్‌ వాడటానికి సుముఖంగా లేరు. ప్రతి గ్రామంలో ఏడెనిమిది మందితో (పిల్లలు కూడా) ఒక టీమ్‌ వేసి, వాళ్లకు విజిల్స్‌ ఇచ్చారామె. ఆ టీమ్‌ ఉదయాన్నే ఊరంతా తిరుగుతూ ఎవరైనా ఆరు బయట ఆ పని చేస్తుంటే విజిల్‌ ఊదేవాళ్లు. బయట ఆ పని చేయడం షేమ్‌ అనిపించి, టాయిలెట్‌ అవసరమే అని దారికొచ్చారంతా. ‘ఒక పని చేయడానికి అధికారం ఉండాలి.

కానీ అధికారంతోనే అన్ని పనులనూ చేసేయవచ్చు అనుకుంటే పొరపాటే’నంటారామె. ఆ పని అవసరాన్ని జనానికి చెప్పాలి, సమాధానపడే వరకు నచ్చచెప్పాలి. మొండిగా ఉంటే అధికారం అనే ఆయుధం ఉందనే భావన కలిగించాలి తప్ప, అధికారాన్ని ఆయుధంగా వాడటం దేనికీ సమాధానం కాదంటారు సింధూరి.‘సమాజానికి సాధ్యమైనంత ఎక్కువ సేవ చేయగలిగింది ఐఎఎస్‌ అధికారి మాత్రమే. ఐఎఎస్‌కు ప్రిపేరయ్యేటప్పుడు అదే అనుకు న్నాను, దానినే ఆచరిస్తున్నాను. సమాజానికి, సామాన్యులకు చేతనైనంత ఎక్కువ సేవ చేయడమే నా లక్ష్యం’ అంటారామె. ‘ఎంత సాహసోపేతమైన అధికారికి అయినా కుటుంబం అండగా ఉంటేనే నూటికి నూరుశాతం సర్వీస్‌ ఇవ్వగలుగుతారు. మా అత్తగారు హసన్‌కే వచ్చి నా పిల్లలను చూసుకుంటుండటంతోనే కలెక్టర్‌గా నా బాధ్యతలకు పూర్తి సమయాన్ని కేటాయించగలుగుతున్నాను, తల్లిదండ్రులకు ఎంత రుణపడి ఉంటానో నా పిల్లలకు తల్లిగా మారిన అత్తగారికీ అంతలా రుణపడి ఉంటాను’ అంటున్నారు కలెక్టర్‌ రోహిణి సింధూరి.

మా పేర్లూ ఆయన సినిమా పేర్లలాగే! 
పెయింటింగ్‌కి టైమ్‌ లేదిప్పుడు. రోజూ యోగా, మెడిటేషన్‌ చేస్తాను. స్ట్రెస్‌ అనిపిస్తే విశ్వనాథ్‌ గారి సినిమా పాటలు వింటాను. ఆయన సినిమాల్లాగానే మా ఇంట్లో పేర్లు కూడా ‘ఎస్‌’తోనే మొదలవుతాయి. మా వారు సుధీర్‌ రెడ్డి, బాబు సిద్ధార్థ్, పాప సిరిణ్య. రెండవసారి గర్భంతో ఉన్నప్పుడు ఈ సారి పుట్టేది పాపే అనిపించేది. పుట్టబోయే పాపకు పేరు పెట్టమని విశ్వనాథ్‌ గారిని అడిగాను. ‘పుట్టనివ్వు పెడతాను’ అన్నారాయన నవ్వుతూ. సిరివెన్నెల మీద ఇష్టంతో పాపకు సిరిణ్య అని పెట్టాను.
– రోహిణి సింధూరి, కలెక్టర్, హసన్‌ జిల్లా, కర్ణాటక రాష్ట్రం

కల్పామృతం
కొబ్బరి రైతులు రోడ్డు పక్కన కాయలమ్ముకునేవాళ్లు. కాయలు మిగిలిపోతే మరుసటి రోజుకు నీరు తగ్గిపోతుంది, కాయ ధర పలకదు. రైతుకి వచ్చే రూపాయి కూడా ఎండకు ఎండిపోతుంది.  సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, కోకోనట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డులతో మాట్లాడి కల్పామృత ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారామె. కొబ్బరినీటిలో నిమ్మరసం, తేనె కలిపిన డ్రింక్‌ ఒకటి. మొత్తం ఐదు రకాల కొబ్బరినీటి ఉత్పత్తులు రెడీ అయ్యాయి. పాల ఉత్పత్తిదారుల కోసం అముల్‌ కంపెనీ ఉన్నట్లు... కొబ్బరి రైతుల కోసం కల్పామృత పాజిటివ్‌ కార్పొరేట్‌ స్ట్రక్చర్‌ వచ్చింది. ఇప్పుడు ఆరువందల మంది రైతులు కల్పామృతతో అనుసంధానమయ్యారు.

కన్నడ రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకం
శ్రావణ బెళగొళలో గోమఠేశ్వరునికి పన్నెండేళ్లకోసారి జరిగే వేడుక మహామస్తకాభిషేకం. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. ప్రభుత్వం మూడు వందల కోట్లు కేటాయించింది. సింధూరి హసన్‌కు వచ్చే నాటికి మస్తకాభిషేకానికి ఆరు నెలలే ఉంది. పనులు మొదలుకాలేదు. ఇంకా ఆలస్యం చేస్తే పనులు జరగవు. వేగంగా, సిస్టమాటిక్‌గా ఆదేశాలిస్తోందామె. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి మంజుకి కష్టంగా తోచింది. దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. శానిటేషన్, ట్రాన్స్‌పోర్ట్, వైద్య సహాయం, మంచినీరు, ఇతర అరేంజ్‌మెంట్స్‌ అన్నీ సక్రమంగా జరగాలని వర్క్‌ టెండర్‌లు వేసిన వాళ్లకు కండిషన్‌ పెట్టారామె. రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకమైన ఈ వేడుకలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాని విధంగా ఏర్పాట్లు జరగడానికి ఆమె రూపొందించిన ప్రోగ్రామ్‌కి ముఖ్యమంత్రి నుంచి ఆమోదం వచ్చింది. దాంతో మంత్రి మంజు జోక్యం తాత్కాలికంగా తగ్గిపోయింది. 

మంత్రిగారికి గాయమైంది!
మస్తకాభిషేకానికి 40 లక్షల మంది వచ్చారు. ఎవరికీ చిన్న గాయం కూడా కాలేదు. కానీ మంత్రి గారి మనసు వేడుకకు ముందే బాగా గాయపడింది. జిల్లాలో ఇదే కలెక్టర్‌ కొనసాగితే తనకు కష్టం అని పదే పదే హెచ్చరించసాగిందాయన మనసు. మస్తకాభిషేకం ఇక రోజుల్లోకి వచ్చేసినప్పుడు తన పరపతిని ఉపయోగించి బదిలీ చేయించారు. అప్పుడు వచ్చింది ప్రజాగ్రహం ఒక వెల్లువలాగ. అప్పటికే ఆమె రెండో సర్వే చేయించి కరవు రైతులకు కేంద్రం నుంచి 60 కోట్లు విడుదల చేయించింది. రైతులకు బీమా డబ్బు అందుతోంది. ఈ కలెక్టర్‌ మారిపోతే తమ గోడు పట్టించుకునే నాథుడెవరూ ఉండరనే ఆందోళన వారిలో. ఇక ప్రభుత్వానికి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోక తప్పలేదు.
– వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement