మానవతకు ప్రేరణ
ఈ విద్యార్థి బృందం తమ సెలవులను గడపడంలో ఓ సృజనాత్మకత ఉంది. వారు తమ కార్యకలాపాలకు పెట్టుకున్న పేరు... ‘ప్రేరణ’లో ఓ చైతన్యం ఉంది. వారు వేసే అడుగులకు ఒక సత్‌సంకల్పం ఊతమైంది. వారి సంకల్పబలం ఎంతోమందికి జీవితాన్ని ఇస్తోంది. అనాథలు, వికలాంగులు, వృద్ధులు అని లేకుండా... అవసరంలో ఉన్నవారెవరి వద్దకైనా వాళ్లు వెళ్తారు. వారి అవసరాలను తీర్చేందుకు ప్రయత్నిస్తారు. వారి నైపుణ్యాలకు మెరుగులు దిద్దుతారు. వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు సహకరిస్తారు. ఐదుగురు స్నేహితులు మానవత్వంతో తిరుపతిలో మొదలు పెట్టిన ఈ సేవ, ఇప్పుడు ఆ పట్టణాన్ని దాటి, రాష్ట్రాన్ని దాటి, మెల్లగా ఇతర రాష్ట్రాలలోనూ విస్తరిస్తోంది!
తల్లిదండ్రులు చేతిఖర్చులకిచ్చే డబ్బుతో పబ్‌లు, డిస్కో థెక్‌లు, సినిమాలు, విందులు వినోదాల్లో రిలాక్సవడం - ఆ తర్వాత చదువులు, ఉద్యోగాల్లో బిజీ అవడమే యువతరం జీవన విధానం అనుకుంటాం. కానీ కొందరు విద్యార్థులు అలా కాదు. సెలవుల్లో అనాథలు, వికలాంగులు, వృద్ధుల ఆలనాపాలనాలో మునిగిపోతారు. వీరిలో నాన్న ఇచ్చిన పాకెట్ మనీలో కొంత అనాథలకు వెచ్చిస్తారు. నెల జీతంలో పది శాతాన్ని సేవలకు ఖర్చు చేసేవారూ ఉన్నారు. సేవామార్గంలో సాగుతూ మానవత్వానికి ‘ప్రేరణ’గా నిలుస్తోన్న మిత్రబృందం... సుధాకర్, రాజశేఖర్, భార్గవి, ఆక్లేష, ప్రవీణ్‌కుమార్‌ల కథ ఇది.
ఈ స్నేహితులందరూ ఒక క్లాసు వాళ్లు కాదు, ఒక కాలేజీ వాళ్లు కూడా కాదు. తిరుపతిలో వేర్వేరు కాలేజీల్లో చదువుకునేవారు. 2007లో అనుకోకుండా ఒకరికొకరు పరిచయమయ్యారు. అందరి అభిప్రాయాలు, ఆలోచనలూ ఉండటంతో... అనాథలు, వికలాంగులు, వృద్ధులకు ఆనందాన్ని పంచి వారికి జీవితం పట్ల భరోసా కల్పించాలని భావించారు. అదే ఏడాది ఆగస్టు 15వ తేదీన తిరుపతిలో జగన్మాత చర్చి అనాథాశ్రమంలో ‘ప్రేరణ’ అనే సంస్థను స్థాపించారు. సెలవు రోజుల్లో తిరుపతి, ఆ పరిసరాల్లోని అనాథ, వృద్ధ ఆశ్రమాలను సందర్శిస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతో అనాథలకు అవసరమైన వస్తువులను సమకూర్చి, వైద్యం చేయిస్తున్నారు.
ఒక ఆదివారం రోజు... ప్రేరణ బృందం తిరుపతిలోని నవజీవన్ బ్లైండ్ స్కూల్‌ను సందర్శించింది. విద్యార్థులకు అవసరమైన సబ్బులు, తలనూనెలు, షాంపూ, టూత్‌పేస్టుతోపాటు తినుబండారాలు ఇచ్చింది. అంధ విద్యార్థులను ఆ రోజంతా ఆటపాటలతో ఉత్సాహపరిచింది. సాయంత్రం బయటకు వచ్చే సమయంలో రోజా అనే విద్యార్థిని.. ‘నా కాళ్లపై నేను నిలబడగలిగేలా చేయండి అన్నా’ అన్నది. ‘‘ఆ మాటలు వారిని కదిలించాయి. ఆమె కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నారు. సంగీతం పట్ల రోజాకు ఉన్న అభిరుచిని గుర్తించి, ఆ విభాగంలో ఆమెకు శిక్షణ ఇప్పించారు. ఆగస్టు 15, 2008న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన ప్రేరణ ప్రథమ వార్షికోత్సవంలో రోజా ఆలపించిన గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి. తన కాళ్లపై తాను నిలబడగలననే ధైర్యం రోజాకు వచ్చింది. ఇది ప్రేరణ బృందానికి గొప్ప ప్రేరణ అయింది.
విస్తరించిన సైన్యం...
ఏడేళ్ల కిందట ఐదుగురితో ప్రారంభమైన ‘ప్రేరణ’ సైన్యం ఇప్పుడు 250 మందికి చేరుకుంది. తిరుపతి నుంచి చెన్నై, బెంగుళూరు వంటి నగరాలతోపాటూ కడప జిల్లాకూ సేవలను విస్తరించింది. అప్పటి విద్యార్థులు ఇప్పుడు తలా ఓ చోట ఉద్యోగంలో చేరి కూడా తమ కార్యకలాపాలకు విఘాతం కలగకుండా చూసుకుంటున్నారు. జీతంలో పది శాతాన్ని ‘ప్రేరణ’కు అందిస్తున్నారు. తమ సేవా కార్యక్రమాలను విస్తరించారు. స్నేహితులను కలుపుకుంటూ తమ సైన్యాన్ని పెంచుకుంటున్నారు. సెలవు దొరికితే చాలు... అందరూ కలిసి తిరుపతి, చెన్నై, బెంగళూరుల్లో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, మానసిక వికలాంగుల కేంద్రాలకు వెళ్తున్నారు.
వికలాంగుల బాగోగులను విచారిస్తూ... వారిలో దాగిన నైపుణ్యాన్ని వెలికితీసి, సానపడుతున్నారు. ప్రేరణ బృందం సహాయంతో తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం సమీపంలోని అక్షయ కేంద్రంలోని మానసిక వికలాంగ బాలలైన నారాయణ, జ్యోతిలు వైకల్యం పోయి సాధారణ బాలలుగా మారారు. ఇదే కేంద్రంలోని మానసిక వికలాంగులు నృత్యంలో శిక్షణ పొందుతున్నారు. ఢిల్లీలో నవంబర్ 14, 2014న నిర్వహించే బాలల దినోత్సవంలో నృత్య ప్రదర్శనకు ఈ బృందం ఎంపికైనట్లు ‘ప్రేరణ’ కో-ఆర్డినేటర్ బాషా చెప్పారు.
తమ సేవలను ఇంతగా విస్తరించడం వెనుక ప్రేరణ సభ్యులు పడిన శ్రమ చాలానే ఉంది. ఆర్థిక సమస్యలతో పాలు ఇతరత్రా సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. అమ్మాయిలకు అయితే... ఇంట్లో అనుమతి దొరికేదు కాదు. అబ్బాయిలుంటారు కాబట్టి సేవ చేయడానికి పంప డానికి తల్లిదండ్రులు ఒప్పుకునేవారు కాదు. కానీ ‘ప్రేరణ’ చేస్తున్న కార్యక్రమాలు చూశాక వారి మన సులు మారాయి. ఆడపిల్లలను సైతం ధైర్యంగా పంపించారు.
పాకెట్ మనీని అధికంగా ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. దాంతో చాలామంది అమ్మాయిలు కూడా ప్రేరణ కార్యక్రమాల్లో పాలుపంచు కుంటున్నారు. వీళ్లందరి సేవలూ అనాథ, వృద్ధ, మానసిక వికలాంగుల ఆశ్రమాలకే పరిమితం కాలేదు. బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లు, వైద్య శిబిరాలు, బస్టాండులు, దేవాలయాలను శుభ్రం చేయడం వరకూ విస్తరించాయి. ఇంత చిన్న వయసులో వీరు చేస్తోన్న సేవకి హ్యాట్సాఫ్ చెప్పి తీరాలి!
- ఎ.రామగోపాల్‌రెడ్డి, సాక్షి, తిరుపతి
ఫొటోలు: కె.గిరిబాబు