నాడు హెచ్‌ఐవీ పేషెంట్.. నేడు బాడీ బిల్డర్
► ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు స్ఫూర్తిదాయకం
► పట్టుదలతో హెచ్‌ఐవీని జయించిన వైనం
► మిస్టర్ మణిపూర్, మిస్టర్ సౌత్ ఏషియా నిలిచిన మణిపూర్ వాసి
సాక్షి, మణిపూర్: సంకల్పం మనిషిని ఎన్ని మెట్లు అయినా ఎక్కిస్తుంది.. చేరుకోలేని విజయ తీరాలకు చేరుస్తుంది.. ఈ మాటకు నేడు సజీవ సాక్ష్యంగా నిలిచాడు మణిపూర్‌కు చెందిన బాడీ బిల్డర్ ప్రదీప్ కుమార్ సింగ్. 2007లో మిస్టర్ మణిపూర్‌గా, 2012లో మిస్టర్ సౌత్ ఏషియా టైటిల్ గెలిచిన ప్రదీప్ నిజ జీవితంలో ఒక హెచ్‌ఐవీ పేషెంట్. 2000 సంవత్సరంలో అనుకోకుండా రక్త పరీక్షలు చేయించుకోవడంతో తనలో ఉన్న ప్రాణాంతక వ్యాధి బయట పడిందని ఆయన తెలిపాడు. హెచ్‌ఐవీ అనే విషబీజం తనలో ఉన్నా.. దానికెప్పుడు భయపడలేదని.. దానిని జయించేందుకు మార్గాలు అన్వేషించానని నేడు గర్వంగా చెబుతున్నాడు.
బాడీ బిల్డర్‌గా..
హెచ్‌ఐవీ ఉందని తెలిశాక ప్రదీప్‌కుమార్‌ని బంధువులు, తెలిసిన వారు, స్నేహితుల, గ్రామస్థులు దాదాపుగా అందరూ వెలివేసినంత పనిచేశారు. ఈ పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం కోల్పోని ప్రదీప్ తన సోదరి సూచనతో బాడీ బిల్డింగ్‌వైపు దృష్టి సారించాడు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం, క్రమపద్దతిలో ఆహారం తీసుకోవడంతో శరీరాన్ని పెంచుకున్నాడు.
పట్టుదలతో..
హెచ్‌ఐవీని జయించడంలో శారీరక ఆరోగ్యానిది ప్రధానపాత్ర కావడంతో తీసుకునే ఆహారం మొదలు.. చేసే వ్యాయామం.. అందుకు తగ్గ విధంగా బాడీ బిల్డింగ్ ఎక్సర్‌సైజులను పట్టుదలతో చేసేవాడు. తనలో ఒక వైరస్ ఉందన్న విషయాన్ని సైతం మర్చిపోయి బాడీ బిల్డింగ్ మీదే దృష్టి నిలిపాడు. ఆ క్రమంలోనే 2007లో మిస్టర్ మణిపూర్‌గా, 2012లో మిస్టర్ సౌత్ ఏషియాగా నిలిచాడు.
17 ఏళ్లుగా...
ప్రదీప్ కుమార్‌కు హెచ్‌ఐవీ బయటపడి సరిగ్గా 17 సంవత్సరాలు.. ఇన్నేళ్లలో అతను చిన్నచిన్న అనారోగ్యాలను కూడా గురికాలేదు. తనలాగే హెచ్‌ఐవీ బాధితులంతా.. మనో నిబ్బరంతో, పట్టుదలతో శరీరాన్నికాపాడుకుంటే వ్యాధిని జయించడం పెద్ద కష్టమేం కాదని ప్రదీప్ చెబుతున్నాడు. హెచ్‌ఐవీ సోకితే జీవితం ముగిసిపోయిందన్న మాటకు ముగింపు పలకడమే తన లక్ష్యం అని పేర్కొన్నాడు.
ఫిజికల్ ట్రయినర్‌గా..
ప్రస్తుతం ప్రదీప్ కుమార్ వయసు 45 ఏళ్లు. బాడీ బిల్డర్‌గా అతను సాధించిన విజయాలను దృష్టిలో పెట్టుకుని మణిపూర్ ప్రభుత్వం అతడిని యువ క్రీడాకారులకు ఫిజికల్ ట్రయినర్‌గా నియమించింది. అంతేకాక హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌కు అతన్ని ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం చేసింది.