నిత్య కళ్యాణ చక్రవర్తిగా అలరారుతూ... అఖండ భక్తజనానికి ఆయువై నిలిచిన శ్రీవేంకటేశ్వరుడి రూపం చూసిన వారికి తనివి తీరదు. చూడాలనే కోరిక చావదు. నేడు నిత్యం లక్ష మందికిపైగా దర్శన భాగ్యం పొందుతున్న పవిత్ర సాలగ్రామ శిలా దివ్యమూర్తి.. దివ్యమంగళ విగ్రహాన్ని ఆ పాద మస్తకం భక్తులకు తెలియజెప్పే ప్రయత్నమే ఈ కథనం. బంగారుపద్మ పీఠంపై శ్రీవారి కనకపు పాదాలు... గజ్జలు, అందెలు, ఆపై ఘనమైన పట్టుపీతాంబరం... ఆ పీతాంబరం కుచ్చులపై జీరాడుతూ... వేలాడుతున్న సహస్ర నామాల మాలలు. బొడ్డుదగ్గర సూర్య కటాది అనబడే నందక ఖడ్గం, నడుమున బిగించి ఉన్న వడ్డాణం, బంగారు మొలతాడు, వజ్ర ఖచిత వరదహస్తం, తన పాదాలే పరమార్థమని చూపిస్తున్న వైకుంఠహస్తం. ఎడమవైపున ఉన్న కటిహస్తం, కౌస్తుభమణి నవరత్న హారాలు, వక్షస్థలంపై వ్యూహ లక్ష్మి, శ్రీదేవి భూదేవి పతకాల హారాలు, కంఠమాలలు, బంగారు యజ్ఞోపవీతం.
చేతులకు నాగాభరణాలు, భుజకీర్తులు. భుజాల నుంచి పాదాల వరకు వ్రేలాడుతున్న సాలగ్రామ మాలలు. భక్తులకు అభయమొసగే శంఖు చక్రాలు. చరగని తరగని చిరుమందహాసంతో నల్లనిమోము కలిగి నిగనిగలాడే చెక్కిళ్లు కలిగి, దొండపండు వంటి పెదవులు... ఆ పెదవుల కింద చుబుకంపైన చక్కనైన తెల్లని కర్పూరపుచుక్క. సొగసైన నాసిక, నొసటన తెల్లని నామం, భక్తులను కరుణిస్తూ ఉన్న అరవిరిసిన చూపులు. శిరసుపై నవరత్నాల మకుటరాజం. ఆపైన బంగారు మకర తోరణం... ఇలా ఆ మూలమూర్తి నిలువెత్తుగా అలంకరింప బడ్డ సుగంధ మనోహర సుమమాలలతో నిగమ.. నిగమాంత వేద్యుడైన ఆ స్వామి వారిని దర్శించిన వారు రెప్పపాటు కాలమైనా...రెప్పవాల్చకుండా శ్రీవారిని తనివితీరా దర్శించి ఆనందపుటంచులను తాకుతున్నారు.
తిరుమల కొండపై స్వయంభువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు అన్ని ఉత్సవాల కంటే విలక్షణమైనవి.. విశిష్టమైనవి... వైభవోపేతమైనవి. లోక క్షేమార్థం.. నిత్యపూజాహీన ప్రాయశ్చిత్తార్థం, నిత్యపూజాదోష ప్రాయశ్చిత్తార్థం, సర్వ అశుభ నివారణార్థం శ్రీవారి బ్రహ్మోత్సవాలు చేస్తారు. భగవంతుని మూలబింబంలో (ధ్రువబేరం) ఉండే శక్తి అభివృద్ధికి కూడా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అందుకే ఈ ఉత్సవాలను మహోత్సవాలని, తిరునాళ్లు అని, కల్యాణోత్సవాలు అని కూడా అంటారు. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో అశ్వయుజ శుద్ధపాడ్యమి మొదలు అశ్వయుజ శుద్ధదశమి వరకు తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా... జగజ్జేయమానంగా ఉత్సవాలు జరుపుతారు. సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ దగ్గరుండి నిర్వహించటం వల్లే ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలని పేరు.
కలౌ వేంకటనాయకః
సహజసుందర క్షేత్రాల్లో తిరుమల క్షేత్రం దివ్యమైనది... సుందరమైంది... భవ్యమైంది... నిత్య నూతనమైంది. బ్రహ్మాండమంతా వెదికినా ఈ పుణ్యక్షేత్రంతో ఏ క్షేత్రమూ సాటి రాదని ప్రతీతి. తిరుమల క్షేత్రం ఎన్నో పేర్లతో... అనేక శిఖరాలు... వివిధ లోయలు.. తీర్థాలతో భూలోక వైకుంఠంగా వన్నెకెక్కింది. సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఈ తిరుమల దివ్యక్షేత్రంలో విలసిల్లే దేవదేవుడు శ్రీవేంకటేశ్వరస్వామి. ఈ స్వామి సకల దేవతాస్వరూపం. అందుకే ఈయన ‘కలౌ వేంకటనాయకః’ అని కీర్తింప బడ్డాడు. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి. ఈ స్వామిని దర్శించటానికి దేశ నలుమూలల నుండే కాకుండా... ప్రపంచపు నలుమూలల నుండి, విశ్వాంతర్భాగాల నుండి రుషులు, దేవతలు, దిక్పాలురు వేంచేసి కనులపండువగా... తన్మయత్వంతో, అనన్యభక్తితో ప్రతినిత్యం స్వామిని దర్శిస్తుంటారు.
బ్రహ్మాదిదేవతలంతా కూడా స్వర్గం నుండి శ్రీవేంకటాద్రికి వచ్చి నిత్యోత్సవాలను, బ్రహ్మోత్సవాలను భక్తి పూర్వకంగా తిలకిస్తారని ప్రతీతి.శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీవేంకటేశ్వరుని వైభవం ఇంతా అంత కాదు. అమితవైభవం గా జరిగే ఈ ఉత్సవాలకు ఎంతో మంది భక్తులు తరలి వచ్చి శ్రీవారి సేవలో పాల్గొని తరిస్తారు. జన్మధన్యమైందని భావిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు తిరుమలకు చేరుకున్నవారు, స్వామి వారిని దర్శించుకున్న వారు∙ధన్యాత్ములు, పుణ్యాత్ములు. రాలేని వారు, చూడలేనివారు కనీసం మనోనేత్రాలతో వీక్షించినా ఫలదాయకమేనని శాస్త్రోక్తి.ఎంతటి అధికారి అయినా... దేశానికి రాజైనా... శ్రీవారి పడికావలి ముందు వరకు మాత్రమే అనుమతి. పడికావలి దాటాక శ్రీవేంకటేశ్వర స్వామి వారి మూలమూర్తి సువర్ణ పద్మపీఠంపై స్వయంవ్యక్త సాలగ్రామ శిలారూపంలో కొలువై ఉంటాడు.
– తిరుమల రవిరెడ్డి, సాక్షి, తిరుపతి
– ఫొటోలు: మోహనకృష్ణ కేతారి
Comments
Please login to add a commentAdd a comment