
భక్తీ... బ్రేక్‌ఫాస్ట్
సూర్యుడు... చంద్రుడు. తమిళులు... ఆంధ్రులు.
మనం చంద్రుణ్ణి ఫాలో అవుతాం.
చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకుని కాలాన్ని లెక్కేసుకుంటాం.
తమిళులు సూర్యుణ్ణి ఫాలో అవుతారు.
సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో చూసుకుని వాళ్లు కాలాన్ని లెక్కేసుకుంటారు.
ఆ లెక్కన ధనుర్మాసం తమిళమాసం.
మరి మనమెందుకు తెల్లారే లేస్తున్నాం? మనమెందుకు తిరుప్పావై వింటున్నాం?
భక్తికి ఎల్లల్లేవు. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌కీ..! అందుకే ఈవారం... తమిళ ఆహారం.
కాంచీపురం ఇడ్లీ
కావలసినవి: బాయిల్డ్ రైస్ - అర కప్పు; ముడి బియ్యం - అర కప్పు; మినప్పప్పు - అర కప్పు; పోపు కోసం: నువ్వులు - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; నెయ్యి - 3 టీ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; మినప్పప్పు - ఒకటిన్నర టీ స్పూన్లు; సెనగ పప్పు - టీ స్పూను; మిరియాలు - 2 టీ స్పూన్లు (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి); జీలకర్ర - టీ స్పూను; అల్లం తురుము - టీ స్పూను; పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు; ఇంగువ - పావు టీ స్పూను; జీడిపప్పులు - 10 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కరివేపాకు - 2 రెమ్మలు; పసుపు - చిటికెడు; కొత్తిమీర - 3 టేబుల్ స్పూన్లు.
తయారీ: ఒకపాత్రలో ముడిబియ్యం, బాయిల్డ్ రైస్‌ను సుమారు ఆరు గంటలు నానబెట్టి మిక్సీలో వేసి మెత్తగా పిండి చేయాలి ఒక పాత్రలో మినప్పప్పును సుమారు 5 గంటలు నానబెట్టి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ఒక గిన్నెలో రెండు పిండి మిశ్రమాలు, ఉప్పు వేసి బాగా కలిపి (మరీ పల్చగా, మరీ గట్టిగా కాకుండా చూడాలి) ఒక రోజు రాత్రంతా నాననివ్వాలి మరుసటి రోజు, పిండిలో పసుపు, కొత్తిమీర వేసి కలపాలి బాణలిలో నెయ్యి వేసి కాగాక... పోపు కోసం చెప్పిన పదార్థాలను ఒక్కటొక్కటిగా వేస్తూ వేయించాక, పిండి మిశ్రమంలో వేసి కలపాలి ఇడ్లీ స్టాండ్‌లలో ఇడ్లీలు వేసి సుమారు పావు గంటసేపు ఆవిరి మీద ఉడికించాలి కొబ్బరి పచ్చడి, సాంబారు, ఇడ్లీ పొడులతో అందించాలి.
అక్కెర వడెసల్
కావలసినవి: బియ్యం - అర కప్పు; పెసరపప్పు - 3 టేబుల్ స్పూన్లు; బెల్లం పొడి - అర కప్పు; మరిగించిన చిక్కటి పాలు - 3 కప్పులు + 1 కప్పు నీళ్లు. నెయ్యి - పావు కప్పు; జీడిపప్పులు - 6 (చిన్నచిన్న ముక్కలు చేయాలి); కిస్‌మిస్ - 10; కుంకుమపువ్వు - కొద్దిగా; ఏలకుల పొడి - కొద్దిగా; పచ్చ కర్పూరం - కొద్దిగా.
తయారీ: బాణలిలో బెల్లం పొడి, నీళ్లు వేసి బెల్లం కరిగేవరకు బాగా కలిపి స్టౌ మీద ఉంచి మధ్యస్థం మంట మీద సుమారు ఐదు నిమిషాలు పాకం చిక్కబడేవరకు కలుపుతుండాలి బియ్యం, పెసరపప్పులను బాగా కడిగి, నీరంతా ఒంపేసి, వేరొక బాణలిలో నూనె లేకుండా దోరగా వేయించాలి మందపాటి పాత్రలో మూడు కప్పుల పాలు పోసి, అందులో బియ్యం పెసరపప్పు వేసి బాగా కలిపి (పాలు పొంగిపోకుండా ఉండేందుకు అందులో ఒక చిన్న ప్లేట్ ఉంచాలి) కుకర్‌లో ఉంచి స్టౌ మీద పెట్టి, నాలుగైదు విజిల్స్ వచ్చాక దింపి, ఈ మిశ్రమాన్ని మెత్తగా మెదపాలి బెల్లం పాకం జత చేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి, కప్పు పాలు కలిపి సుమారు 5 నిమిషాలు సన్నని మంట మీద ఉంచాలి పచ్చ కర్పూరం, ఏలకుల పొడి వేసి బాగా కలిపి మరో ఐదు నిమిషాలు ఉంచాలి టీ స్పూను చల్లటి పాలలో కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి జీడిపప్పు, కిస్‌మిస్‌లను టీ స్పూను నేతిలో వేయించాలి స్టౌ మీద మిశ్రమం బాగా ఉడికిన తర్వాత అందులో కుంకుమపువ్వు కలిపిన పాలు, వేయించిన జీడిపప్పు కిస్‌మిస్‌లు వేసి బాగా కలిపి దించి వేడివేడిగా అందించాలి.
వెర్‌కడలై ముందిరి పకోడా
కావలసినవి: బియ్యప్పిండి - కప్పు; సెనగ పిండి - పావు కప్పు; వెర్‌కడలై (పల్లీలు) - కప్పు; ముందిరి (జీడిపప్పు) - 20; పుట్నాల పప్పు - 3 టీ స్పూన్లు; బటర్ - 2 టీ స్పూన్లు; కారం - టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత.
తయారీ: ముందుగా పల్లీలను వేయించి పైన పొట్టు తీసి పక్కన ఉంచాలి జీడిపప్పును చిన్న చిన్న ముక్కలుగా చేసి కొద్దిగా నేతిలో వేయించి పక్కన ఉంచాలి ఒక పాత్రలో బియ్యప్పిండి, సెనగపిండి, పల్లీలు, జీడిపప్పు, పుట్నాలపప్పు, కారం, బటర్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు జత చేసి పకోడీల పిండిలా కలపాలి బాణలిలో నూనె వేసి కాగాక ఈ పిండిని చిన్న చిన్న పకోడీలలా వేసి కరకరలాడే వరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసి, వేడివేడిగా అందించాలి.
అప్పం
కావలసినవి: ముడి బియ్యం - కప్పు; బాయిల్డ్ రైస్ - కప్పు; మినప్పప్పు - 3 టేబుల్ స్పూన్లు; మెంతులు - పావు టీ స్పూను; కొబ్బరి పాలు - కప్పు; పంచదార - అర టేబుల్ స్పూను; ఉప్పు - కొద్దిగా; కొబ్బరి నీళ్లు - టీ స్పూను; బేకింగ్ సోడా - పావు టీ స్పూను
తయారీ: ఒక పాత్రలో ముడి బియ్యం, మినప్పప్పు, మెంతులు వే సి తగినన్ని నీళ్లలో సుమారు ఆరు గంటలు నానబెట్టి, నీరు ఒంపేయాలి బాయిల్డ్ రైస్‌ను కూడా విడిగా నానబెట్టి నీళ్లు ఒంపేయాలి మిక్సీలో ఈ మూడు దినుసులతో పాటు, బాయిల్డ్ రైస్ కూడా వేసి మెత్తగా పట్టి, పాత్రలోకి తీసి, ఉప్పు, పంచదార జత చేసి, బాగా కలిపి మూత ఉంచి ఒక రోజు రాత్రంతా నాననివ్వాలి ఈ పిండి దోసె పిండి కంటె కొద్దిగా చిక్కగా ఉండాలి. పిండి మరీ గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా కొబ్బరి నీళ్లు కాని, మామూలు నీళ్లు కాని జత చేయాలి బేకింగ్ సోడా వేసి బాగా కలిపి సుమారు 20 నిమిషాలు ఉంచాలి పాన్ మీద కొద్దిగా నూనె వేసి వేడయ్యాక, పిండి మిశ్రమాన్ని దోసె మాదిరిగా వేయాలి రెండు పక్కలా నెయ్యి వేసి, మూత ఉంచి బాగా కాలిన తర్వాత తీసేయాలి కొబ్బరి పచ్చడితో రుచిగా ఉంటాయి.