దళితవర్గాల పెన్నిధి బాబూ జగ్జీవన్‌రామ్ బిహార్‌లో ప్రస్తుత భోజ్‌పూరి జిల్లాలోని చాందువా అనే గ్రామంలో 5 ఏప్రిల్ 1908న జన్మించారు. భారత రాజకీయాలలో ఆయనది ప్రత్యేక చరిత్ర. జాతీయోద్యమకాలం నుంచి అనేక ఉద్యమాలలో పాల్గొంటూ అంటరానితనాన్ని, వివక్షను, అవమానాలను ఎదుర్కొంటూ మొక్కవోని ధైర్యంతో ఎదుగుతూ స్వాతంత్య్రానంతరం నలభై ఏళ్ళపాటు అనేక పదవులు చేపట్టారు. సమర్థ పరిపాలనా దక్షుడిగా పేరొందారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడం వల్ల తల్లి వాసంతిదేవి అనేక కష్టాలకోర్చి చదివించింది. 1922లో ఆరాలోని మొదటి ఇంగ్లిష్ మీడి యం స్కూలులో తొలిసారి కులవివక్షను ఎదుర్కొన్నారు. పాఠశాలలో ప్రిన్సిపాల్ అంటరానివారికి వేరుగా కుండ పెట్టించిన చర్యను వ్యతిరేకిస్తూ ఆ కుండను పగులగొట్టారు. మెట్రిక్యులేషన్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై, బనారస్ హిందు విశ్వవిద్యాలయంలో 1927లో చేరారు. ఒక దళిత విద్యార్థిగా ఆయనకు హాస్టల్‌లో భోజనంగానీ, క్షురకర్మగానీ నిరాకరించారు.
దళిత మంగలి వచ్చినప్పుడే తన తలవెంట్రుకలు తీయించుకోవాల్సి వచ్చేది. జగ్జీవన్‌రామ్ కలకత్తా వర్సిటీ నుండి 1931లో బీఎస్సీ పట్టా పుచ్చుకున్నారు. అక్కడ కూడా సామాజిక వివక్షకు గురయ్యారు. గాంధీజీ స్ఫూర్తితో అక్కడ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1928లో 50వేల మందితో వెల్డిన్ వద్ద నిర్వహించిన మజ్దూర్ ర్యాలీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ దృష్టిని ఆకర్షించింది. 1935 భారత రాజ్యాంగ చట్టం అనుసరించి ఎన్నికలు ప్రకటించినప్పుడు షెడ్యూల్ కులాల వారికి శాసన సభలో కొంత ప్రాతినిధ్యం కల్పించారు. జాతీయవాదులు, బ్రిటిష్ ఉన్నతాధికారులు జగ్జీవన్‌రామ్‌ని ప్రోత్సహించారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 1937లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1935లో అఖిల భారత డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ ఏర్పాటు చేయడంలో జగ్జీవన్‌రామ్ చురుౖకైన పాత్ర నిర్వహించారు. ఆ సభలకు నైజాంకు చెందిన వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించారు. జగ్జీవన్‌రామ్ అంబేడ్కర్, గాంధీజీ వంటి వారి కృషివల్ల 1935లో హిందూ మహాసభ సదస్సులో అంటరాని వారికి దేవాలయాల్లో, మంచినీటి బావుల్లో ప్రవేశం ఉండాలని తీర్మానించింది. 1940లో సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా రెండుసార్లు జైలుశిక్ష అనుభవించారు. భారత రాజ్యాంగ సభలో స్వతంత్య్ర రాజ్యాంగంలో దళితుల హక్కులకోసం కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా భారతీయులకు ప్రాతినిధ్యం ఉండాలని వాదించారు. అంబేడ్కర్‌కు మద్దతుగా నిలిచారు.
1946లో జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో అతి పిన్న వయస్సులో జగ్జీవన్‌రామ్ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. కార్మిక సంక్షేమం గురించిన అనేక చట్టాలు విధివిధానాలు ఆయన మంత్రిత్వ శాఖ ద్వారా రూపొందాయి. నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలో పలు శాఖల్లో మంత్రిగా పనిచేశారు. ఆయన వ్యవసాయ ఆహార మంత్రిగా పని చేస్తున్నప్పుడే గ్రీన్ రెవల్యూషన్ విజయవంతంగా కొనసాగింది. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ నుంచి విడిపోయి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీని ఏర్పాటు చేశారు జనతా పార్టీతో కలిశారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఉపప్రధానిగా కొంతకాలం సేవలందించారు. స్వతంత్ర భారతదేశ పునర్నిర్మాణంలో జగ్జీవన్‌రామ్ అవిభాజ్య భాగం. గొప్ప పాలనా దక్షుడిగా, దళిత వర్గాలతో పాటు మొత్తం సమాజానికి సేవలందించి 50 సంవత్సరాల పాటు దేశంలోని అనేక మలుపుల్లో తానై ఉన్నారు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్, లోహియా, పెరియార్ రామస్వామి నాయకర్‌ల కృషి మూలంగానే ఈ దేశంలో దళితులకు అన్ని రంగాల్లో అవకాశాలు, కాలక్రమంలో బీసీలకు కూడా రిజర్వేషన్లు సాధ్యపడుతూ వస్తున్నాయని మర్చిపోకూడదు. మర్చిపోతే తమకు మేలు చేసిన చారిత్రక వ్యక్తులను మరిచి తమకు తామే అన్యాయం చేసుకున్నవారవుతారు.
(నేడు జగ్జీవన్‌రామ్ 112వ జయంతి సందర్భంగా)
బి.ఎస్. రాములు
వ్యాసకర్త చైర్మన్, తెలంగాణ బీసీ కమిషన్
మొబైల్ : 83319 66987
Comments
Please login to add a commentAdd a comment