సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో జరిగిన స్వాతంత్య్రోద్యమం, కుల నిర్మూలన కోసం జరిగిన సామాజిక సంస్కరణోద్యమం ఉమ్మడిగా కన్న ముద్దుబిడ్డ బాబూ జగ్జీవన్ రామ్. ఆయన్ని స్మరించుకోవడం అంటే భారతదేశ స్వాతంత్య్రం, సామాజికోద్యమ ప్రాంగణాన సంభవించిన సమున్నత ఘట్టా లను గుర్తు చేసుకోవడమే. జగ్జీవన్‌రామ్ మహోన్నత నాయ కత్వం, వ్యక్తిత్వం భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థకు మహా బలాన్ని చేకూర్చిపెట్టాయి.
1908 ఏప్రిల్ 5న జగ్జీవన్‌రామ్ బిహార్‌లో జన్మించాడు. సామాన్య చర్మకార కులం. చిన్ననాటే తండ్రి చనిపోవడంతో సాంఘిక, ఆర్థిక ఇక్కట్ల మధ్య చదువు కొనసాగించాడు. అయినా అణగారిన కులాల విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ను తీసు కోవడానికి నిరాకరించాడు. అదే సమయంలో విద్యలో ప్రతిభ కనబరిచిన ఇతర విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్పును పొందాడు. భోజ్‌పురితోపాటు హిందీ, ఇంగ్లిష్, బెంగాలి, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు.
ఆరా టౌన్ స్కూల్లో మంచినీళ్ల కుండని అంటుకోనివ్వని రూపంలో మొదటిసారిగా అంటరానితనం ఎదురయ్యింది. ఆయన ముట్టుకున్న కుండ లోని నీరును తాగడానికి కొందరు విద్యార్థులు నిరాకరిం చారు. దీంతో ఎస్సీ కులాల విద్యా ర్థులకు స్కూల్లో ప్రత్యేక మంచినీటి కుండను ఏర్పాటు చేశారు. ఈ అవమానాన్ని సహించలేని జగ్జీవన్, పెట్టిన ప్రతి కుండను పగలగొట్ట సాగాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న స్కూలు హెడ్మాష్టర్ చివరికి అందరికీ ఒక్కటే కుండను ఏర్పాటు చేశాడు.
బిహార్‌లో 1934లో వచ్చిన భయంకరమైన భూకంపం సందర్భంగా పునరావాస చర్యలు చేపట్టాడు. తన బృందంతో ఆహోరాత్రులు శ్రమించి ఆహారం, బట్టలు, ఔషధాలు, మంచి నీరు, ఆశ్రయం మొదలైన సౌకర్యాలు బాధితులకు అందే విధంగా సహాయ శిబిరాలు నిర్వహించాడు. ఈ సందర్భంలోనే మొదటిసారిగా గాంధీజీని కలుసుకోవడం తటస్థించింది.
కమ్యూనిస్టు మేనిఫెస్టో, పెట్టుబడి గ్రంథాలతో పాటు ఇతర సోషలిస్టు సాహిత్యం అధ్యయనం చేశాడు. అప్పటికే కులరహిత, వర్గరహిత భావజాలం కలిగిన ఆయనపై ఇది ఎంతగానో ప్రభావం చూపింది. బ్రిటిష్ వలసవాద సంకెళ్ళు తెంపి, దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించాలని, సామాజిక సమానత్వం నిర్మిం చాలని విద్యార్థి దశలోనే సంకల్పించుకున్నాడు. సాంఘిక సంస్కరణ కోసం ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ స్థాపించాడు. 28 ఏళ్ళ వయసులోనే శాసన జీవితం ప్రారంభించాడు. సాంఘిక సంస్కరణ కోసం చేస్తున్న ఉద్యమంలో భాగంగా అణగారిన కులాలవారికి ఓటు హక్కు ఉండాలని 1935లో హేమండ్ కమిటీ ముందు నినదించాడు. 1937లో బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ నుంచి 14 రిజర్వుడు స్థానాలకు అభ్యర్థులను పోటీకి నిలిపాడు.
ఎటువంటి వ్యతిరేకత లేకుండా అందరూ గెలవడంతో ఒక రాజకీయ నిర్ణయాత్మక శక్తిగా, కింగ్ మేకర్‌గా ఎదిగాడు. 1946 ఆగస్టు 30న భారతదేశంలో మధ్యం తర ప్రభుత్వం ఏర్పాటు చెయ్యవలసిందిగా బ్రిటిష్ వైస్రాయి ఆహ్వానించిన పన్నెండుమంది దేశ నాయకుల్లో జగ్జీవన్‌రామ్ ఒకరు. ఆ మధ్యంతర ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా ఉన్నాడు. రికార్డు స్థాయిలో సుదీర్ఘ కాలం పార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా ప్రజారాజ్య నిర్మాణానికి కృషి చేశాడు.
జగ్జీవన్‌రామ్ గొప్ప దార్శనికత, అనుభవం వున్న రచయిత అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయన హిందీలో, ఇంగ్లిష్‌లో రచనలు చేశారు. ప్రజలు జగ్జీవన్‌రామ్‌ను ప్రేమగా ‘బాబూజీ’ అని పిలిచేవారు. సామాజిక, రాజకీయ బానిసత్వంపై జీవితాంతం యుద్ధం చేసిన బాబూజీ ఎప్పటికీ స్ఫూర్తిప్రదాత, భారత అమూల్య రత్నం.
-సంపత్ గడ్డం
కామారెడ్డి జిల్లా ‘ మొబైల్ : 78933 03516
Comments
Please login to add a commentAdd a comment