కదిలించిన పునాది | Buniyad entered the second serial on Indian television | Sakshi
Sakshi News home page

కదిలించిన పునాది

Published Tue, Feb 5 2019 11:50 PM | Last Updated on Tue, Feb 5 2019 11:50 PM

Buniyad entered the second serial on Indian television - Sakshi

ఇటుక పునాది మీద ఇల్లు నిలబడుతుంది. అనుబంధం పునాది మీద కుటుంబం నిలబడుతుంది.కాని పునాది కదిలే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అప్పుడు గెలిచేది ఎవరు? నిలిచేది ఎవరు? భారత్, పాక్‌ విభజన తర్వాత లాహోర్‌ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన ఒక కుటుంబ కథే బునియాద్‌. బునియాద్‌ అంటే పునాది అని అర్థం. అందరి మనసులనూ కదిలించిన పునాది ఈ సీరియల్‌. 

లైవ్‌ షో బిగ్‌బాస్‌ సీజన్స్, అతీంద్రియ శక్తులతో సాగే నాగిని వంటి సీరియల్స్‌ను ఆవిష్కరించే టీవీ గురించి ఈ రోజుల్లో ఇంతే తెలుసు మనకు. కానీ, టీవీకి స్వర్ణయుగం అనిపించే కాలం ఒకటుంది. అవి దూరదర్శన్‌ వచ్చిన తొలినాటి రోజులు.  ఇండియన్‌ టెలివిజన్‌లో రెండవ సీరియల్‌ అడుగుపెట్టిన ‘బునియాద్‌’ అతి కొద్ది కాలంలోనే తన సత్తా ఏంటో చూపింది. అప్పుడప్పుడే దూరదర్శన్‌ అడ్వరై్టజింగ్‌ కంపెనీలకు టైమ్‌ స్లాట్‌లను అమ్ముతోంది. సంపన్న కుటుంబాలు టీవీ సెట్స్‌ను కొనుగోలు చేస్తున్నాయి. మధ్యతరగతి వర్గం టీవీని సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది.

ఆ రెండు వర్గాలని ఆకట్టుకునేలా రిచ్‌ స్టోరీస్‌ ప్లానింగ్‌ దూరదర్శన్‌లో జరుగుతోంది. ఆ క్రమంలో ఇండియన్‌ ఆడియన్స్‌ నాడిని పట్టుకున్నారు దర్శకుడు రమేష్‌ సిప్పి. దేశీయ మూలాల్లోకి వెళ్లాడు. మనసు తడిని కళ్లలో చూపించే బలమైన కుటుంబాన్ని పట్టుకున్నాడు. ‘బునియాద్‌’ పేరుతో ఠీవిగా ముందుకొచ్చాడు. గుండె గుండెలో ఇది మేమే అనిపించాడు. ఇది మాదే అనిపించాడు. జ్యోతి స్వరూప్‌ తన దర్శకత్వ ప్రతిభనూ జత కలిపారు. 

కథలోకి వస్తే... 
ఇండియా – పాకిస్థాన్‌ విడిపోకముందు అంతా ఒకే దేశం. అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఒకే కుటుంబంగా జీవించారు. విడిపోయాక.. ఏమైంది? ఇదే కథ. అందుకే విడిపోకముందు.. (1916 నుంచి 1978 )తర్వాత పరిస్థితులను ఈ సీరియల్‌లో చూపించారు. అప్పటికి దేశమంతటా నాటకాలంటే విపరీతమైన పిచ్చి ఉంది. ఆ పిచ్చిని ‘బునియాద్‌’ తన వైపు తిప్పుకుంది. దీంతో నాటకం తెర తీయడానికే తీవ్రమైన కృషి చేయాల్సి వచ్చింది.  

బునియాద్‌ ఒక స్టోరీ కాదు
సీరియల్‌ మొదలవడమే 1915 నాటి పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఒక అందమైన కుటుంబం... స్వాతంత్య్రానంతరం జరిగిన పరిణామాలను కళ్లకు కడుతుంది. దేశవిభజన ఆ అందమైన కుటుంబాలను ఎలా ఛిద్రం చేసిందో చిత్రిస్తుంది. లాహోర్‌ నుంచి అనేక మలుపులు తిరుగుతూ కథ 1986లో ఢిల్లీ చేరుతుంది. అక్కడ శరణార్థ శిబిరాలలో తలదాచుకున్న వారి కష్టాలను పరామర్శిస్తుంది. నిజానికి బునియాద్‌ కొన్ని కుటుంబాల కథల సమాహారం. అయినా ప్రధానంగా మాస్టర్‌ హవేలీరామ్, లాజోజీ (అలోక్‌నాథ్, అనితా కన్వర్‌)ల కుటుంబం చుట్టూతా తిరుగుతుంటుంది. హవేలీరామ్, లజోజీ దంపతులకు ముగ్గురు కొడుకులు భూషణ్, రోషన్, సత్బీర్‌. హవేలీరామ్‌ భార్య లాజోజి. తల్లి, తండ్రి, అన్న–వదిన, పిల్లలతో తన పూర్వీకుల కాలం నుంచి వుంటున్న ఇంట్లో సంతోషంగా జీవిస్తుంటాడు.

హవేలీ రామ్‌ది ఏం జరిగినా అంతా మనమంచికే అనుకునే తత్త్వం. కుల మతాలకు అతీతంగా ఉంటాడు. రాజకీయాలంటే మాత్రం ఆసక్తి చూపుతుంటాడు. స్వాతంత్య్రోద్యమంలోనూ పాల్గొంటాడు. ఇరుగుపొరుగుతోనూ, దేశంతోనూ వివిధ బంధాల మధ్య అల్లుకున్న అనుబంధాలెన్నో ఆ కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉంటాయి. చీకూచింతా లేకుండా హాయిగా జీవించే చక్కటి కుటుంబం దేశ విభజన సుడిగుండంలో చిక్కుకుని ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని అగచాట్ల పాలవుతుందో ఈ సీరియల్‌ చూపిస్తుంది. స్వతంత్రం వచ్చింది. దేశమంతటా వేడుకలు. ప్రతి మదిలో ఆనందోత్సాహాలు. స్వేచ్ఛాతరంగాలు అంతటా ప్రవహిస్తున్నాయి. అలాంటి సమయంలో దేశ విభజన అనివార్యమైంది.

కుటుంబరక్షణ వ్యవస్థలో ఆనందంగా గడిపే హవేలీరామ్‌ సాదా సీదా జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. జీవితకాలపు బాధలకు లోనయ్యేలా చేసింది. ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో కుటుంబం విచ్చిన్నం అవడం, పూర్వీకులంతా నివసించిన ఇంటిని వదిలి శరణార్ధుల శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఎదరవుతుంది. హవేలీరామ్‌ పాత్రను ఈ కథ కోసం తీర్చినట్టు అనిపించదు. మనమే ఆ పరిస్థితుల్లో ఉండి, కుటుంబాన్ని కోల్పోయి పడే బాధను అనుభవిస్తున్నట్టు ఉంటుంది. హిందూ–ముస్లిమ్‌ సమానత్వం కోసం ఆరాటపడే విధానం కళ్లకు కడుతుంది. భారతీయ సగటు తల్లికి ప్రతీకగా లాజోజి అత్యంత సాధారణంగా ఉంటుంది.

కుటుంబాన్ని పోగొట్టుకున్న ఆమె ఆ తర్వాతి కాలంలో ఒక అనాథ బిడ్డను దత్తత తీసుకొని పెంచుకునేంత పరిస్థితికి చేరుతుంది. ఈ కథలో కంటతడిపెట్టించే మరో కథనం వీరన్‌వలిది. హవేలిరామ్‌ చెల్లెలు ఈమె. లాహోర్‌లో గడిపిన మధుర క్షణాలు, వృషభన్‌తో ప్రేమకు ప్రతిఫలంగా పుట్టిన కన్న కొడుకును అక్రమసంతానంగా భావించిన సమాజాన్ని తట్టుకోలేని విధానం, పిరికి ప్రేమికుల భావోద్వేగాలు కంటతడిపెట్టిస్తాయి. బాబ్లీజీగా పేరు మార్చుకొన్నప్పటికీ తన బిడ్డను సింగిల్‌ పేరెంట్‌గా పెంచే ధైర్యం ఉండదు. కష్టపడి పనిచేయడంలో వచ్చే సంపాదన కన్నా గ్లామరస్‌గా ఉంటూ, డబ్బు సులువుగా వచ్చే క్యాబరే డ్యాన్సర్‌గా వృత్తిని ఎంచుకుంటుంది.

 ఒక కుటుంబం నుంచి మరికొన్ని కుటుంబాలను కలుపుతూ కథలు కథలుగా బునియాద్‌ సాగుతుంది. ప్రతి కుటుంబానికీ అందులోని కథ చేరువయ్యేలా పక్కా స్క్రిప్ట్‌ను ప్లాన్‌ చేసుకున్నాడు దర్శకుడు. ఒకరకంగా చెప్పాలంటే మహాభారత్‌లో కౌరవులు–పాండవుల మధ్య నడిచిన కథలా అదే సమయంలో వారి చుట్టూతా ఉన్న లెక్కలేనన్ని కుటుంబకథలు వచ్చి చేరినట్టుగా బునియాద్‌ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే, ఈ సీరియల్‌లోని ప్రతి పాత్రా నటించినట్లు కాకుండా సజీవ చిత్రణమే అన్నంత సహజంగా అనిపిస్తుంది.  

కొన్ని మూలాలు
బునియాద్‌ సీరియల్‌ 105 ఎపిసోడ్లుగా దూరదర్శన్‌లో 1986 నుంచి 1987 వరకు వారానికి రెండుసార్లు (మంగళ, శనివారాల్లో) ఏడాది పాటు ప్రసారమయ్యింది ∙బునియాద్‌ సీరియల్‌ ప్రసారమైన 27 ఏళ్ల తర్వాత ‘బునియాద్‌ రిటర్న్‌’పేరుతో జులై 25, 2013లో ప్రతి గురు, శుక్రవారాల్లో రాత్రి 8 గంటలకు సహారా ఒన్, 8:30కు దూరదర్శన్‌లో ప్రసారం చేశారు ∙ఈ సీరియల్‌లో నటించిన నటీనటులు చాలావరకు అంతకుముందు పేరొందిన డ్రామా ఆర్టిస్టులు ∙మన ఇళ్లలో మామూలుగా మాట్లాడుకునే సాధారణ వాడుక భాషను ఈ సీరియల్‌ ద్వారా తీసుకువచ్చారు ∙ఈ సీరియల్‌ దర్శకులు రమేష్‌ సిప్పి బిగ్‌ స్క్రీన్‌ మీద.. షోలే, షాన్, సాగర్‌.. వంటి సినిమాలతో ఓ వెలుగు వెలిగారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement