ఒకప్పుడు సీరియల్స్ అంటే అత్తాకోడళ్ల గొడవలే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమాల్లోలాగే బుల్లితెర మీద కూడా మాంచి ప్రేమకథలు కనువిందు చేస్తున్నాయి. ప్రేమ, రొమాన్స్, జెలసీలు, అలకలు... అన్నీ ఉంటున్నాయి సీరియల్స్‌లో. అయితే వింత ఏమిటంటే... ఏళ్లపాటు ఈ ప్రేమకథలను కలసి పండించడం వల్లనో ఏమో... ఆయా సీరియల్స్‌లోని నటీనటులు కూడా తమ కోస్టార్స్‌తో ప్రేమలో పడుతున్నారు. పెళ్లి పీటలెక్కి ఒక్కటవుతున్నారు. నటన పండించినట్టుగానే కాపురాలనూ పండిచుకుంటున్నారు. ఇలా ఒక్కటవుతున్నవారిలో హిందీ సీరియల్‌వాళ్లే ఎక్కువ ఉన్నారన్నది కాదనలేని వాస్తవం.
ఇటీవల ఎక్కడ విన్నా ఓ జంట పేరు బాగా వినిపిస్తోంది. వారు.. అంకితా లోఖండే, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఈ ఇద్దరూ జీటీవీలో ప్రసారమైన ‘పవిత్రరిష్తా’లో నటించారు. నిజ జీవితంలో కూడా పవిత్రబంధాన్ని ఏర్పరచుకోవాలని నిర్ణయించుకున్నారు. సుశాంత్ సినిమాల్లోకి వెళ్లిపోయాడు. ‘కాయ్ పో చే’లో హీరోగా నటించి ప్రశంసలు కొట్టేశాడు. అతడి రెండో చిత్రం ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ విడుదలకు సిద్ధమైంది. అతడితో పాటు వచ్చిన అంకితను ఓ ఫంక్షన్‌లో చూసిన షారుఖ్ ఖాన్, ఆమెను ఫరాఖాన్ చిత్రం కోసం రికమెండ్ చేశాడు. అలా వారి కెరీర్, ప్రేమ అన్నీ కలగలుపుకుని ముందుపోతున్నాయి.
గతంలో చాలామంది సీరియల్ నటీనటులు వీరిలాగే ప్రేమలో పడ్డారు. పెళ్లిళ్లు చేసుకుని హాయిగా కాపురం చేసుకుంటున్నారు. రామ్‌కపూర్-గౌతమి, గురుమీత్ చౌదరి-దెబీనా, శరద్ ఖేల్కర్-కీర్తి, వివియన్-వభీజ్, మాహి విజ్-జై భానుషాలీ, రష్మీదేశాయ్-వికాస్, రవి దూబే-షర్గుణ్ మెహతా... ఇలా ప్రముఖ టీవీ స్టార్స్ అంతా నటిస్తూ ప్రేమలో పడినవారే. ఆ నటనను నిజం చేసి జీవితాలను సంతోషమయం చేసుకున్నవారే. ప్రత్యూష బెనర్జీ, జియా మానెక్, సనయా ఇరానీ లాంటి మరికొందరు వర్థమాన తారలు కూడా సహ నటీన టులతో ప్రస్తుతం ప్రేమలో ఉన్నారు. త్వరలోనే పెళ్లి పీటలెక్కడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. బుల్లితెర వేసిన వీరందరి బంధం పదికాలాలు పదిలంగా ఉండాలని అభిమానులుగా ఆకాంక్షిద్దాం!
టీవీక్షణం: నటన నిజమైంది!
Published Sun, Sep 8 2013 2:40 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM
Advertisement
Advertisement