
సింగర్ మోనాలి ఠాకూర్ (Monali Thakur) ఆస్పత్రిపాలైంది. లైవ్ షోలో పాడుతున్న ఆమెకు ఉన్నట్లుండి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. జనవరి 21న పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది
ఈ వీడియోలో లైవ్ షోలో పాడుతున్న గాయనికి ఉన్నట్లుండి ఏదో ఇబ్బందిగా అనిపించి తలపట్టుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ ఆమె పాట పాడటం ఆపలేదు. ఎలాగోలా సాంగ్ పూర్తి చేసింది. కానీ తర్వాత షోను కొనసాగించలేకపోయింది. నాకు ఈ రోజు ఆరోగ్యం అస్సలు బాగోలేదు. కాబట్టి షో ముగించేస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి అని స్టేజీపైనే క్షమాపణలు చెప్పింది. షో రద్దు చేసిన వెంటనే ఆస్పత్రిలో చేరగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

సింగర్ మాత్రమే కాదు, నటి కూడా!
ఈ నెల ప్రారంభంలోనూ మోనాలి ఠాకూర్ వార్తల్లో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పర్ఫామెన్స్ మధ్యలోనే స్టేజీ దిగి వెళ్లిపోయింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్ అమర్యాదగా ప్రవర్తించడంతో పాటు తన సిబ్బందిని వేధింపులకు గురిచేసిందని ఆరోపించింది. ఈ కారణం వల్లే లైవ్ షో మధ్యలోనే వెళ్లిపోయానని క్లారిటీ ఇచ్చింది. మోనాలి ఠాకూర్.. సవార్ లూన్, జర జర టచ్ మీ, చమ్ చమ్, తేర ఇంతేజర్, మమ్మీ కసమ్.. వంటి పాటలు ఆలపించింది. తెలుగు దర్శకుడు నగేశ్ కుకునూర్ హిందీలో తెరకెక్కించిన లక్ష్మి సినిమాలో కీలక పాత్ర పోషించింది.
Comments
Please login to add a commentAdd a comment