ఆ క్యాన్సర్‌కు అంత ఆందోళన అక్కర్లేదు
నా వయసు 54 ఏళ్లు. మలవిసర్జనకు వెళ్లినప్పుడు నాకు మలంలో రక్తం కూడా పడుతోంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు.
- సూర్యారావు, విజయవాడ
మీరు ముందుగా డాక్టర్‌ను సంప్రదించి కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మీరు చెబుతున్న లక్షణాలు మూడు ప్రధాన సమస్యల వల్ల రావచ్చు. మొదటిది ఫిషర్ ఇన్ యానల్ కెనాల్ అనే సమస్య. ఈ సమస్యలో రక్తం పడటంతో పాటు నొప్పి కూడా ఉంటుంది. రెండోది హెమరాయిడ్స్ అనే సమస్య. దీన్నే పైల్స్ అని కూడా అంటారు. తెలుగులో ఈ సమస్యను మొలలు అని చెబుతుంటారు. ఈ సమస్యలో కూడా రక్తస్రావం కనిపిస్తుంది. ఇక మూడోది క్యాన్సర్. మీకు ఈ మూడింటిలో ఏ సమస్య ఉందో నిర్ధారణ కోసం కొని పరీక్షలు నిర్వహిస్తారు. ఉదాహరణకు పెద్దపేగును, మలద్వారం వంటి భాగాలను పరీక్షించేందుకు చేసే కొలనోస్కోపీ వంటివి. మీకు ఒకవేళ మొదటి లేదా రెండో సమస్య ఉంటే వాటిని సాధారణ శస్త్రచికిత్సల ద్వారా పరిష్కరించవచ్చు. కానీ ఒకవేళ క్యాన్సర్ ఉన్నట్లు తేలితే... అక్కడి గడ్డ నుంచి కొంత ముక్క సేకరించి, వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాత మీకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో నిర్ణయిస్తారు. ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న చికిత్సలను అనుసరించి పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్లు చాలావరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
నా వయసు 36 ఏళ్లు. నేను మలవిసర్జన చేస్తుంటే రక్తం పడుతోంది. దాంతో డాక్టర్‌కు చూపిస్తే మలద్వారం వద్ద క్యాన్సర్ అని చెప్పారు. శస్త్రచికిత్స చేసి మలద్వారాన్ని మూసేసి, కడుపు దగ్గర మలవిసర్జనకు అనువుగా మరో ద్వారాన్ని ఏర్పాటు చేస్తామని డాక్టర్లు చెప్పారు. ఇది నాకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు. అలాంటి పరిస్థితే వస్తే నాకు మరణమే శరణ్యం అన్నంత నిస్పృహగా ఉంది. దయచేసి నాకు సలహా ఇవ్వండి.
- ఒక సోదరుడు, విశాఖపట్నం
మీరు అంత నిస్పృహకు లోనవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ సమస్య పరిష్కారం కోసం కీమోథెరపీ లేదా రేడియోథెరపీ తీసుకోవచ్చు. ఒకసారి మీ క్యాన్సర్ గడ్డ కుంచించుకుపోయాక ‘యాంటీరియర్ రెసెక్షన్’, ‘అల్ట్రా లో యాంటీరియర్ రిసెక్షన్’ వంటి శస్త్రచికిత్సలు చేస్తారు. దీనివల్ల మీరు గతంలో లాగే మామూలుగా మలవిసర్జన చేయవచ్చు. అంతేగానీ కడుపు దగ్గర మలద్వారం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ నిరాశ, నిస్పృహలను వదలి తగిన చికిత్స చేయించుకోండి. పైగా మీ సమస్య పూర్తిగా నయమయ్యేందుకు అవకాశాలు కూడా ఎక్కువే. కాబట్టి ఆందోళన
వదిలేయండి.
డాక్టర్ పి. విజయానందరెడ్డి
డెరైక్టర్, అపోలో క్యాన్సర్ హాస్పిటల్,
అపోలో హెల్త్‌సిటీ, జూబ్లీహిల్స్,
హైదరాబాద్.
క్యాన్సర్ కౌన్సెలింగ్
Published Mon, Jul 20 2015 10:30 PM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM
Advertisement
Advertisement