క్యాన్సర్ కౌన్సెలింగ్ | Cancer Counseling | Sakshi
Sakshi News home page

క్యాన్సర్ కౌన్సెలింగ్

Published Wed, Aug 19 2015 11:38 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

Cancer Counseling

అన్ని కణుతులూ క్యాన్సర్లు కావు!
 
నా వయసు 20 ఏళ్లు. నేను చాలా సన్నగా ఉంటాను. ఇటీవల నేను నా రొమ్ములను పరీక్షించుకునే సమయంలో రెండు రొమ్ములలోనూ గట్టిగా గడ్డల్లాగా చేతికి తగిలాయి. అప్పట్నుంచి నాకు చాలా ఆందోళనగా ఉంది. నా వయసులో ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? దయచేసి వివరంగా సమాధానం చెప్పండి.
 - ఒక సోదరి, ఈ-మెయిల్

రొమ్ముల్లో ఇలా చిన్న గడ్డలు కనిపించడం చాలా సాధారణం. దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ఇలా వచ్చే గడ్డల్లో చాలావరకు బినైన్ బ్రెస్ట్ డిసీజ్ వల్ల వచ్చేవి (హానికరం కానివి), క్యాన్సర్‌కు సంబంధం లేనివే ఎక్కువగా ఉంటాయి. ఇవి చేతికి మృదువుగా తగులుతూ అటు, ఇటు కదులుతూ కూడా ఉండవచ్చు. రొమ్ముల్లో వచ్చే కణుతులు చాలా కారణాల వల్ల వస్తుంటాయి. అవి...

కొన్ని రకాల హార్మోన్ మార్పుల వల్ల (ఈ మార్పులు హానికరం కాదు).
రొమ్ముల్లో ఏదో ఒక భాగంలో ఇన్ఫెక్షన్స్ రావడం లేదా లోపల ఏదైనా గాయం కావడం వల్ల
కొన్ని రకాల మందులు వాడటం వల్ల.

హానికరం కాని మార్పుల వల్ల వచ్చే గడ్డలు (బినైన్ బ్రెస్ట్ డిసీజ్-బీబీడీ): మహిళల శరీరంలో రుతుస్రావానికి సంబంధించిన మార్పులు జరుగుతుంటాయి. ఈ ప్రభావం రొమ్ముల్లో కూడా కనిపిస్తుంటుంది. ఈ కారణం వల్ల రొమ్ములలో ఏదో ద్రవం నిండినట్లుగా ఉండే తిత్తులు ఏర్పడతాయి. వీటిని ముట్టుకుంటేనే మంట, నొప్పి, ఇబ్బందిగా అనిపిస్తుంటాయి. ముఖ్యంగా మరో వారంలో రుతుస్రావం జరగబోతుండగా ఇలాంటి కణుతులు వచ్చి, రుతుస్రావం తర్వాత వాటంతట అవే తగ్గిపోతుంటాయి.సింపుల్ సిస్ట్స్ అనే తరహా తిత్తులూ రెండు రొమ్ముల్లోనూ రావచ్చు. రుతుస్రావం సమయంలో  వీటిని ముట్టుకుంటేనే చాలా మంట, నొప్పి అనిపించి ఇబ్బంది పెడుతుంటాయి.

ఫైబ్రో ఎడినోమాస్: ఇవి కాస్తంత గట్టిగా ఉండే కణుతులు. గుండ్రగానూ, ముట్టుకోగానే లోపల జారిపోతున్నట్లుగాను కనిపిస్తాయి. ఇవి కూడా హానికరం కావు. సాధారణంగా మీ వయసు ఉన్నవారిలో ఇలా హానికరం కాని గడ్డలే ఎక్కువ. మీరు స్వయంపరీక్ష చేసుకుంటున్న తీరు చాలా మంచిది. మహిళలందరూ ఇలా పరీక్షించుకొని, ఏదైనా అసాధారణమైన అంశం కనిపించగానే మీ ఫ్యామిలీ డాక్టర్‌కు గానీ లేదా గైనకాలజిస్టుకు గానీ చూపింకోవడం మంచిది. ఒకవేళ అవి హానికరమైన గడ్డలే అయినా ఈ రోజుల్లో వాటి గురించి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. తొలిదశలో గుర్తిస్తే హానికారక గడ్డలనూ పూర్తిగా తొలగించి, నయం చేసే పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది.
 
స్పైన్ కౌన్సెలింగ్
 
వెన్ను ఆపరేషన్‌తో ప్రయోజనం ఉంటుందా?

నా వయసు 60 ఏళ్లు. నేను ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగిని. మూడేళ్ల నుంచి నాకు  వెన్నునొప్పి వస్తోంది. దానితోపాటు ఎడమకాలులో నొప్పి, తిమ్మిర్లు, మంటలు వస్తున్నాయి. మూడేళ్ల క్రితం వరకూ నేను ఒక కిలోమీటరు దూరాన్ని ఎలాంటి ఇబ్బందీ లేకుండా నడిచేవాడిని. ఇప్పుడు కనీసం వంద మీటర్లు కూడా నడవలేకపోతున్నాను. కాస్త నడిచినా... వెంటనే కాళ్లలో తిమ్మిర్లు, కాళ్లు బరువెక్కడం జరుగుతోంది. రెండు, మూడు నిమిషాల పాటు విశ్రాంతిగా నిల్చుంటే... ఆ తర్వాత నొప్పి తగ్గి మళ్లీ నడవగలుగుతున్నాను. అలాగే రెండు మూడు నిమిషాల పాటు నిలుచున్నా కూడా కాళ్లు బరువెక్కుతున్నాయి. కనీసం నిలబడి షేవింగ్ కూడా చేసుకోలేకపోతున్నాను. మూడేళ్ల నుంచి మందులు వాడుతున్నా ఇబ్బంది తగ్గకపోగా ఇంకా పెరుగుతోంది. మా ఊళ్లో ఆర్థోపెడిక్ డాక్టర్‌కు చూపించుకున్నాను. నడుముకు ఎక్స్‌రే, ఎమ్మారై స్కాన్ చేసి నాకు వెన్నుపూసలు జారిపోతున్నాయనీ, దానివల్ల కాళ్లల్లోకి వచ్చే నరాలపై ఒత్తిడి పడటం వల్ల ఇలా జరుగుతోందనీ అన్నారు. ఇది వయసుతో వచ్చే సమస్య అనీ, దీనికి మెడికల్ ట్రీట్‌మెంట్ లేదనీ, స్పైన్ సర్జన్‌ను సంప్రదించి ఆపరేషన్ చేయించుకొమ్మని చెప్పారు. మరికొందరు ఈ వయసులో ఆపరేషన్ వద్దని భయపెడుతున్నారు. ఒకవేళ నేను ఆపరేషన్ చేయించుకుంటే నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంతకంటే మెరుగవుతుందా?  ఎన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. దయచేసి వివరంగా చెప్పండి.
 - నాగరాజు, కడప
 
మీరు తెలిపిన వివరాల ప్రకారం మీకున్న సమస్యను ‘స్పాండిలోలిస్థెసిస్’ అంటారు. దీన్నే తెలుగులో వెన్నుపూస జారడం అంటారు. వయసు పెరిగేకొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. దీనివల్ల మన వెన్నుపూసలు క్రమం తప్పి, కాళ్లలోకి వచ్చే నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో నడవడం, నిలబడటం కష్టంగా ఉంటుంది. ఈ వయసులో వచ్చే మార్పులను మెడికల్ ట్రీట్‌మెంట్ ద్వారా మామూలుగా చేయలేం. అయితే ఆపరేషన్ వల్ల మీకు నడుము, కాళ్లనొప్పి తగ్గడమే కాకుండా కాకుండా మీ నడక కూడా మెరుగుపడుతుంది. ఇప్పుడు ఈ సమస్యకు అందుబాటులో ఉన్న ‘మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ’ (దీన్నే కీహోల్ సర్జరీ అని కూడా అంటారు) ద్వారా అధిక రక్తస్రావం లేకుండా శస్త్రచికిత్స చేయవచ్చు. దాంతో మీరు త్వరగా కోలుకుంటారు. ఆపరేషన్ తర్వాత మూడు లేదా నాలుగు రోజులపాటు ఆసుపత్రిలో ఉంటే సరిపోతుంది. ఆపరేషన్ తర్వాత ప్రత్యేకంగా బెడ్‌రెస్ట్ వంటివి అవసరం లేదు. ఇంటికి వెళ్లాక వాకింగ్ వంటివి ప్రాక్టీస్ చేయమని సూచిస్తాం. ఈ ఆపరేషన్ విజయవంతంగా చేయవచ్చు. భయం, అపోహలు వీడి ఆపరేషన్ చేయించుకోండి.
 
గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్
 
ఛాతిలో మంట తగ్గేదెలా?

నా వయసు 40 ఏళ్లు. నేను చాలా రోజుల నుంచి ఛాతిలో మంటతో బాధపడుతున్నాను. చిన్న విషయమే కదా అని మెడికల్ షాపులో యాంటాసిడ్ సిరప్ తీసుకొని తాగాను. ఆ మందు తాగినప్పుడు మంట తగ్గుతోంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ పరిస్థితి మామూలే. దీన్ని శాశ్వతంగా తగ్గించుకోవడానికి ఏం చేయాలి? దయచేసి తగిన సలహా ఇవ్వగలరని ప్రార్థన.
 - విజయ్, తాడేపల్లి

మీరు తెలిపిన వివరాలు, లక్షణాలను బట్టి చూస్తే మీరు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్‌డీ)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల వచ్చే అనారోగ్యమిది. మీ రోజువారీ జీవనశైలినీ, ఆహారపు అలవాట్లనూ సరిచేసుకుంటే ఈ వ్యాధి చాలావరకు తగ్గుముఖం పడుతుంది. ఈ సమస్య తగ్గడానికి కొన్ని సూచనలివి...

మీరు తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించడం.కాఫీ, టీలను పూర్తిగా మానేయడంపొగతాగే అలవాటు ఉంటే పూర్తిగా మానేయడం, మద్యం అలవాటుకు దూరంగా ఉండటం బరువు ఎక్కువగా ఉంటే దాన్ని సరైన స్థాయికి తగ్గించడంభోజనం చేసిన వెంటనే పడుకోకుండా కాస్త సమయం తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి. తలవైపున పడక కొంచెం ఎత్తుగా ఉండేలా అమర్చుకోవాలి.
 పై సూచనలతో పాటు మీ డాక్టర్ సలహా మీద పీపీఐ డ్రగ్స్ అనే మందులు వాడాలి. అప్పటికే తగ్గకపోతే ఎండోస్కోపీ చేయించుకొని తగిన చికిత్స తీసుకోండి.
 
నా వయసు 56 ఏళ్లు. కొద్దిరోజులుగా తరచూ మలద్వారం నుంచి రక్తం పడుతోంది. డాక్టర్‌ను కలిశాను. పైల్స్ ఉన్నాయని ఆపరేషన్ చేశారు. కానీ రక్తం పడటం ఆగలేదు. నా సమస్యకు పరిష్కారం సూచించగలరని ప్రార్థన.
 - కుటుంబరావు, సూళ్లూరుపేట
మీరు తెలిపిన వివరాల ప్రకారం మలద్వారం నుంచి రక్తం పడటానికి పైల్స్ కూడా ఒక కారణం కావచ్చు. కానీ రక్తం పడటానికి వేరే కారణాలు కూడా ఉంటాయి. అందులో ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయాలు ఏమిటంటే... పెద్దపేగులో క్యాన్సర్ వంటివి ఉన్నప్పుడు కూడా ఇదే లక్షణం కనిపిస్తుంది. కాబట్టి మీరు ఒకసారి కొలనోస్కోపీ/సిగ్మాయిడోస్కోపీ పరీక్ష చేయించుకోవడం మంచిది. దీని వల్ల రక్తస్రావం ఎక్క డ్నుంచి అవుతోందో తెలుస్తుంది. కారణం తెలిస్తే సరైన చికిత్స చేయవచ్చు. కాబట్టి ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవండి.
 
డర్మటాలజీ కౌన్సెలింగ్
 

జుట్టు రాలడాన్ని అరికట్టడం ఎలా?
నా వయసు 21 ఏళ్లు. నాకు జుట్టు విపరీతంగా రాలిపోతోంది. నా హెయిర్‌లైన్ కూడా క్రమంగా వెనక్కుపోతూ మాడు కనిపిస్తోంది. నేను డర్మటాజిస్ట్‌ను సంప్రదించాను. వారు నాకు ఫోలీహెయిర్ అనే టాబ్లెట్‌ను నెల రోజులు వాడమని చెప్పారు. ఇప్పుడు నేను డ్యాజిట్-ఎమ్ అనే టాబ్లెట్‌ను 30 రోజులుగా వాడుతున్నాను. ఇది అర్టికేరియా కోసం వాడుతున్నా. నా హిమోగ్లోబిన్ 10 శాతం మాత్రమే. నా ఉద్యోగంలో భాగంగా నేను చాలా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. దయచేసి నా జుట్టు మరింత ఊడిపోకుండా ఏదైనా చికిత్స చెప్పండి.
 - మౌనిక, ఈ-మెయిల్
 
 జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది పోషకాహార లోపం. పైగా మీ విషయంలో మీలో హిమోగ్లోబిన్ కేవలం 10 శాతం మాత్రమే అంటున్నారు. బహుశా మీ రక్తహీతన కారణంగానే జుట్టు రాలిపోతూ ఉండవచ్చు. మీ వయసులో అంటే ఇరవైలలో ఉండే యువతలో ఇది చాలా సాధారణమైన విషయం. పైగా మీరు ప్రయాణాలు చాలా ఎక్కువగా చేసే ఉద్యోగంలో ఉన్నానని చెబుతున్నారు. ఇది మీలో ఒత్తిడిని మరింత ఎక్కువగా పెంచుతుండవచ్చు. మీ ప్రయాణాల్లో నిద్రలేమి కూడా ఉండే ఉంటుంది. బహుశా ఈ అంశాలన్నీ కలిసి మీలో జుట్టు రాలడం ఎక్కువయ్యేందుకు దోహదపడుతూ ఉండవచ్చు.
 మీరు చికిత్సలో భాగంగా ఈ కింది సూచనలు పాటించండి.
 
ముందుగా మీలో రక్తహీనతను తగ్గించుకోండి. మీ హిమోగ్లోబిన్ పాళ్లు కనీసం 14% ఉండేలా చూసుకోండి. ఇందుకోసం ఫై సల్ఫేట్ 50 ఎంజీ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున, విటమిన్-సి 500 ఎంజీ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున మూడు నెలల పాటు వాడండి.
ఇక మీ జుట్టు రాలడాన్ని అరికట్టడం కోసం బయోటిన్ 10 ఎంజీ, సాపాల్మెథో లేదా ఇతర అమైనోయాసిడ్‌లను రోజుకు ఒకసారి చొప్పున భోజనం తర్వాత మూడు నెలల పాటు తీసుకోండి.

 మీ జీవనశైలి (లైఫ్‌స్టైల్)లో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. మీరు రోజూ కనీసం ఎనిమిది గంటల పాటు హాయిగా, గాఢంగా నిద్రపోయేలా చూసుకోండి.పై సూచనలన్నీ పాటించాక కూడా మీ జుట్టు రాలడం తగ్గకపోతే ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా చికిత్స, మీసోథెరపీ వంటి ప్రక్రియలను అవలంబించి మీ జుట్టు రాలడాన్ని అరికట్టడంతో పాటు మీ మాడుపై జుట్టు పరిమాణాన్ని పెంచవచ్చు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement