ప్రతీకాత్మక చిత్రం
క్యాన్సర్ కూడా ఒక కణమే. అది కొత్తకొత్తగా, చెత్తచెత్తగా ప్రవర్తిస్తుంది. కొత్తగా ఎలా ఉన్నా ఇలా చెత్తగా ప్రవర్తించడమే దాన్ని మిగతా ఆరోగ్యకరమైన కణాల నుంచి వేరు చేస్తుంది. చెడ్డ లక్షణాలుగా ఆపాదిస్తున్న ఆ గుణాలు ఎనిమిది. అందుకే క్యాన్సర్‌ను ఎనిమిది వంకర్ల ‘అష్టావక్ర’ కణంగా చెప్పవచ్చు. ఆ ఎనిమిది గుణాలకు తోడుగా ఈ ఏడాది (2022లో) తాజాగా ఇప్పుడు మరిన్ని దుష్ట గుణాలను నిపుణులు కనుగొన్నారు. కొత్త చికిత్స ప్రక్రియలను కనుగొనేందుకు ఇవి తోడ్పడుతున్నందున వీటిని గురించి తెలుసుకోవడం అవసరం కూడా. అవేమిటో తెలుసుకుందాం.
1. సస్టెయిన్డ్ ప్రోలిఫరేటివ్ సిగ్నలింగ్ : కణాలన్నీ తమలోని జీవరసాయనాలతో ఒకదానితో ఒకటి సంప్రదింపులు జరుపుకోవడం, ఒకదానితో ఒకటి అనుసంధానితమై ఉండటం చేస్తుంటాయి. క్యాన్సర్ కణాలు విచిత్రంగా తమ సొంత సిగ్నలింగ్ వ్యవస్థను కలిగి ఉండటమే కాదు... ఆరోగ్యకరమైన కణాలు సంభాషించుకున్నట్లుగా, ఒక క్రమబద్ధమైన రీతిలో అనుసంధానితమై ఉన్నట్లుగాను ఉండవు. పక్కవాటితో నిమిత్తం లేకుండా తాము స్వతంత్రంగా, ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తూ ఉంటాయి. ఈ గుణాన్ని సస్టెయిన్డ్ ప్రోలిఫరేటివ్ సిగ్నలింగ్‌గా నిపుణులు పేర్కొంటుంటారు.
2. దేహపు సిగ్నల్స్ స్వీకరించకపోవడం : దేహంలో ఎక్కడైనా చెడు కణాలు ఉంటే వాటిని తుదముట్టించేందుకు శరీరం నుంచి ఆజ్ఞలు వెలువడతాయి. వాటి ఆధారంగా ఆ చెడు కణాలన్నీ మిగతా ఆరోగ్యకరమైన కణాలకు చేటు చేయకుండా తమను తాము ధ్వంసం చేసుకుని అంతర్గత అవయవాల ఆరోగ్యం కాపాడాలి. కానీ క్యాన్సర్ కణాలు ఈ సిగ్నల్స్‌ను లెక్క చేయవు.
3. రెసిస్టింగ్ సెల్ డెత్ : ప్రతి కణం ఒక నిర్ణీత సమయం తర్వాత మరణిస్తుంటుంది లేదా అంతమైపోతుంటుంది. కానీ క్యాన్సర్ కణం అలా మరణించడానికి ఇష్టపడదు. అందుకే చావు లేని వరం పొందిన రాక్షసుల్లా అది రెచ్చిపోతుంటుంది.
4. ఎనేబిలింగ్ రిప్లికేటివ్ ఇమ్మోర్టాలిటీ: ముందు పేర్కొన్న (‘రెసిస్టింగ్ సెల్ డెత్’) అంశంలో చెప్పినట్లుగా లోపభూయిష్టమైన కణం... ఇతర కణాలకు నష్టం చేయకుండా ఉండేందుకు అంతమైపోవాలి. కానీ క్యాన్సర్ కణం అలా అంతమైపోకుండా ఉండటమే కాదు... తనలాంటి లోపభూయిష్టమైన కణాలను ఉత్పత్తి చేస్తుంది. అది కూడా ఒకటి రెండుగానూ... రెండు నాలుగుగానూ కాకుండా... కణవిభజన నిబంధలను అతిక్రమించి ఒకటి నాలుగుగానూ... ఆ నాలుగు అరవై నాలుగుగా.. ఇలా ఇష్టం వచ్చినట్లు అపరిమితంగా పెరిగిపోతుంది. అందుకే క్యాన్సర్ గడ్డలు ఒక క్రమతతో కాకుండా... గడ్డల్లా (ట్యూమర్స్‌లా) అసహ్యం గా పెరుగుతాయి.
5. ఇండ్యూసింగ్ / యాక్సెసింగ్ వాస్క్యులేచర్ : అన్ని కణాలకు నిర్ణీతమైన రీతిలో ఆక్సిజన్ లేదా పోషకాలు అందాలి. కానీ క్యాన్సర్ గడ్డలు... కణాల నిబంధనలన్నీ తోసిరాజంటూ తాము స్వయంగా రూపొందించుకున్న మార్గాల ద్వారా ఆరోగ్యకరమైన కణాలకు అందనివ్వకుండా... అన్ని పోషకాలను తామే స్వీకరిస్తాయి. అందుకే క్యాన్సర్ వచ్చిన రోగి బలహీనంగా మారిపోతుంటాడు. ఇలా క్యాన్సర్ కణాలు సొంత రక్తప్రసరణ మార్గాలను ఏర్పాటు చేసుకోవడాన్నే ‘ఇండ్యూసింగ్ / యాక్సెసింగ్ వాస్క్యులేచర్’ అని నిపుణులు చెబుతుంటారు.
6. యాక్టివేటింగ్ ఇన్వేజన్ అండ్
మెటాస్టాసిస్: ఒక నిర్ణీత క్రమంలో కాకుండా... తానున్న ప్రాంతాన్ని వదిలి... వేరే అవయవాల కణాల్లోకి వలస వెళ్లి... అక్కడ స్థిరపడటం, అక్కడ మళ్లీ పెరిగిపోవడాన్నే ‘మెటాస్టాసిస్’ / ‘మెటస్టాటిక్ గ్రోత్’ అంటారు. ఉదాహరణకు కాలేయానికి క్యాన్సర్ వచ్చిందనుకుందాం. అది అక్కడికే పరిమితమై పోకుండా పక్కన ఉన్న అన్ని అవయవాలకు పాకడాన్ని మెటాస్టాసిస్ అంటారు. ఇలా క్యాన్సర్ పక్కకణాలపై దాడి చేసినట్లుగా అన్నిచోట్లకు పాకే ప్రక్రియను ‘యాక్టివేటింగ్ ఇన్వేషన్ అండ్ మెటాస్టాసిస్’ అంటారు.
7. రీ–ప్రోగ్రామింగ్ సెల్యులార్ మెటబాలిజమ్ : ఓ కణంలో క్రమబద్ధమైన రీతిలో జీవక్రియలు జరగడాన్ని మెటబాలిజమ్ అంటారు. ఈ కార్యక్రమాన్ని దెబ్బతీయడమే కాకుండా... తనకు ఇష్టమైన రీతిలో అక్కడి కార్యకలాపాలు జరిగేలా క్యాన్సర్ కణం జీవక్రియలను రీ ప్రోగ్రామింగ్ చేస్తుంది. ఇది కణానికి తీవ్రనష్టం కలిగిస్తుంది.
8. అవాయిడింగ్ ఇమ్యూన్ డిస్ట్రక్షన్: మన దేహంలో చెడు కణం పుట్టగానే రోగనిరోధక వ్యవస్థ రంగంలోకి దిగి దాన్ని పూర్తిగా నిర్మూలిస్తుంది. కానీ క్యాన్సర్ కణం ఈ ఇమ్యూన్ వ్యవస్థను తోసిరాజని పెరుగుతుంది. ఇమ్యూన్ వ్యవస్థ తనను నాశనం చేయకుండా మనుగడ సాగిస్తుంది.
ఈ గుణాలను కనుగొన్న కారణంగా క్యాన్సర్‌ను తుదముట్టించేందుకు లేదా ఎదుర్కొనేందుకు ఇదివరలో మనకు తెలిసిన మార్గాలతో పాటు... ఇతర మార్గాలను కనుగొనేందుకు దారి సుగమమైంది. అయితే ఇంకా అదనం గా ఏవైనా గుణాలన్నాయా..? అనే అంశంతో పాటు... ఇదివరలో కనుగొన్న ఎనిమిది అంశాలపై మరింత అవగాహన కోసం పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి. తద్వారా మరింత సమర్థమైన, మెరుగైన చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఆశిస్తున్నారు.
ఇక్కడ పేర్కొన్న ఎనిమిది గుణాలతో పాటు ఈ ఏడాది అంటే 2022లోనే మరిన్ని గుణాలను నిపుణులు కనుగొన్నారు. ఉదాహరణకు జన్యుపరమైన చంచల స్వభావంతో ప్రవర్తించడం (జీనోమ్ ఇన్‌స్టెబిలిటీ అండ్ మ్యూటేషన్స్), అన్ని నిబంధనలను తోసిరాజని తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం (అన్‌లాకింగ్ ఫీనోటైపిక్ ప్లాస్టిసిటీ), దేహపు ఆజ్ఞలను తనకు అనుగుణంగా వ్యాఖ్యానించుకుని అన్ని విధాల చెరుపుగా చేసేవిధంగా కార్యకలాపాలు నిర్వహించడం (నాన్ మ్యూటేషనల్ ఎపీజెనెటిక్ రీ–ప్రోగ్రామింగ్), చెడు కోసం పాటుపడటం (ట్యూమర్ ప్రమోషన్ ఇన్‌ఫ్లమేషన్), కాలం చెల్లిన కణాలూ ఇంకా జీవించే ఉండటమే కాకుండా మంచి కణాలను తమ కార్యకలాపాలు నిర్వహించనివ్వకుండా చేయడం (సెనెసెంట్ సెల్స్), మన దేహానికి అవసరమైన మంచి బ్యాక్టీరియాను పెరగనివ్వకుండా చేసి, చెడు సావాసాలతో చెడు బ్యాక్టీరియా దేహంలో పెరిగిపోయేలా చేయడం (పాలీమార్ఫిక్ మైక్రోబయోమ్) వంటివి కొన్ని.
Comments
Please login to add a commentAdd a comment