
జబ్బులకు కొత్త కొత్త మందులు కనుక్కోవడం భారీ ఖర్చుతో కూడుకున్న పని. కేన్సర్ విషయాన్నే తీసుకుంటే ఈ మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయలు దాటిపోతుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఇతర సమస్యలకు వాడుతున్న మందుల్లోనే కేన్సర్‌ను ఎదుర్కొనే లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ అన్వేషణలో శాస్త్రవేత్తలు గుర్తించిన సరికొత్త మందు.. వయాగ్రా! ఇందులోని రసాయనం పీడీఈ5 రొమ్ము, ఊపిరితిత్తులు, పెద్దపేవు, కాలేయ కేన్సర్ కణితుల పెరుగుదలను అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నిజానికి వయగ్రాను శృంగార సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో తయారు చేయలేదు. గుండెజబ్బులకు సంబంధించి వచ్చే చాతినొప్పిని నివారించడం ఈ మందు ఉద్దేశం.
పీడీఈ5 రసాయనం నాడుల్లో రక్తం వేగంగా ప్రసారమయ్యేలా చేస్తుంది. ఈ క్రమంలోనే ఇతర అవయవాల్లోనూ రక్తప్రసరణ హెచ్చడంతో కంపెనీలు వయాగ్రాను ఇతర అవసరాల కోసం అమ్మడం మొదలుపెట్టి సొమ్ము చేసుకున్నాయి. అయితే పీడీఈ5ను నిశితంగా పరిశీలించినప్పుడు దీన్ని కేన్సర్ చికిత్సలోనూ వాడవచ్చునని స్పష్టమైంది. ఇప్పటికే దాదాపు 25 అధ్యయనాలు ఈ విషయాన్ని తెలిపాయి. ప్రస్తుతం దాదాపు 11 పరిశోధనలు కేన్సర్ విషయంలో వయాగ్రా పాత్ర ఏమిటన్నది పరిశీలిస్తున్నాయి. వీటన్నింటి ఫలితాల ఆధారంగా కేన్సర్ చికిత్సగా వయాగ్రా వాడకంపై ఒక స్పష్టమైన అంచనాకు రావచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే కేన్సర్ చికిత్స కోసం పీడీఈ5ను వాడేందుకు అనుమతులు లేవు. కాకపోతే భవిష్యత్తులో అందుబాటులోకి వస్తే మాత్రం చాలా చౌకగా కేన్సర్‌ను జయించేందుకు ఇదో మార్గమవుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment