క్యాన్సర్ కు ఖో | Cancer Kho | Sakshi
Sakshi News home page

క్యాన్సర్ కు ఖో

Published Sat, Mar 8 2014 12:43 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

క్యాన్సర్  కు  ఖో - Sakshi

క్యాన్సర్ కు ఖో

 బ్లడ్ క్యాన్సర్...ఈ వ్యాధి పేరు వినగానే గుండెల్లో ఒక రకమైన భయాందోళన కలుగుతుంది. అదే క్రీడాకారులకు ఈ వ్యాధి సోకితే...
 ఆర్మ్‌స్ట్రాంగ్, యువరాజ్‌లాంటి వారైతే పెద్ద మొత్తం ఖర్చు చేసి విదేశాల్లో చికిత్స చేయించుకుంటారు...ఆ తర్వాత క్యాన్సర్ నివారణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.  అదే ఒక పేద క్రీడాకారిణి, ఆమె తండ్రి రోజువారీ కూలీ అయితే ఆ అమ్మాయి ఏం చేస్తుంది. తన దురదృష్టానికి నిందిస్తూ విధిని నమ్ముకొని బతికేస్తుంది.  
 

అయితే ఈ అమ్మాయి అలా అనుకోలేదు. బ్లడ్ క్యాన్సర్ బయటపడినా...బతికే అవకాశాలు తక్కువని చెప్పినా...జీవితంతో పోరాడింది. అంతే కాదు...తనకిష్టమైన ఆటలో కూడా మళ్లీ ప్రవేశించి జాతీయ స్థాయి పోటీల్లో ఆడుతోంది. చిన్న విషయాలకే మానసికంగా కుప్పకూలిపోయే అమ్మాయిలకు ఈ ఖోఖో క్రీడాకారిణి విజయగాథ ఒక స్ఫూర్తి.
 - మొహమ్మద్ అబ్దుల్ హాది
 
 వేముల మహేశ్వరి... వయసు 18 ఏళ్లు. హైదరాబాద్‌లోని బర్కత్‌పురా ప్రాంతంలో నివాసం. తండ్రి కనకయ్య రోజు కూలీ. తల్లి రాములమ్మ ఇళ్లలో పని మనిషి.  మహేశ్వరికి కేశవ్ మెమోరియల్ స్కూల్‌లో విద్యార్థినిగా ఉన్నప్పుడే ఆటలపై ఆసక్తి కలిగింది. అక్కడి పీఈటీ పోచప్ప ప్రోత్సాహంతో ఆమె ఖోఖోను ఎంచుకుంది. ఆరో తరగతిలో ఖోఖో క్రీడను నేర్చుకున్న ఈ అమ్మాయి ఆ తర్వాత వరుసగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంది. అండర్-14, అండర్-17 కేటగిరీలతో పాటు జూనియర్, సీనియర్ విభాగాల్లోనూ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.
     కమ్మిన విషాదం...

 అయితే అటు చదువులోనూ, ఇటు ఆటల్లోనూ అంతా సంతోషంగా సాగుతున్న క్షణాన ఆ అమ్మాయి జీవితంలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. ఒక రోజు అనూహ్యంగా వచ్చిన జ్వరం, ఆ తర్వాత ఎంతకీ తగ్గకపోవడం, వాంతులు...ఇలా వేర్వేరు లక్షణాలు కనిపించినా దానిని సాధారణ అనారోగ్యంగానే అంతా భావించారు. అయితే కుటుంబ సభ్యులకు సందేహం వచ్చి అన్ని వైద్య పరీక్షలకు సిద్ధమయ్యారు. బోన్ మారో పరీక్ష తర్వాత మహేశ్వరికి సోకింది బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. అంతే...ఆ కుటుంబంలో చీకటి కమ్ముకుంది. రోజు గడవడమే కష్టమైన ఆ పేద కుటుంబం ఇక అమ్మాయి జీవితంపై ఆశలు వదిలేసుకుంది.
     జీవన పోరాటం...
 క్యాన్సర్ చికిత్స కోసం కనీసం రూ. 4-5 లక్షలు ఖర్చవుతుందని చెప్పిన డాక్టర్లు మరో హెచ్చరిక కూడా చేశారు. మొదటి దశలో 25 రోజుల పాటు చికిత్స చేస్తామని...వయసు చిన్నది కాబట్టి ఆ చికిత్సకు తట్టుకోగలిగితే బతుకుతుందని, లేదంటే చనిపోవడం ఖాయమని చెప్పి మరీ పత్రంపై సంతకం చేయించారు. ఈ దశలో కీమోథెరపీతో మహేశ్వరి పోరాటం మొదలైంది. ఇంజెక్షన్స్, వరుసగా బ్లడ్ బాటిల్స్ ఎక్కించడం, శరీరంలో అణువణువూ తీవ్రమైన నొప్పి... ఇలా అన్ని రకాల నొప్పి, వేదనను ఈ అమ్మాయి భరించింది. దాదాపు నాలుగు నెలల పాటు ఆమె చికిత్స కొనసాగింది. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సే అయినా 15 రోజులకు సొంత ఖర్చులు కూడా దాదాపు రూ. లక్ష దాటేశాయి. ఆమె బంధువులు, సన్నిహితులు తలా కొంత మొత్తం ఇచ్చి అండగా నిలిచారు. చివరకు ఈ పోరాటంలో మహేశ్వరిదే పైచేయి అయింది. క్యాన్సర్ అదుపులోకి రావడంతో పాటు సెలైన్లు దాటి చికిత్స టాబ్లెట్ల వరకు వచ్చింది. ఇక ప్రతీ 3 నెలలకు తప్పనిసరిగా పరీక్ష చేయించు కోవాలంటూ డాక్టర్లు ఆమెను డిశ్చార్జ్ చేశారు.
     ఆట ముగిసిపోలేదు...
 మూడేళ్ల విరామం తర్వాత మహేశ్వరి మళ్లీ ఇంటర్మీడియెట్‌లో ప్రవేశించింది. అయితే తనకు ఇష్టమైన ఖోఖోపై మళ్లీ మనసు మళ్లింది. శారీరక బలహీనత ఆటకు అడ్డంకి అని, అలాంటి సాహసం చేయవద్దని చాలా మంది హెచ్చరించారు. అయితే జాగ్రత్తలు తీసుకుంటూనే ఆమె మళ్లీ ఫిట్‌నెస్‌ను సంపాదించింది. ఆమె పట్టుదల చూసి తల్లిదండ్రులు కూడా చివరకు ప్రోత్సహించారు. అంతే మళ్లీ జట్టుతో కలసి ప్రాక్టీస్ మొదలు. ఈసారి ఆట ఇంకా మెరుగైంది. హైదరాబాద్ జట్టులో స్థానం మళ్లీ దక్కింది. కర్ణాటకలో జరిగిన సీనియర్ నేషనల్స్ (సౌత్‌జోన్)లో జట్టు సభ్యురాలిగా రాణించింది. గత జనవరిలో కూడా జాతీయ అండర్-19 చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించింది. మహేశ్వరి పట్టుదల ముందు క్యాన్సర్ ఓడిపోయింది. ఇకపై కూడా ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement