ఆపడం సాధ్యమే!
ఎన్ని కౌన్సెలింగ్ సెంటర్‌లు, హెల్ప్‌లైన్‌లు ఉన్నా అవన్నీ... సహాయం కోరిన వాళ్లకు, నా గోడు వినే వాళ్లు కావాలని అడిగిన వాళ్లకు మాత్రమే సేవలందించగలుగుతాయి. కనీసం అలా చెప్పుకునే ప్రయత్నం చేయకుండా ప్రాణాలు తీసుకునే వారిని ఆపగలగాలి.
ఆ పని చేయగలిగింది కుటుంబ సభ్యులు, స్నేహితులు, రూమ్మేట్‌లు మాత్రమే. ఎంత గుంభనమైన వారైనా సరే ‘నేను బతికి ప్రయోజనం ఏముంది! నేను ఎవరికీ అవసరం లేదు’ వంటి ఏదో ఒక సంకేతాన్ని విడుదల చేస్తారు. ఆ సంకేతాన్ని హెచ్చరికగా గుర్తించి జాగ్రత్త పడాలి. ఈ దశలో ఉన్న వారిని ‘నువ్వు చనిపోవాలనుకుంటున్నావా’ అని సూటిగా ప్రశ్నిస్తే చాలు. ‘నీకెలా తెలుసు’ అంటూ మనసులోని బాధనంతా బయటపెట్టేస్తారు. అప్పుడు పొందే ఓదార్పు, ధైర్యంతో ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకుంటారు.
- సుచరిత, సైకియాట్రిస్ట్, రోష్నీ నిర్వాహకురాలు
సాంత్వన కావాలి..!
జీవితం బాధాకరంగా అనిపించడం తమను ఎవరూ పట్టించుకోవడం లేదనిపించడం జీవించడం అనవసరం, మరణించడం మేలనిపించడం మనసు విప్పి మాట్లాడడానికి ఎవరూ లేరనిపించడం మనసులోని బాధను చెప్పుకోవడానికి వినేవాళ్లు ఉంటే బావుణ్ను అనిపించడం...
ఇలాంటప్పుడు వినే మనిషి కావాలి. ఆ ఆత్మీయతను పంచుతోన్న సంస్థలు అనేకం ఉన్నాయి. న్యూ బోయినపల్లిలోని శ్రీభవానీ మహిళా మండలి, మాదాపూర్‌లోని మాక్రో ఫౌండేషన్, బండ్లగూడలోని గ్రోత్ అకాడమీ, బషీర్‌బాగ్‌లోని అమృతాకంజానీ, సింథీ కాలనీలోని రోష్నీ హెల్ప్‌లైన్ అలాంటివే. శిక్షణ పొందిన వాలంటీర్లు ఇక్కడ ఉచితంగా కౌన్సెలింగ్ ఇస్తారు. ఆత్మీయుల్లా ధైర్యం చెప్తారు. వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఎలాంటి బాధలోనైనా జీవించడానికి ఒకదారి తప్పకుండా ఉంటుంది. ఆ దారి చూపించి ఉత్సాహం నింపుతారు. వీరిని టెలిఫోన్‌లోనూ, స్వయంగానూ సంప్రదించవచ్చు.