విడిపోదామనుకున్న దంపతులను ఒక్కటిగా చేస్తూ..   | Domestic Violence Helpline Counselling For Divorcing Couples | Sakshi
Sakshi News home page

విడిపోదామనుకున్న దంపతులను ఒక్కటిగా చేస్తూ..

Published Sat, Nov 13 2021 9:22 PM | Last Updated on Sat, Nov 13 2021 9:47 PM

Domestic Violence Helpline Counselling For Divorcing Couples - Sakshi

విజయనగరం ఫోర్ట్‌: చూపులు కలిసి ఒక్కటైనవారే వారంతా...కానీ క్షణికావేశంలో మాటామాటా పెరిగి దూరమయ్యారు. విడపోదామనుకున్న ఆ మనసులను రంజింపచేసి రాజీ బాట పట్టించారు. విరిగిన హృదయాల్లో ప్రేమను మళ్లీ చిగురింపజేసి సరికొత్త జీవితాన్ని చూపించారు. వారే గృహ హింస విభాగ ప్రతినిధులు. విడిపోవడం ఓ క్షణం ... అదే దగ్గరైతే జీవితమే మకరందమంటూ ఎన్నో జంటల్లో మానసిక పరివర్తనను తేగలిగారు ఆ ప్రతినిధులు.

ఆనందపురం మండలానికి చెందిన మహిళకు పూసపాటిరేగ మండలానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కొన్నేళ్లు వారి కాపురం సజావుగానే సాగింది. 2019లో తనను, పిల్లలను సరిగా చూడడం లేదని, మనోవర్తి ఇప్పించాలని కలెక్టరేట్‌లో ఉన్న గృహహింస విభాగాన్ని ఆ మహిళ ఆశ్రయించింది. దీంతో గృహహింస విభాగం కౌన్సిలర్లు భార్యాభర్తలకు  పలు దఫాలుగా కౌన్సిలింగ్‌ నిర్వహించి ఒక్కటి చేశారు.

గజపతినగరం మండలానికి చెందిన ఓ మహిళకు అదే మండలానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరిద్దరి కాపురం కొన్ళేళ్లు సజావుగా సాగింది. వివాహం జరిగిన మూడేళ్లు తర్వాత తన భర్త వేధిస్తున్నాడని, అతని నుంచి విముక్తి కల్పించాలని కలెక్టరేట్‌లో ఉన్న గృహహింస విభాగాన్ని ఆశ్రయించారు. అక్కడ కౌన్సిలర్లు భార్య,భర్తలకి కౌన్సిలింగ్‌ నిర్వహించి  చేయీ చేయీ కలిపించారు.

అదో గృహ హింస విభాగం. ఈ విభాగంలో ఒక సోషల్‌ కౌన్సిలర్, లీగల్‌ కౌన్సిలర్, ఇద్దరు హోం గార్డులు పనిచేస్తున్నారు. అక్కడకు వచ్చిన వారంతా భర్తతో, అత్తమామలతో హింసలకు గురైనవారే. భర్త వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని కొందరు, భర్తతో కలిసి ఉండేలా చూడాలని మరి కొందరు. వీరంతా తమ గోడును కలెక్టరేట్‌లో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గృహహింస విభాగానికి వచ్చి ఆవేశంతో ఊగిపోతున్న బాధితులే.

కౌన్సిలింగ్‌ ద్వారా... 
గృహహింస విభాగాన్ని ఆశ్రయించిన మహిళలనుతన భర్తతో కలిసి ఉండేలా కౌన్సిలర్లు చర్యలు చేపడతారు. మహిళల నుంచి ఫిర్యాదు తీసుకున్న వెంటనే ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులను పిలిపించి కౌన్సిలర్లు ఇద్దరు కౌన్సిలింగ్‌ ఇస్తారు. ఒకసారి కౌన్సిలింగ్‌లో రాజీపడని వారికి పలు దఫాలుగా పిలిపించి ఒప్పించే ప్రయత్నం చేస్తారు. సాధ్యమైనంత వరకు ఆ దంపతులను కలిపే ప్రయత్నం చేస్తారు. కౌన్సెలింగ్‌లో రాజీ పడని వారికి ఉచితంగా కోర్టులో కేసు వేస్తారు. కోర్టుకు వెళ్లిన తర్వాత కూడా విడాకులకు కాకుండా ఒక్కటయ్యే మార్గాన్నే వారు చూపిస్తారు. విడాకులనేది ఆఖరి అస్త్రంగా ప్రయోగిస్తారు.

130 మందిని మళ్లీ ఒక్కటిగా చేశారు 
2006లో గృహహింస విభాగం జిల్లాలో ఏర్పాటయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 767 మంది గృహహింస విభాగాన్ని అశ్రయించారు. వీరిలో కౌన్సిలింగ్‌ ద్వారా 130 మందిని కలిపారు. 122 మంది కేసులను ఉపసంహరించుకున్నారు. 512 కేసులు కోర్టులో వేయగా 65 మంది కోర్టు సమక్షంలో మళ్లీ చేయీచేయీ కలిపారు. 257 కేసులకు తుది తీర్పు వచ్చాయి. 149 కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.

సంతోషంగా ఉంది 
కుటుంబ కలహాలతో మా దగ్గరకు వచ్చే వారికి ముందుగా కౌన్సిలింగ్‌ ఇస్తాం. కలిసి ఉండడం వల్ల కలిగే ప్రయోజనాల కోసం చెబుతాం. చాలా మందికి కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో కలిశారు. విడిపోదాం అనుకొని వచ్చిన వారిని కలపడం ఎంతో సంతోషంగా ఉంటుంది.
 – జిల్లెల రజని, సోషల్‌ కౌన్సిలర్‌ ఉచిత న్యాయ సహాయాన్నిఅందిస్తాం

కౌన్సిలింగ్‌ ద్వారా రాజీ పడని వారికి ఉచితంగా కోర్టులో కేసు వేస్తాం. వారికి అవసరమైన న్యాయ సహాయాన్ని అందిస్తాం. కోర్టులో కేసు వేసిన తర్వాత కూడా చాలా మంది రాజీ పడి కలిసిన సందర్భాలున్నాయి.  
– జి. మాధవి, లీగల్‌ కౌన్సిలర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement