టెక్ నుమాయిష్
తొడుక్కునేవి...
వేరబుల్ కంప్యూటర్ల గురించి ఈ రోజు కొత్తగా చెప్పేందుకేమీ లేదు. గూగుల్ గ్లాస్ ప్రాజెక్టుతో ఇప్పటికే చాలామందికి తెలిసిన విషయమిది. అయితే ఈసారి సీఈఎస్‌లో గూగుల్ గ్లాస్ ఉత్పత్తులేవీ ప్రదర్శించకపోయినా దానికిమించిన అనేక ఉత్పత్తులు సందడి చేశాయి. తొలిసారి రిస్ట్‌జోన్ పేరుతో ఏర్పాటుచేసిన స్టాల్‌లో స్మార్ట్‌వాచ్‌లు, శరీర లక్షణాలను నిరంతరం పసిగడుతూ ఆరోగ్యం, వ్యాయామాల అవసరాలను గుర్తుచేసే అనేక టెక్ ఉత్పత్తులు దీంట్లో ప్రదర్శించారు.
వీటిల్లోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పెబెల్ స్టీల్ స్మార్ట్‌వాచ్. మీ ఆపిల్, ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను జేబులోంచి తరచూ బయటకు తీసే అవసరం రానీయకుండా నోటిఫికేషన్లు, అలర్ట్‌లను ఫోన్‌పై డిస్‌ప్లే చేస్తుందీ వాచ్. రకరకాల అప్లికేషన్లను స్టోర్ చేసుకునేందుకు కూడా తగినంత మెమరీ ఏర్పాటుచేశారు దీంట్లో. చూసేందుకు సాధారణ వాచ్ మాదిరిగానే ఉండటం.. అత్యాధునిక ఈ-పేపర్ టెక్నాలజీని ఉపయోగించడం పెబెల్ స్మార్ట్‌వాచ్ విశేషాలు.
వేరబుల్ కంప్యూటర్స్ విభాగంలో అందరి దృష్టిని ఆకర్షించినవి రిస్ట్‌బ్యాండ్లు. జేబర్డ్‌రెయిన్ బ్యాండ్ మీ శరీరానికి ఎప్పుడు వ్యాయామం అవసరమో గుర్తు చేస్తే... గెరో మీ కదలికలు అంటే ఎంతదూరం నడిచారు? పరుగెత్తారా? బరువెంత? వంటి అంశాలతోపాటు ఫోన్ వాడకం తీరులను గుర్తించి తగిన చర్యలు తీసుకోకపోతే మీకు రాగల వ్యాధుల గురించి హెచ్చరిస్తుంది.
ఇక లైఫ్‌లాగర్ గురించి... చిన్నవీడియోకెమెరాతోపాటు వచ్చే ఈ పరికరాన్ని మెడలో వేసుకుంటే చాలు.. మీరు ఎవరెవరిని కలుస్తున్నారు? వారితో ఏం మాట్లాడారు? వంటి వివరాలన్నీ నమోదు చేస్తుంది. మీ గొంతును బట్టి మీ ఉద్వేగాలను గుర్తించి జీవితంలోని మధురక్షణాలను ఫొటోలు, వీడియోల రూపంలో నిక్షిప్తం చేస్తుంది కూడా!
ఒంపుల టీవీలు...
ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ, హెచ్‌డీ టెక్నాలజీల రాకతో టెలివిజన్ చిత్రాలు ఎంత స్పష్టంగా, వివరణాత్మకంగా మారాయో మనందరికీ తెలుసు. సీఈఎస్ 2014లో ఈసారి వీటికి మించిన టెక్నాలజీలు అత్యంత భారీ సైజులో దర్శనమిచ్చాయి. టెలివిజన్ల పిక్చర్ రెజల్యూషన్ గురించి మీరు వినే ఉంటారు. 1024పీ అని, 1620పీ అని.. ఈ సంఖ్యను 4320కి పెంచారనుకోండి. 4కే టీవీలవుతాయి. సుప్రసిద్ధ టెలివిజన్ తయారీ సంస్థలు ఎల్‌జీ, పానసోనిక్, సాంసంగ్‌లు ఈ ఏడాది సీఈఎస్‌లో ఈ స్థాయి టెలివిజన్లను ప్రదర్శించాయి.
కేవలం రెజల్యూషన్‌తోనే ఆగిపోకుండా... చూసేవారికి మరింత సౌకర్యంగా ఉండేలా చేసేందుకు ఒక బటన్‌ను ప్రెస్ చేయడంతో టీవీ ఒంపులు తిరిగేలా ఏర్పాట్లు చేశారు దీంట్లో. ఎల్‌జీ ఏకంగా 105 అంగుళాలు (దాదాపు తొమ్మిది అడుగులు) వెడల్పయిన టీవీని ప్రదర్శించింది. మామూలుగానైతే ఈ 4కే టీవీల ధరలు ఆకాశాన్ని అంటాలి. అంటాయి కూడా. కానీ విజియో అనే ఒక కంపెనీ మాత్రం రూ.62వేలకే 4కేటీవీలు ఇచ్చేస్తామని ప్రకటించడం విశేషం. చైనీస్ సంస్థ లెనవూ 4కేస్థాయి రెజల్యూషన్‌తో కంప్యూటర్ మానిటర్‌ను ప్రదర్శనకు పెట్టింది.
యంత్రుల హంగామా!
సీఈఎస్ 2014లో రోబోలు కొత్తకొత్త ట్రిక్కులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఫ్రెంచ్ కంపెనీ కీకర్ అభివృద్ధి చేసిన రోబోనే చూడండి.. ఇది ఓ ప్రొజెక్టర్ రోబో. మీకు నచ్చిన వీడియోలను గోడపై సినిమా వేసేస్తుందన్నమాట. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఈ రోబోలతో టీవీలకు పనిలేకుండా పోతుందని కీకర్ వ్యవస్థాపకుడు పియరీ లెబూ అంటున్నారు.
‘‘మీ పిల్లలు పడుకునే గది పైకప్పును రాత్రిపూట పాలపుంతతో.. ఉదయాలను నిర్మలమైన ఆకాశంతో నింపేయండి’’ అంటారాయన. ఇలా వినోదాన్ని మాత్రమే పంచే రోబోలు మాత్రమే కాదు.. పిల్లలకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌ను అతిసులువుగా నేర్పించే ‘బో’, ‘యానా’లు, కిటికీలు శుభ్రం చేసేవి, వృద్ధులకు అసరాగా నిలిచేవి.. ఇలా ఎన్నో రకాలైన రోబోలు కూడా ఈ ప్రదర్శనలో సందడి చేశాయి.
‘స్కైబెల్’
అర్ధరాత్రి డోర్‌బెల్ మోగిందంటే ఎవరికైనా దడే. మీరు ఇంట్లో లేరనుకోండి. ఎవరు, ఎప్పుడు వచ్చారో తెలియని పరిస్థితి. కానీ మీ ఇంటి ముందు ‘స్కైబెల్’ బిగించారనుకోండి. ప్రపంచంలో మీరు ఏ మూలనున్నా నిశ్చింతగా ఉండవచ్చు. డోర్‌బెల్ మోగిన వెంటనే వచ్చింది ఎవరో తెలుసుకునేలా మీ స్మార్ట్‌ఫోన్ తెరపై వీడియో ప్రత్యక్షమవుతుంది మరి.
ఆండ్రాయిడ్‌తోపాటు, ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనూ పనిచేసే ఒక అప్లికేషన్ ద్వారా లైవ్ వీడియో ప్రసారమవుతుంది. వైఫై ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్ వీడియో డోర్‌బెల్ సాయంతో మీరు వచ్చినవాళ్లతో మాట్లాడవచ్చు కూడా. ఇంటిముందు ఎవరైనా తచ్చాడుతూంటే కూడా మోషన్ సెన్సర్ సాయంతో మీరు చూడవచ్చు. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ఈ స్కైబెల్ ఖరీదు దాదాపు రూ.12వేలు.
అకలస్ రిఫ్ట్ క్రిస్టల్ కోవ్..
వీడియోగేమ్‌ల తీరుతెన్నులను పూర్తిగా మార్చేసిన గేమింగ్ కన్సోల్ అకలస్ రిఫ్ట్. కళ్లముందే గేమింగ్ ప్రపంచం నిలబడటం అందులో మీరూ ఒక భాగమైపోయిన అనుభూతి కలిగించడం ఈ గేమింగ్ హెడ్‌సెట్ ప్రత్యేకత. సీఈఎస్ 2014లో అకలస్ తయారీదారులు మరింత ళధునికీకరించిన క్రిస్టల్‌కోవ్‌ను ప్రదర్శించారు.
కొత్త హంగులతో స్మార్ట్‌ఫోన్లు
మన జీవితాల్లో ఇప్పటికే స్మార్ట్‌ఫోన్లు ఒక భాగమైపోయాయనడంలో సందేహం లేదు. ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ సీఈఎస్‌లో సరికొత్త హంగులతో స్మార్ట్‌ఫోన్లు, ఫ్యాబ్లెట్లు దర్శనమిచ్చాయి. అంతకంతకూ పెరిగిపోతున్న స్మార్ట్‌ఫోన్ల కంప్యూటింగ్ సామర్థ్యాన్ని, క్లౌడ్ కంప్యూటింగ్‌ను కలగలిపి కొత్త వింతలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి.
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో విషయాన్నే తీసుకోండి.. దాదాపు 12.2. అంగుళాల సైజుతో వచ్చే ఈ టాబ్లెట్‌లో సామ్‌సంగ్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్ స్థానంలో సరికొత్త మ్యాగజైన్ యూఎక్స్‌ను ఏర్పాటు చేసింది. విండోస్-8 మాదిరిగా హోంస్క్రీన్‌పై లైవ్‌టైల్స్ ఉండటం దీని విశేషం.
నేటి టెక్ యుగంలో స్మార్ట్‌ఫోన్లతోపాటు వాటికి యాక్సెసరీస్ కూడా అంతే ముఖ్యం. మోఫీ స్పేస్‌ప్యాక్‌ను చూడండి.. ఐఫోన్ 5/5ఎస్‌తో పనిచేసే తొడుగు ఇది. అంతేనా? ఊహూ కానేకాదు.. అదనపు బ్యాటరీతో ఎప్పటికప్పుడు మీ ఫోన్‌ను ఫుల్‌ఛార్జ్‌లో పెడుతుంది. దాదాపు 32 గిగాబైట్ల మెమరీతో మీ ఫోన్‌మెమరీ నిండిపోకుండా చూస్తుంది.
ఇవి మాత్రమే కాకుండా.. సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్‌ను, లెనవూ ఎనిమిది అంగుళాల విండోస్ 8.1 ఆధారిత థింక్‌ప్యాడ్ 8 టాబ్లెట్‌ను, ఎల్‌జీ జీఫ్లెక్స్ పేరుతో కొంచెం వంపు తిరిగిన స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శించాయి. ఏసర్ కంపెనీ అయిదు అంగుళాల సైగధ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లిక్విడ్‌జెడ్5ను కూడా విడుదల చేసింది. దాదాపు రూ.15వేలకు లభించే ఈ ఫోన్ భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో మాత్రం తెలియదు.
స్వీట్లూ ప్రింట్ చేసుకోవచ్చు...
నిన్నమొన్నటివరకూ కేవలం హైటెక్ ఆర్భాటంగా మాత్రమే అనిపించే త్రీడీ ప్రింటర్లు ఇకపై మన ఇళ్లల్లోకి వచ్చే పరిస్థితి సీఈఎస్ 2014లో కనిపించింది. కేవలం 35 వేల రూపాయల నుంచి మూడున్నర లక్షల రూపాయల వరకూ ఉన్న వేర్వేరు కంపెనీల త్రీడీ ప్రింటర్లను ఇక్కడ ప్రదర్శించారు.
పిల్లలతోపాటు పెద్దలు కూడా ఇష్టపడే చాక్లెట్లు, క్యాండీల ఆకారాలను మీరు ఎప్పుడైనా గమనించారా? గుండ్రంగా, లేదా ఫ్లాట్‌గా మాత్రమే ఉంటాయి. ఇలా కాకుండా త్రీడీ షేపుల్లో చాక్లెట్ తినాలని ఉందా? అయితే మీరు అమెరికన్ కంపెనీ త్రీడీఎస్ అభివృద్ధి చేసిన చెఫ్‌జెట్‌ను కొనుక్కోవాల్సిందే. మైక్రోఓవెన్ మాదిరిగా ఉండే ఈ త్రీడీ ప్రింటర్ చిత్రవిచిత్రమైన ఆకారాల్లో చాక్లెట్లు ప్రింట్ చేసి ఇస్తుంది.
కీచెయిన్లు, ఇంట్లో వాడుకునే అనేకానేక చిన్నచిన్న వస్తువులు (బాటిల్‌హోల్డర్, కాఫీకప్ మ్యాట్స్ వంటివి) మీ ఇంట్లోనే ప్రింట్ చేసుకోవాలనుకుంటే సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ పైరేట్ త్రీడీ తయారుచేసిన బుకనీర్ త్రీడీ ప్రింటర్ మీకు అక్కరకొస్తుంది. దాదాపు రూ.35 వేలు మాత్రమే ఖరీదు చేసే ఈ త్రీడీ ప్రింటర్ ప్లాస్టిక్ లాంటి పదార్థాలను ఉపయోగించుకుంటుంది. టీవీల్లో సందడిచేసే డోరెమాన్, చోటాబీమ్ వంటి క్యారెక్టర్లను ప్రింట్ చేసుకునేందుకు త్రీడీ డూడ్లర్ ఒకడుగు ముందుకేసి త్రీడీ ప్రింటర్ సైజును పెన్ను స్థాయికి తగ్గించేసింది. అపురూపమైన ఆభరణాలను సొంతంగా డిజైన్ చేసుకుని ప్రింట్ చేసుకునేందుకు అమెరికన్ పెర్ల్ అనే కంపెనీ ఓ ప్రింటర్‌ను అభివృద్ధి చేసింది.
మేకర్‌బోట్ త్రీడీ ప్రింటర్ వంటి వాటితో కొందరు కృత్రిమ శరీర అవయవాలను కూడా తయారుచేసుకుంటూండటం ఈ రంగంలో వస్తున్న పెనుమార్పులకు నిదర్శనంగా నిలుస్తుంది. మేకర్‌బోట్ ఈ ఏడాది సీఈఎస్‌లో దాదాపు మినీ రిఫ్రిజరేటర్ సైజులో ఉండే ప్రింటర్‌ను ప్రదర్శించింది. ఇది మనిషి తల సైజులో వస్తువులను ప్రింట్ చేసి ఇస్తుంది.