స్మార్ట్‌గా అతుక్కుపోతున్నారు.. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లే! | Screening Rate Of Per Day Increased By World Wide People | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌గా అతుక్కుపోతున్నారు.. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లే ఎక్కువ స్క్రీనింగ్‌

Published Mon, Dec 5 2022 12:15 PM | Last Updated on Mon, Dec 5 2022 3:02 PM

Screening Rate Of Per Day Increased By World Wide People - Sakshi

సాక్షి, అమరావతి:  ప్రస్తుతం మనిషి బాహ్య ప్రపంచానికి దూరంగా ఆన్‌లైన్‌లో గడుపుతున్నాడు. పక్కవాడిని కూడా చాటింగ్‌లోనే పలకరిస్తున్నాడు. సుఖదుఃఖాలన్నీ కూర్చున్నచోటునే అనుభవిస్తున్నాడు. గంటల కొద్దీ స్మార్ట్‌ఫోన్, టీవీ, ఇంటర్‌నెట్‌ స్క్రీనింగ్‌లో మునిగిపోతున్నాడు. దైనందిన జీవితంలో చాలామంది మేల్కొని ఉండే సమయంలో ఏకంగా 44 శాతం సమయాన్ని స్క్రీనింగ్‌ కోసమే కేటాయిస్తుండటం (40 శాతం ఇంటర్‌నెట్‌లో) ఆశ్చర్యం కలిగిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటు స్క్రీనింగ్‌ రేటు 6.58 గంటలుగా ఉంది. ఇది  2013తో పోలిస్తే 49 నిమిషాలు పెరగడం గమనార్హం. అత్యధికంగా దక్షిణాఫ్రికాలో 10.46 గంటలు, అమెరికాలో అయితే 7.04 గంటలు, భారత్‌లో అయితే 7.18 గంటలుగా నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ తల్లిదండ్రులతో కలిసి 0–2 ఏళ్లలోపు పిల్లలు 49 శాతం మంది సెల్‌ఫోన్లలో ఉంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2019లో సగటున 2.56 గంటల పాటు మొబైల్‌ స్క్రీన్‌ చూసిన వాళ్లు ఇప్పుడు 4.12 గంటలు చూస్తున్నారు. దేశంలో టీనేజర్లు అయితే ఏకంగా 8 గంటలకు పైగా ఆన్‌లైన్‌లోనే బతికేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సగటు స్క్రీనింగ్‌ సమయం కంటే ఎక్కువ. 

కళ్లు పొడారిపోతాయి 
ఎక్కువసేపు మొబైల్స్, టీవీ, కంప్యూటర్‌లు చూడటంవల్ల కళ్లు పొడారిపోతాయి. దీంతో కళ్లు ఎర్రగా మారి దురదలు, మంటలు వస్తుంటాయి. క్రమేణా నల్లగుడ్డు సమస్యలకు దారితీస్తాయి. వీటితో పాటు నిద్రలేమి, మానసిక సమస్యలకు దారితీస్తాయి. విద్యార్థులైతే చదువుపై దృష్టి సారించలేక పోవడం, చదివినవి మర్చిపోవడం వంటి సమస్యలకు గురవుతారు. అవసరమైన మేరకే టీవీలు, కంప్యూటర్, మొబైల్స్‌ను చూడాలి.  
– ఈఎస్‌ఎన్‌ మూర్తి, నేత్ర వైద్య నిపుణులు, జీజీహెచ్, విజయవాడ  

చిన్నారుల కోసం నిర్ణీత సమయం.. 
అమెరికన్‌ టీనేజర్లు అయితే కేవలం 3 గంటలు మాత్రమే టీవీ, వీడియోలు చూడటానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. చైనాలో వారానికి మూడు గంటలు మాత్రమే చిన్నారులకు స్క్రీన్‌ సమయాన్ని పరిమితం చేయాలని ఆ దేశం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రోజుకు 26 నిమిషాలు మాత్రమే నచ్చిన పరికరంలో నచ్చిన అంశాలను వీక్షించవచ్చు. ఇదే దారిలో జపాన్, రష్యా కూడా 30 నిమిషాలు, ఇజ్రాయెల్‌ 19 నిమిషాలు చాలంటూ పెద్దఎత్తున అవగాహన కల్పిస్తున్నాయి. 

ఆరోగ్యానికి హానికరం
గంటల కొద్దీ తదేకంగా టీవీలు, ఫోన్లు, ఇంటర్‌నెట్‌కు అతుక్కుపోతే తీవ్ర అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు, యుక్త వయస్కులకు స్మార్ట్‌ఫోన్‌ వ్యసనంగా మారింది. దీనిని నోమోఫోబియాగా పిలుస్తారు. ఫోన్‌ లేకుండా వారు ఉండలేరు. చిన్నారుల్లో మానసికంగా, భావోద్వేగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎలిమెంటరీ స్కూల్‌ స్థాయి పిల్లలు రెండు గంటలు అంతకంటే ఎక్కువసేపు స్క్రీనింగ్‌లో ఉంటే వారికి మెల్లగా స్థిరత్వాన్ని, నిర్ణయించుకునే శక్తి కోల్పోతారు. పలు దేశాల్లో 5–17 ఏళ్ల మధ్య వయసు చిన్నారుల్లో ఊబకాయం పెరిగింది. 9–10 ఏళ్ల వయసు పిల్లల్లో 3 గంటలకు పైగా స్క్రీన్‌ను చూస్తే టైప్‌–2 డయాబెటిస్‌ వచ్చినట్లు, గ్రహణశక్తిలో వెనుబడినట్లు గుర్తించారు. పెద్దల్లో అయితే నిద్రలేమికి దారితీస్తుంది. కంటి చూపును తీవ్రంగా దెబ్బతీస్తుంది. శరీరం పనితీరులో మార్పులొస్తాయి. వీటిని అరికట్టేందుకు సోషల్‌ మీడియా వాడకాన్ని ప్రతిఒక్కరూ రోజుకు 30 నిమిషాలకు పరిమితం చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

 తక్కువ ఆదాయం ఉన్నవాళ్లే ఎక్కువ సమయం 
స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌టీవీలు.. స్క్రీనింగ్‌కు ఎక్కువగా కారణమవుతున్నాయి. అయితే, వార్షిక ఆదాయం తక్కువ ఉన్న వాళ్లే ఎలక్ట్రానిక్‌ స్క్రీనింగ్‌లో ఎక్కువసేపు లీనమవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశంలో 97.2 శాతం మంది టీవీ, 92 శాతం మంది వీడియో గేములు ఆడుతున్నట్లు సర్వేల్లో తేలింది. ఇక్కడ 74 శాతం తల్లిదండ్రులు ఏడేళ్ల వయసు పిల్లలతో కలిసి ఎక్కువగా టీవీలు చూస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement