కటిక చీకట్లోనే వస్తాడు
ఆచార్య దేవోభవ
మనం అజ్ఞానం అనే కటిక చీకట్లో ఉన్నప్పుడు, ఒక దీపంలాగా వాటిని తొలగించడానికి ఒక గురువు అవసరమవుతాడు. అర్ధరాత్రి 12 గంటలవేళ వచ్చింది కృష్ణ పరమాత్మ అవతారం. పుడుతూనే ఆయన నిర్భయత్వాన్ని కల్పించాడు. అప్పటివరకు తనకు కొడుకు పుడితే ఏమయిపోతాడోనని భయపడిపోతున్న దేవకీదేవికి, వసుదేవుడికి ఊరటకల్పించాడు. పసిపిల్లవాడిగా జన్మించినప్పటికీ ఆయన రూపం గోచరమయినంత మాత్రం చేత భయం స్థానంలో ఆనందం కలిగింది. అది పరమేశ్వరుని లక్షణం. ఆయన దర్శనమే ఆనంద హేతువు. అందుకే ఆనందనిలయంలో ఉంటాడాయన.
ప్రస్థానత్రయంలో ఒకటైన భగవద్గీతను లోకానికంతటికీ బోధచేసి భయాన్ని పోగొట్టి, జ్ఞానాన్ని ప్రబోధంచేసి ఆత్మ అనుభవంలోకి రావడానికి మార్గాన్ని బోధచేసాడు. భగవద్గీతలో ఒక శ్లోకంకాదు ఒక పాదం చదువుకుంటే చాలు. అందుకే భగవద్గీతను నమ్ముకున్నవాడికి యమధర్మరాజుతో చర్చేలేదన్నారు శంకర భగవత్పాదులు. అంటే యమధర్మరాజు రావడం, పాశాలు వేయడం, రమ్మనమనడం, నేను రానని జీవుడు మొరాయించడం ఉండవు. చిట్టచివరన యమ దర్శనం లేకుండా తాను ఆత్మ అనే ఉద్దేశంతో ఆ ఆత్మ అనుభవంలోకి వచ్చిన వాడై శరీరం అసత్యమన్నది ఎరుకలోకి వచ్చి సాక్షిగా చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు.
భగవాన్ రమణుల వారికి అంత్యకాలం సమీపించింది. శరీరం పడిపోయే సమయం వచ్చేసింది. ఊపిరి సరిగా అందట్లేదు. ఆయన ఆనందబాష్పాలు కార్చారు. ’హమ్మయ్య, గుడారంలోంచి ఏనుగు బయటికి వచ్చినట్లు అత్యంత అల్పమైన, పరిమితైన ఉపాధిలోంచి ఆనంతమైన ఆత్మసర్వవ్యాపకత్వాన్ని పొందుతోంది – అని ఆనందించారు. ఆక్సిజన్ సిలిండర్ తీసుకొస్తుంటే వద్దని సైగచేస్తూ నిర్భయంగా శరీరంలోంచి జ్యోతి స్వరూపంగా వెళ్ళి అరుణాచలం గిరికంతటికీ ప్రదక్షిణం చేసి కొన్ని వేలమంది దర్శనం చేస్తుండగా అరుణాచలంలోకి వెళ్ళిపోయారు. అది యోగం. అంటే అనేకంగా కనబడుతున్నవి – జీవుడని, ప్రపంచమని, నేనని, నువ్వని, ఒకటని మూడని, పదహారని కనబడుతున్నవి చిట్టచివరిగా సత్యంగా ఒకటిగా రూపాంతరం చెంది అనుభవంలోకి వస్తాయి.
అజ్ఞానపు తెరలు తొలగి జ్ఞానం జ్యోతి స్వరూపమై ప్రకాశిస్తుంది. పడిపోతున్న శరీరాన్ని సాక్షిగా చూస్తాడు. ఒక కంట్లో నొప్పెడుతుంటే కంట్లో నొప్పి పెడుతున్నదని ఎలా తెలుసుకుంటున్నామో, చెయ్యి నొప్పెడుతుంటే సాక్షిగా తన చెయ్యి నొప్పి పెడుతున్నదని ఎలా తెలుసుకుంటున్నామో పడిపోతున్న శరీరాన్ని కూడా తాను సాక్షిగా చూస్తాడు. అలా చూస్తూ నిలబడగలిగిన ప్రజ్ఞ, జ్ఞానం కేవలం భగవంతుని అనుగ్రహం చేత వస్తుంది. అందుకే భగవానుడు కూడా గురువుగానే ఈ లోకంలోకి వచ్చాడు. ఒక్క గురువు యొక్క వాక్యం వలననే భగవంతుడు పరిచయమవుతాడు. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు