అమ్మ ఒళ్ళోతలపెట్టి పడుకోవాలనుంది! | chaganti koteswara rao divotional speech | Sakshi
Sakshi News home page

అమ్మ ఒళ్ళోతలపెట్టి పడుకోవాలనుంది!

Published Sun, Jan 8 2017 12:50 AM | Last Updated on Mon, May 28 2018 4:09 PM

అమ్మ ఒళ్ళోతలపెట్టి పడుకోవాలనుంది! - Sakshi

అమ్మ ఒళ్ళోతలపెట్టి పడుకోవాలనుంది!

అమ్మలో సృష్టికారకత్వమైన బ్రహ్మతత్త్వమే కాదు, స్థితి కారకత్త్వమైన విష్ణుతత్త్వం కూడా ఉందని చెప్పుకుంటున్నాం. రక్షకత్వం అమ్మ నరనరానా జీర్ణించుకుని ఉంటుంది. ఇది చంటితనంలో పాలివ్వడంలోనే కాదు, బిడ్డకు ఎన్నేళ్ళ వయసొచ్చినా, పుట్టిన కొడుకు కృతఘ్నుడే అయినా వాడు నూరేళ్ళు బతకాలని అమ్మ కోరుకుంటుంది.  నోములు, వ్రతాలు, పూజలు, ప్రార్థనలు అన్నీ బిడ్డ క్షేమం కోరే చేస్తుంది. ఆమెకు ఎంత వయసొచ్చినా ఇది అమ్మ లక్షణం.. అమ్మ స్థితికారకత్వం.

శరీరం విడిచిపెట్టిన తరువాత అంత్యేష్ఠి సంస్కారం మంత్రవైభవంతో చెప్తారు. జీవుడు శరీరాన్ని వదలి వెళ్ళే దశల్లో చివరన వ్యానవాయువనేది జీవుడిని, శరీరాన్ని  పట్టుకుని ఉంటుంది. అలా పట్టుకుని ఉన్నప్పుడు – కన్నబిడ్డలనే కాదు, జ్ఞాతులందరినీ అపేక్షిస్తుంది. అందుకే జ్ఞాతులు 11 రోజులు మైలపడతారు. వారి సంక్షేమంకోసం కొడుకు 11వ రోజున శ్మశానంలోనే ఆనంద హోమం చేస్తాడు. ఆ సమయంలో కొడుకు వెళ్ళి శవరూపంలో ఉన్న అమ్మతో ఒకమాట చెప్తాడు. ‘‘పిచ్చితల్లీ ! శరీరం జర్జరీభూతమయి పోయింది. ఇంకా ఎన్నాళ్ళు పెట్టుకుంటావు మా మీద వ్యామోహం! అమ్మా! మేం సంతోషంగా ఉన్నాం. వదిలిపెట్టేయ్‌ శరీరాన్ని. వెళ్ళిపో. పోయి మంచి శరీరాన్ని పొంది రా. మళ్ళీ లోకంలో పుణ్యకర్మలు చేసుకో. వదిలిపెట్టెయ్‌’’ అని కొడుకు చెప్పిన మంత్రానికి వదిలేస్తుంది శరీరాన్ని. అప్పటివరకు వదలదు.

శిథిలమయిపోయిన భవనం మీద తన యాజమాన్య హక్కు పెట్టుకున్నట్లు జీవుడు (తండ్రికానీ, తల్లికానీ) శరీరాన్ని పట్టుకుని ఉంటాడు. కొడుకు చెప్పిన మంత్రంతో వదిలేస్తాడు. అదీ వాళ్ళిద్దరి అనుబంధం. అమ్మ కడుపులో నుంచి బయటికి రావడంతో నాభీబంధం (బొడ్డు) తెగిపోవచ్చు. కానీ హృదయ సంబంధం మాత్రం తెగదు. కొడుకు ధార్మికుడైతే ఆ హృదయ సంబంధం ఉన్నందుకు ఎక్కడ ఉన్న పితృదేవతలనైనా ఉద్ధరించగలడు. ఇక్కడ గయా శ్రాద్ధం పెట్టి ఎవరినైనా ఉద్ధరించగలడు. అటువంటి కొడుకు పుట్టాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కాబట్టి అమ్మ అంటే రక్షకత్వం.

శిశువు జన్మించిన నాటినుండి నాలుగు లేదా ఆరు నెలల వరకూ శిశువు శరీరానికి కావలసిన సమస్త పోషకవిలువలున్న పాలు పరమ పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తయరయ్యేది ఒక్క అమ్మలోనే – అని  డాక్టర్లు చెబుతుంటారు. నేను చెబుతున్నది సనాతన ధర్మశాస్త్రాలలోది కాదు, సనాతనం కేవలం ‘మాతృదేవోభవ’ అన్నది. పుస్తకాల్లో డాక్టర్లు రాసిన మాట మీతో మనవి చేసుకుంటున్నా. అమ్మ అన్నం తిన్నందుకు అమ్మలో పాలు ఊరవు. బిడ్డ చప్పరిస్తే వాడి ఆకలి తీరలేదన్న భావనచేత ఊరతాయట. వాడి కడుపు నిండుతుంటే అమ్మకు ఆరోగ్యం కలుగుతుందని రాశారు. అంత గొప్ప స్వరూపం అమ్మలో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టే అమ్మ విష్ణువు. అమ్మను మించిన రక్షకుడు లోకంలో ఉండరు.  అందువల్ల ‘‘మా అమ్మగారా... నా వద్దే ఉంటున్నారండీ’’ అనకు. అది చాలా తప్పు మాట. ‘‘నా అదృష్టమండీ, నాకిన్నేళ్ళు వచ్చినా అమ్మ చేతి అన్నం తింటున్నాను’’ అని అనాలి. అంతే తప్ప ‘అమ్మకు నేను అన్నం పెడుతున్నా’ననడం కృతఘ్నత.

సృష్టికారకుడైన బ్రహ్మ, స్థితికారకుడైన విష్ణువులే కాదు, లయ కారకుడైన రుద్రుడి అంశ కూడా అమ్మలో ఉంది. ఆమెలో ఉన్నది శివశక్తి. చాలా మంది రుద్రుడు అనగానే ఆయన చంపేస్తాడనుకుంటారు. అలా అర్థం చేసుకోకూడదు. అలా అయితే శివార్చనలు ఎందుకుంటాయి లోకంలో? అలా ఉండదు.

లయ కారకుడైన రుద్రుడు మూడు రకాలైన ప్రళయాలు చేస్తాడు. ఒకటి – నిత్య ప్రళయం. రోజూ చేసేది నిత్య ప్రళయం. మనకు పరమేశ్వరుడు జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను ఇచ్చాడు. వీటిని విచ్చలవిడిగా వాడేసారనుకోండి. అవి అలసిపోతాయి. వాటికి మళ్ళీ శక్తి కావాలి. మనం  పడుకున్నప్పుడు రుద్రుడు మనకు నిద్రాకాలిక సుఖాన్నిచ్చి, మనం ఆ సుఖం అనుభవిస్తుండగా ఇంద్రియాలన్నింటికీ పటుత్వమిస్తాడు. అంటే అవి కోల్పోయిన శక్తిని మళ్ళీ ఇస్తాడు. దీనిని నిత్య ప్రళయమంటారు. రెండవది – ఆత్యంతిక ప్రళయం, అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమిస్తాడు. మూడవది – మహా ప్రళయం. అంటే జీవుడు తనను పొందలేకపోతే యుగాంతంలో తానే జీవుడిని పొందేస్తాడు. మైనపు ముద్ద నల్లపూసల మీద పడ్డట్లు తనని పొందలేకపోయిన జీవులను మహా ప్రళయంతో పరమాత్మ తానే పొందేస్తాడు. ఇవి మూడూ చేస్తాడు. అందుకే ఆయన శివుడయ్యాడు.

అమ్మలో శివాంశ ఉంటుంది. ఎలా అంటే... అమ్మ చేసే చాలా గొప్ప పని నిద్రపుచ్చడం. అమ్మదగ్గర పిల్లలు పడుకున్నంత తేలిగ్గా మరెక్కడా పడుకోరు. పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నా, అమ్మ ఒక్కసారెత్తుకుని ఇలా జోకొడితే చాలు... అమ్మ స్పర్శతగలగానే... నిద్రలోకి జారుకుంటారు. అమ్మ నోటిమాటవింటే చాలు.. నిద్రపోతారు. అమ్మ నిద్రాకాలిక సుఖాన్నిస్తుంది. అమ్మ ఒడిలో నిద్రపోవాలన్న కోరికకు కృష్ణ పరమాత్మ అంతటివాడు పరవశించిపోయాడు. అమ్మంటే తెలియని పరమాత్మ... అమ్మ ఒడిచేరేటప్పటికి నిద్రపోయాడు. ఇక మనమెంతటి వాళ్ళం! అమ్మ ఒడికి సమానమైనది లేదు. అది శివపర్యంకం. అమ్మ శివస్వరూపమై ఆరోగ్యాన్నిచ్చి కాపాడుతుంది. నిత్య ప్రళయం చేస్తుంది. ఇది అమ్మలోని రుద్రాంశ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement