నిప్పులాంటి మోసం | cheating like a fire | Sakshi
Sakshi News home page

నిప్పులాంటి మోసం

Published Tue, May 24 2016 6:54 AM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

నిప్పులాంటి మోసం

నిప్పులాంటి మోసం

చేతనబడి


ఒక మోస్తరు డాబా ఇల్లు. ఇంటి ముందు నలభై మంది సమావేశం కాదగిన విశాలమైన వరండా. అందులో ఒక పీఠం. దాని ముందు రకరకాల వస్తువులు. పూజలకు ఉపయోగించే మట్టి ప్రమిదలు, మూకుళ్లు, ఒక మూకుడులో పసుపు, ఒక మూకుడులో కుంకుమ, ఒక ఆకు దొన్నెలో సన్నని దారాలు, ఒక చోట నలుచదరంగా కత్తిరించిన కాగితాల దొంతర, ఒక ఇత్తడి పాత్రలో నిప్పులు, ఆ పక్కనే మరొక పాత్రలో సాంబ్రాణి... ఇలా వైవిధ్యమైన వాతావరణం నెలకొని ఉంది.

 

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పూలమాల గ్రామానికి ఆ పొరుగునే ఉన్న పార్లపల్లి గ్రామం నుంచి వచ్చారు జ్యోతి, అనూరాధ. వారిలాగానే పెద్ద మరిమీడు, చిన్న మరిమీడు, మరికొన్ని గ్రామాల నుంచి వచ్చిన వాళ్లు... అంతా ఓ పదిమందికి పైగా ఉన్నారు. వచ్చిన అందరినీ ఎంతో ఆప్యాయంగా... మేనమామలా ప్రేమగా పలకరిస్తున్నాడు ఓ వ్యక్తి. ఆ ఆత్మీయతకు ఒక్కొక్కరి మనసు తలుపులు తెరుచుకుంటోంది. అత్యంత నిగూఢంగా దాచుకున్న కష్టాన్ని ఆత్మీయుడి ముందు బయటపెట్టుకుంటూ కళ్లు తుడుచుకుంటున్నారు. గతంలో తనకొచ్చిన కష్టాలను వారితో పంచుకున్నాడాయన, వాటిని స్వామి చేత్తో తీసిపారేసినట్లు ఎలా తొలగించాడో చెబుతున్నాడు. సరైన చోటకే వచ్చామనే భరోసా కలుగుతోంది అక్కడున్న వారిలో.ఒక జంట తమ కూతురి పెళ్లికి ఇంకా ఎంత సమయం ఉందని అడిగారు.  సంబంధాలు కుదిరినట్లే కుదిరి ఆగిపోతున్నాయని వాపోయారు. బాబా చిర్నవ్వుతో ‘‘మీ అమ్మాయికి అడ్డు వస్తున్న కీడు తొలగిపోతుంది’’ అన్నాడు ధైర్యం ఇస్తున్నట్లు.

 

 బాబా ఎదురుగా మట్టి కుండ మీద పెట్టే చిన్న మట్టిపాత్ర. కచ్చితంగా ఆ పాత్ర మధ్యలో తానొక స్పూను వేసి చూపించి మిగిలిన నెయ్యి వారిచేతనే పోయించాడు బాబా. కళ్లు మూసుకుని దీర్ఘంగా మంత్రాలు వల్లించాడు. నిమిషం లోపే పొగ మొదలైంది. ఆ వెంటనే మంట రాజుకుంది. మంట పెద్దదైంది. రెండు నిమిషాల్లో మంట చల్లారి బూడిద మిగిలింది.

 
‘‘మీ అమ్మాయికి అడ్డుపడుతున్న కీడు మండిపోయింది. ఇక మీ ఊరికి వెళ్లి, అమ్మాయి కీడు తొలగిపోయిందని బంధువులందరికీ చెప్పండి. ప్రయత్నాలు కొనసాగించండి. ఆర్నెల్లలో పెళ్లవుతుంది’’ సంతృప్తికరమైన సమాధానంతో ప్రఫుల్లమైన ముఖంతో లేచారు ఆ తల్లిదండ్రులు. వెళ్తూ వెళ్తూ సంతోషంగా దక్షిణ సమర్పించుకున్నారు. వెంటనే ఒకాయన... ‘రోజుకు ఆరు లీటర్ల పాలిచ్చే తన గేదె ఉన్నట్లుండి ఎండిపోయింద’ని బాబా ముందు వాపోయాడు. ఒక అంత్రాన్ని మంత్రించి ఇచ్చి గేదెకు కట్టమన్నాడు బాబా. దానిని జాగ్రత్తగా చొక్కా లోపలి జేబులో పెట్టుకుని, దక్షిణ తీశాడు ఆ రైతు. ఓ యువ దంపతులు చూడడానికి ముచ్చటగా ఉన్నారు. వారిది అన్యోన్యమైన కాపురమేననిపిస్తోంది. ఈ వయసులో వీళ్లకు వచ్చిన కష్టమేంటో పాపం- అనుకుంటున్నారు అక్కడికొచ్చిన వాళ్లు. ‘‘మీకు పిల్లలు పుడతారు. బెంగ అక్కరలేదు’’ అన్నాడు బాబా.

 
ఆశ్చర్యంగా చూశారు అందరూ. బాబా వారికి మంత్రించిన తాయెత్తు ఇచ్చి ‘నీ భార్య చేతికి కట్టు’ అని ఆదేశించాడు. అలాగే ఆ అమ్మాయికి మరో తాయెత్తు ఇచ్చి ‘ఇది నీ భర్తకు కట్టమ్మా’ అన్నాడు అనునయంగా. ఇక జ్యోతి, అనూరాధల వంతు... ఇద్దరూ ఇబ్బందిగా చూశారు. వారి సంశయాన్ని, వారిలో ఒక మోస్తరు సంపన్నతను గ్రహించిన బాబా వారిని మరికొంత సేపు ఆగమని, మిగిలిన వారిని పంపించేశాడు.

 

 
ఇద్దరినీ మార్చి చూస్తూ... జ్యోతితో ‘‘నీ భర్త మరొక స్త్రీతో సన్నిహితంగా ఉంటున్నాడని నీకెప్పుడు తెలిసింది’’ అడిగాడు బాబా. అసలే ఆందోళనగా ఉన్న అనూరాధ ముఖం ఆ మాటతో పాలిపోయింది. ‘‘రెండేళ్ల నుంచి తెలుసు’’ నూతిలో నుంచి వచ్చినట్లు ఉంది ఆమె మాట.  బాబా కళ్లు మూసుకుని ఏదో జపించాడు. పిడికిలి బిగించి నుదుటి మీద పెట్టుకున్నాడు. ముఖంలో ఆవేశం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. క్షణాల్లోనే కళ్లు తెరిచాడు. కళ్లు ఎర్రగా మండుతున్నాయి. ముఖం రౌద్రంగా మారిపోయింది. గాల్లోకి చూస్తూ ‘‘అమాయకురాలి కాపురంలో నిప్పులు పోస్తావా’’ అని హుంకరించాడు. క్షణాల్లో స్థిమిత పడి జ్యోతి వైపు చూశాడు. ‘‘నీ భర్త మీద వశీకరణం జరిగింది’’ జ్యోతి వణికి పోతోంది. భయపడకు అన్నట్లు ఆమె భుజం చుట్టూ చేయి వేసి తడుతోంది అనూరాధ.‘‘ధైర్యంగా ఉండు. కష్టపెట్టే వాళ్లున్నట్లే ఆదుకునే వాళ్లూ ఉంటారు. కీడును తొలగిద్దాం’’ అన్నాడు బాబా.  కళ్లు తుడుచుకుంటూ అలాగేనన్నట్లు తలూపింది. ‘‘చిన్న హోమం చేద్దాం. నెయ్యి ఉందా’’ వారి చెంత ఉన్న పూజసామగ్రి వైపు చూశాడు బాబా.

 
అనూరాధ పైకి లేచి ‘‘ఈ ఊళ్లో నెయ్యి దొరికే దుకాణాలున్నాయా? ఎటు వెళ్లాలి’’ అని వివరాలడుగుతోంది. ఆత్మీయుడు జోక్యం చేసుకున్నాడు. ‘‘కొత్త చోట వాళ్లేం ఇబ్బంది పడతారు పైగా ఆడవాళ్లు పాపం... నువ్వెళ్లి తీసుకురాకూడదూ’’ అంటూ అక్కడే ఉన్న ఓ కుర్రాణ్ని పురమాయించాడు. అనూరాధ ఆ కుర్రాడికి డబ్బిచ్చి పంపించింది. పది నిమిషాల్లోనే నేతితో వచ్చాడు ఆ కుర్రాడు. జ్యోతితో మట్టిపాత్రలో నెయ్యి పోయించాడు బాబా. అంతకు ఓ అరగంట ముందే పెళ్లి కావాల్సిన అమ్మాయి కోసం మంత్రించినట్లే మంత్రించాడు. ఎంత సేపటికీ నిప్పు కాదు కదా పొగ కూడా రావడం లేదు. జ్యోతి కుప్పకూలిపోలేదు అనే కానీ దాదాపు ఆమె పరిస్థితి అలాగే ఉంది. ‘‘వశీకరణకు విరుగుడుగా ఐదువారాల పాటు రోజూ ముగ్గు పెట్టి ఆవాహన చేస్తాను. నువ్వు రోజూ రానక్కరలేదు. ప్రతి శుక్రవారం వచ్చి పూజలో కూర్చుంటే చాలు. మూడో వారానికే కీడు మండిపోవాలి... ’’ తగుమాత్రం భయపెడుతూనే, ఆ భయాన్ని కొనసాగించడానికి కావలసినంత ధైర్యం చెప్పాడు.

 

జ్యోతి కేసులో ఐదవ వారం వరకు ఆగాల్సిన పని రాలేదు. నాలుగవ వారానికే బాబా ప్రయోగించిన చిట్కాల రహస్యం బట్టబయలైంది. బాబా చేస్తున్నవి మోసాలని తెలిసిన తరవాత ఊళ్లో వాళ్లు ఆవేశంతో ఊగిపోయారు. అడ్డుకోకపోతే ప్రాణాలు పోయేటట్లున్నాయి. ట్విస్ట్ ఏమిటంటే... పోలీసులకు సమాచారం వెళ్లేలోపు బాబా ఊరి వారి కాళ్లు పట్టుకున్నాడు. ఇక ఇలా మాయలు చేయనని ఒట్టు పెట్టుకుని గండం నుంచి బయటపడ్డాడు.

 

మంటలెలా వస్తాయి?
వాటి లోపల... అంటే కాగితాల కింద దీపం పెట్టే దొన్నె ఉంటుంది. అందులో పొటాషియం పర్మాంగనేట్ పొడి ఉంటుంది. అది బూడిదరంగులో ఉండటం వల్ల ఆ సంగతి ఎవరికీ తెలియదు. దాని మీద గ్లిజరిన్ కలిసిన నెయ్యి పడిన ఇరవై సెకన్లకు పొగ, మంట మొదలవుతాయి. పొటాషియం పర్మాంగనేట్‌తో గ్లిజరిన్ కలిస్తే ఉష్ణమోచక చర్య జరిగి 200 డిగ్రీల వేడి పుడుతుంది. అందులో నుంచి మంటలు వస్తాయి. కొందరికి మొదటిసారే మంటలు తెప్పిస్తారు. బాగా డబ్బు గుంజవచ్చనే భరోసా ఉన్న చోట మూడు- ఐదు వారాలు తిప్పిన తర్వాత మంట తెప్పిస్తారు. అంత వరకు గ్లిజరిన్ లేని నెయ్యి మాత్రమే వేస్తారు. జనవిజ్ఞాన వేదిక దర్యాప్తులో బాబా దగ్గర ఉండే కుర్రాడు ఏ దుకాణంలో నెయ్యి కొంటున్నాడో గమనించి, ఆ దుకాణదారుడిని నిలదీస్తే విషయం బయటపడింది.

 

జ్యోతి తన కాపురం నిలబెట్టమని బాబా దగ్గరకు వెళ్తున్నట్లు ఇరుగుపొరుగుకి తెలిసింది. భర్త వెంకటేశ్‌కూ తెలిసింది. ఈ సంగతి తెలిసిన వాళ్లంతా అతడిని దోషిని చూసినట్లు చూస్తున్నారు. దాంతో జ్యోతి దూరమైపోయిందనే భయం మొదలైందడిలో. మిత్రుడి దగ్గర భోరుమన్నాడు. మూడేళ్లుగా భార్యకు దూరంగా ఉండడానికి ఆకస్మాత్తుగా తనలో తలెత్తిన‘స్తంభన సమస్యే’ కారణమని చెప్పుకోక తప్పలేదు. ఆ మిత్రుడు హేతువాద దృక్పథం కలిగిన వాడు కావడంతో జ్యోతి భర్త అనారోగ్యంతోపాటు బాబా కుట్ర కూడా బయటపడింది. బాబా దగ్గరకొచ్చేవాళ్లందరూ చుట్టుపక్కల ఊళ్లలోనేవాళ్లే. వారి సమస్యలన్నీ తన మనుషుల  ద్వారా  బాబాకు తెలిసిపోతుంటాయి.

 

అగ్గి లేని బుగ్గి!
పుండరీకాక్షయ్య మలయాళ మాంత్రికుడు. కేరళలోనే కాకుండా యావద్దేశంలో ఒక సంచలనం సృష్టించాడు. యజ్ఞాలు చేస్తానని, యజ్ఞగుండంలో అగ్గిలేకుండా మంత్రంతోనే మంట తెప్పిస్తానని సవాల్ చేసేవాడు. అన్నట్లే మంటలు తెప్పించేవాడు. అదంతా మంత్రం మహిమ అని జనం నీరాజనాలు పట్టారు. అందులో ఉన్న సైంటిఫిక్ ఫార్ములాను బట్టబయలు చేసిన తర్వాత ఆయన ఆ తరహా ప్రాక్టీస్ మానేశారు. - మహమ్మద్ మియా,  కర్నూలు, జనవిజ్ఞానవేదిక కార్యకర్త

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement