
చీకటి వెలుగులు
గన్
దీపావళి అంటే బాల్యం. సందడి, శబ్దం, వెలుగు కలిస్తేనే దీపావళి. టపాసులతో చేతులు కాలకుండా పెరిగి పెద్దయినవాళ్లు ఒక్కరు కూడా ఉండరు. అందుకే ఈ పండుగ గుర్తొస్తే జ్ఞాపకాల్లో ఒక అల కదులుతుంది. రాయదుర్గంలో శీనయ్య అంగడంటే చాలా ఫేమస్. ఎందుకంటే టపాసులు అమ్మేది ఆయనొక్కడే కాబట్టి. దసరా నాటికే టపాసులు స్టాక్ వచ్చేవి. సర్కస్‌లో ఏనుగుల్ని చూడ్డానికి వెళ్లినట్టు ఆ టపాసులు చూడ్డానికి వెళ్లేవాళ్లం. ప్రతి ఏడాది అవే. రాకెట్లు, లక్ష్మీ ఔట్లు, భూ, విష్ణు చక్రాలు, వెన్నముద్దలు... అయినా వాటిని చూడ్డం ఓ థ్రిల్. దసరా నుండి దీపావళి వరకూ చాక్లెట్లు, బిస్కెట్లు, పుల్ల ఐస్‌క్రీంలు అన్ని కొనుగోళ్లు బంద్. చిన్న పిల్లల ఫుడ్ మార్కెట్‌కి ఆర్థికమాంద్యమొచ్చేది. ప్రతి పైసాని కాల్చి బూడిద చేసేవాళ్లం.
మొదట చేసే పని ఇంట్లో వాళ్లని కాల్చుకు తిని రూపాయి పెట్టి రివాల్వర్ కొనేవాళ్లం. అవి పేలాలంటే రీలు కావాలి. రివాల్వర్‌లో రీలు చుట్టడం ఓ కళ. ఎందుకంటే ఇప్పటి రిలేషన్‌షిప్స్‌లా అది అకారణంగా పుటుక్కుమని తెగిపోయేది. దీన్ని చుట్టడానికి స్పెషలిస్ట్‌లుండేవాళ్లు. కృష్ణ కౌబాయ్ సినిమాల హ్యాంగోవర్ కాలమది. రివాల్వర్ తీసుకుంటే కృష్ణ ఎటు కాలుస్తాడో ఎవరికీ తెలియదు. కళ్లు మూసుకుని, ఒంటి కంటితో, ఇలా రకరకాలుగా కాల్చినా విలన్లు కుప్పకూలేవారు. ఆయన రివాల్వర్‌లో బుల్లెట్లు అయిపోవడమంటూ ఉండదు. కాల్చిన తరువాత స్టయిల్‌గా ఆయన పొగ ఊదుతుంటే చూసి తీరాల్సిన దృశ్యం. మేము కూడా రివాల్వర్ తీసుకుని రకరకాల పద్ధతుల్లో ఫైటింగ్‌లు చేస్తూ కాల్చుకునేవాళ్లం. పిచ్చికలా కిచ్‌కిచ్ అని అరుస్తూ అది పేలేది. ఎంత ప్రయత్నించినా ఊదడానికి సరిపడా పొగవచ్చేది కాదు. కాస్తో కూస్తో వచ్చినా గొట్టంలోంచి అస్సలొచ్చేది కాదు. తుపాకీగొట్టం నుంచి విప్లవమే కాదు, పొగ కూడా రాదని నేను ఆనాడే కనిపెట్టాను.
అంగడి శీనయ్యకి ప్రభావతి అనే కూతురుండేది. అది మమ్మల్ని పురుగుల్లా చూసేది. ఎందుకంటే చాక్లెట్లు బిస్కెట్లే కాదు. టపాసులు కూడా దీనికి కొనాల్సిన అవసరం లేదు. మేం పిచ్చోళ్లలా చూస్తూ ఉంటే ప్రతిరోజూ మా కళ్లముందు కాకరపూలు గిరగిర తిప్పి మా మీదకే విసిరేది. నమిలి పీక్కుతిన్నా ఇంట్లోవాళ్లు అంత సులభంగా డబ్బులివ్వరు కాబట్టి మిత్రులమంతా ఒక పెద్ద పథకమేశాం. శీనయ్య అంగడికి కన్నం పెట్టి టపాసులన్నీ దోపిడీ చేయాలి. అంతటితో ఆగకుండా ప్రభావతిని కిడ్నాప్ చేసి ఆమె కళ్లముందే టపాసులన్నీ కాల్చి బూడిద చేయాలి. అంతా బానే ఉంది కానీ కన్నం ఎలా వేయాలో ఎవడికీ తెలియదు. కొద్దిరోజులు చర్చలు జరిగాయి కానీ ఎవరింట్లోనూ గునపం లేక శీనయ్య బతికిపోయాడు.
మా అందరిలో బూసిగాడు అనేవాడు ప్రాక్టికల్. వాడికి భ్రమలు లేవు. ప్రతిరోజూ శీనయ్య అంగడికెళ్లి ‘అదెంత ఇదెంత’ అని కన్ఫ్యూజ్ చేసి నాలుగైదు టపాసులు కొట్టుకొచ్చేవాడు. (వీడిపుడు రెవిన్యూ ఉద్యోగి. జనాన్ని ఏం చేస్తున్నాడో నాకు తెలియదు) ఆశ నిరాశలు, చీకటి వెలుగులు మధ్య దీపావళి వచ్చేది, వెళ్లేది. ఎవడి స్థోమతకొద్దీ వాడు కాసిన్ని కాల్చేవాళ్లం. కసిదీరా కాలుద్దామనుకున్నప్పుడు పైసా డబ్బు లేదు. డబ్బులున్నపుడు కాల్చాలనే కసిలేదు. అమావాస్య నాడు కూడా వెలుతురు ఉంటుందని దీపావళి ఎప్పుటి నుంచో చెబుతూ ఉంది. ఇంతకు మించిన పాజిటివ్ థింకింగ్ ఉంటుందా?