చిన్న కుటుంబాలు ఎక్కువైన ప్రస్తుత కుటుంబ వ్యవస్థలో పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించడం కత్తి మీద సాముగా మారింది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబవ్యవస్థ.. నైతిక విలువలకు రక్షణ కవచంలా ఉండేది. ఈనాటి సాంకేతిక ప్రపంచంలో అనేక కారణాల వల్ల పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య ఒక అగాధం ఏర్పడుతోంది. పిల్లలు త్వరత్వరగా అభివృద్ధిలోకి రావాలనే ఆలోచనతో వారిని రోజులో మూడు వంతులు చదువు అనే రణరంగంలోకి వదిలేస్తున్నారు. పిల్లలూ శక్తికి మించి పోరాడుతూ ఒత్తిడితో అలసిపోతున్నారు.
ఆ ఒత్తిడినుండి ఉపశమనం కోసం మొబైల్ ఫోన్స్, సామాజిక మాధ్యమాలు, వర్చ్యువల్ గేమ్స్‌లాంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. ఏది మంచి, ఏది చెడు.. చెప్పే ప్రయత్నం చేసినా వినే ధోరణి కనిపించడం లేదు! అలాగని పిల్లల్ని సరిదిద్దే ప్రయత్నంలో వారిని బలవంతం చెయ్యకూడదు. ఈ తరం పిల్లల్లో తెలివితేటలు, సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. అందుకే వారి ఆలోచనల్ని, అభిప్రాయాలను ప్రోత్సహించాలి. దీనివల్ల తల్లిదండ్రులు చెప్పే మాటల పట్ల పిల్లల్లో సానుకూల దృక్పథం కలుగుతుంది. ఇలా కలిగాక పిల్లలకు నీతి కథలు, పురాణాలు, ఇతిహాసాలు, సంగీతం, నృత్యం ఇలా అనేక సాధనాల ద్వారా మానవ సంబంధాలు, విలువలు అర్థమయ్యేలా చెప్పాలి.
పిల్లలు తప్పు చేస్తే దానిగురించి దీర్ఘ ప్రసంగం చేసి వారి తప్పును ఎత్తి చూపడం కాకుండా.. ఆ తప్పు, లేదా పొరపాటు వల్ల కలిగే పరిణామాలు వివరించాలి. పిల్లలు చాలా సున్నిత మనస్కులు. చిన్నతనంలో నాటే నైతికత విలువల విత్తనమే వారి ఉజ్వల భవితకు పునాది. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు దూరంగా ఉన్నా.. మనవలను కలిసినప్పుడల్లా నాలుగు మంచిమాటలు, నాలుగు మంచి కథలు చెప్పాలి. అంతేకాదు, వయస్సుకి తగ్గ పనులు వారికి అప్పచెప్పి, ఎప్పుడూ చురుకుగా ఉండేలా కూడా చేయాలి.
– డా. పి.వి.రాధిక
సైకాలజీ కన్సల్టెంట్ (విజయవాడ)
►ఈ తరం పిల్లల్లో చురుకుదనం, తెలివితేటలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆ కారణంగా వాళ్లు కొన్ని తప్పులు చెయ్యొచ్చు. ఆ తప్పుల్ని సున్నితంగా సరిదిద్దాలే తప్ప.. దురుసుగా, దండన విధించినట్లుగా పెద్దలు ప్రవర్తించకూడదు.
Comments
Please login to add a commentAdd a comment