బుడి బుడి పొదుపు... | Children's savings accounts to this article | Sakshi
Sakshi News home page

బుడి బుడి పొదుపు...

Published Fri, Sep 19 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM

బుడి బుడి పొదుపు...

బుడి బుడి పొదుపు...

ఏడేళ్ల ఆదిత్య నాన్నతో కలసి ఏటీఎంకి వెడితే .. కార్డు ఇన్‌సర్ట్ చేయడం నుంచి నగదు, ట్రాన్సాక్షన్ స్లిప్ తీసుకునేదాకా అంతా తానే చేయాలంటాడు. ఆరేళ్ల భార్గవి .. వాళ్లమ్మతో షాపింగ్‌కి వెడితే డబ్బులు తన చేత్తోనే ఇస్తానని మారాం చేస్తుంది. డబ్బు విలువ గురించి పూర్తిగా తెలియకపోయినా.. ఆర్థిక లావాదేవీలపై వారికి క్రమక్రమంగా పెరిగే ఆసక్తే ఇందుకు కారణం. అది గుర్తించే పిగ్గీ బ్యాంకులు, డిబ్బీలంటూ వారికి పొదుపును అలవాటు చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. అటు బ్యాంకులు మరో అడుగు ముందుకేసి పిల్లల కోసం ప్రత్యేకంగా పొదుపు ఖాతాలు అందిస్తున్నాయి.  ఉచితంగా పాస్‌బుక్‌లు, డెబిట్ కార్డులు, చెక్ బుక్కులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాలతో పలు బ్యాంకులు కిడ్స్ అకౌంట్స్ ఇస్తున్నాయి. ఫెడరల్ బ్యాంక్, ఎస్‌బీఐ తదితర బ్యాంకులు ఈ మధ్యే ప్రత్యేక అకౌంట్స్‌ని అందుబాటులోకి తెచ్చాయి. ఈ నేపథ్యంలోనే పిల్లల పొదుపు ఖాతాలపై ఈ కథనం..
 
ఎస్‌బీఐ .. పెహ్లా కదమ్.. పెహ్లీ ఉడాన్..

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు రకాల అకౌంట్లు అందిస్తోంది. తల్లి, తండ్రి లేదా సంరక్షకులతో కలసి ఏ వయస్సు పిల్లల కోసమైన సంయుక్తంగా పెహ్లా కదమ్ ఖాతాను తెరవొచ్చు. ఇక, పదేళ్లు పైబడిన వారి కోసం పెహ్లీ ఉడాన్ సేవింగ్స్ ఖాతా ఉపయోగపడుతుంది. దీన్ని వారు సొంతంగా నిర్వహించుకోవచ్చు. ఈ ఖాతాలకు సంబంధించి చెక్ బుక్, పాస్‌బుక్, ఏటీఎం కార్డు ఇస్తారు. బిల్లుల చెల్లింపులు, ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం మొదలైన పరిమితమైన లావాదేవీల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ఇలాంటి వాటిలో రూ. 5,000 దాకా పరిమితి ఉంటుంది. అదే మొబైల్ బ్యాంకింగ్ విషయంలోనైతే పరిమితి రూ. 2,000గా ఉంటుంది. .
 
యంగ్ చాంప్..

పద్దెనిమిది సంవత్సరాల లోపు వారి కోసం ఫెడరల్ బ్యాంక్ యంగ్ ఛాంప్ పేరిట పొదుపు ఖాతాలను ప్రవేశపెట్టింది. పదేళ్లు అంతకు పైబడి వయస్సున్న పిల్లల కోసం దీన్ని ఉద్దేశించారు. ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్స్‌లో రూ. 2,500 దాకా వ్యయ పరిమితితో ప్రత్యేకంగా డెబిట్ కార్డును అందిస్తుంది. మొబైల్ అలర్ట్లు, పేరెంట్స్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా నిధుల బదలాయింపు, నెట్ బ్యాంకింగ్, పాయింట్ ఆఫ్ సేల్స్‌లో కొనుగోళ్లకు రివార్డు పాయింట్లు మొదలైన ఫీచర్లు ఈ అకౌంట్‌లో ఉన్నాయి.
 
కిడ్స్ అడ్వాంటేజ్..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్ ప్రవేశపెట్టింది. తల్లిదండ్రుల అనుమతి మేరకు 7-18 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలకు వారి పేరు మీదే ఏటీఎం లేదా ఇంటర్నేషనల్ డెబిట్ కార్డును బ్యాంకు ఇస్తుంది. ఏటీఎంల ద్వారా గరిష్టంగా రూ.2,500 విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే షాపింగ్ పరిమితి రూ. 2,500గా ఉంటుంది. ఈ ఖాతా రూ. 1,00,000 మేర విద్యా బీమా కవరేజీ ఉచితంగా అందిస్తుంది. అలాగే మూడు నెలలకోసారి స్టేట్‌మెంట్లు, లావాదేవీలకు సంబంధించిన ఉచిత ఈమెయిల్ అలర్ట్‌లు కూడా బ్యాంకు పంపిస్తుంది.
 
జంబో కిడ్స్ సేవింగ్స్..

కరూర్ వైశ్యా బ్యాంక్  పన్నెండేళ్ల దాకా వయస్సు గల పిల్లల కోసం జంబో కిడ్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తోంది. ఇందులో మినిమం బ్యాలెన్స్ బాదరబందీ లేదు. ఏటీఎం కార్డు, ఉచితంగా జంబో డాల్‌ను కూడా బ్యాంకు ఇస్తుంది. అటు స్టూడెంట్ సేవింగ్స్ అకౌంటు పేరిట గరిష్టంగా 23 ఏళ్ల దాకా వయస్సు గల విద్యార్థుల కోసం మరో పొదుపు ఖాతాను కూడా బ్యాంక్ అందిస్తోంది. ఇందులో కనీస బ్యాలెన్స్ రూ.250 ఉండాలి.
 
కోటక్ మై జూనియర్ అకౌంటు..

ఈ ఖాతాలపై కొటక్ మహీంద్రా బ్యాంక్ వార్షికంగా దాదాపు ఆరు శాతం దాకా వడ్డీ ఇస్తోంది. దీనికి అనుసంధానంగా రికరింగ్ డిపాజిట్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ వంటివి ప్రారంభించి.. క్రమం తప్పకుండా కడుతూ ఉంటే మినిమం బ్యాలెన్స్ నిబంధన నుంచి మినహాయింపు కూడా లభిస్తుంది. రెస్టారెంట్లు, షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ మొదలైన వాటికి సంబంధించి ప్రత్యేక ఆఫర్లు కూడా బ్యాంకు అందిస్తోంది. ఖాతాను ప్రారంభించిన తొలి ఏడాది ప్రారంభ ఆఫర్ కింద ఆర్‌డీ, సిప్ మొత్తాన్ని బట్టి నాలుగు నుంచి ఎనిమిది దాకా పీవీఆర్ థియేటర్ సినిమా టికెట్లు లేదా ల్యాండ్‌మార్క్ బుక్ వోచర్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ అందిస్తోంది.
 
యాక్సిస్ ఫ్యూచర్ స్టార్స్ ఖాతా..

పద్దెనిమిదేళ్ల లోపు వారి కోసం యాక్సిస్ బ్యాంక్ ఈ ఖాతాను అందిస్తోంది. పిల్లల పేరిట మూడు నెలలకొకటి చొప్పున ఉచితంగా ఎట్ పార్ చెక్‌బుక్‌లను ఇస్తుంది. కనీసం రూ. 25,000 మేర ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినా (ఆర్నెల్ల పాటు), రూ. 2,000 చొప్పున ఏడాదిపాటు రికరింగ్ డిపాజిట్ చేసినా కనీస నెలవారీ బ్యాలెన్స్ నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుంది. పదేళ్ల పైబడిన పిల్లలకోసం వారు కోరిన చిత్రాన్ని డెబిట్ కార్డుపై ముద్రించి బ్యాంకు అందిస్తుంది. ఆర్నెల్లకోసారైనా డెబిట్ కార్డును స్వైప్ చేసిన పక్షంలో కొన్ని షరతులకు లోబడి రూ. 2 లక్షల దాకా వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. డెబిట్ కార్డు మోసాలు జరిగిన పక్షంలో రూ.50,000 దాకా పర్చేజ్ ప్రొటెక్షన్, లాస్ట్ కార్డ్ లయబిలిటీ కవరేజీ ఉంటుంది.
 
ఐసీఐసీఐ యంగ్ స్టార్స్

ఒక్క రోజు నుంచి పద్దెనిమిదేళ్ల దాకా వయస్సు గల పిల్లల కోసం ఐసీఐసీఐ బ్యాం క్ ఈ ఖాతాను ప్రవేశపెట్టింది. పేరెంట్స్ కోరితే ఏడేళ్లు పైబడిన పిల్లలకు డెబిట్ కార్డును ఇస్తుంది బ్యాంకు. రోజువారీ షాపింగ్ లేదా విత్‌డ్రాయల్ కోసం రూ. 1,000 నుంచి రూ. 5,000 దాకా వీటిపై పరిమితులను ఎంచుకోవచ్చు.
 
ప్రయోజనాలు..

ఈ తరహా అకౌంట్లు పిల్లలకు చిన్నప్పట్నుంచి ఆర్థిక క్రమశిక్షణ అలవర్చేందుకు ఉపయోగపడతాయి. నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్‌బుక్కులు, డెబిట్ కార్డులు వాడటం మొదలైన బ్యాంకింగ్ లావాదేవీల గురించి అవగాహన ఏర్పడుతుంది. అయితే, కిడ్స్ అకౌంట్స్ అంటూ బ్యాంకులు ప్రత్యేకత చూపించినా.. బ్యాలెన్సులు, ఫీజులు మొదలైన వాటి విషయంలో మిగతా సాధారణ ఖాతాల తరహాలో వీటి  ట్రీట్‌మెంటు ఉంటుంది. ఇక, పిల్లలు ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవాలంటే.. తల్లిదండ్రులు కూడా వారితో కాస్త సమయం గడపాలి. డిపాజిట్, విత్‌డ్రాయల్స్ చేయడం, స్లిప్స్ నింపడం మొదలైనవి వారికి నేర్పాలి. అకౌంటు మనదే కదా అని వృథా ఖర్చులు చేస్తున్నారా లేదా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారా అన్నది పరిశీలిస్తూ ఉండాలి. అలాగే ఈ అకౌంట్లు మూడు నాళ్ల ముచ్చట కాకుండా కొనసాగించగలగాలి. ఇవన్నీ జరగాలంటే పేరెంట్స్‌కి కూడా క్రమశిక్షణ ఉండాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement