
విశ్వాసులకు జనకుడైన అబ్రాహాము ఆతిథ్యానికి, ఔదార్యానికి మారు పేరు. సోదరుడు చనిపోతే అతని కొడుకైన లోతూను తనతోపాటే ఉంచుకొని పెంచి పెద్దవాణ్ణి చేసిన అద్భుతమైన ప్రేమ ఆయనది. ఒకరోజున ముగ్గురు పరదేశులు ఇంటికొచ్చారు. తన ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్లవద్దని వారిని బతిమాలి మరీ అప్పటికప్పుడు అత్యంత రుచికరమైన భోజనాన్ని తన భార్యౖయెన శీరాతో వండించి వారికి పెట్టాడు. పరదేశులు కదా మంచి వాళ్లో చెడ్డవాళ్లో నాకెందుకులే అని ఆయన ఆలోచించవచ్చు. అప్పటికే శీరా వృద్ధురాలు. ఆమెనెందుకు కష్టపెట్టడం అని కూడా అనుకోవచ్చు. ముక్కూమొహం తెలియని వాడికి భోజనం పెడితే ఏమొస్తుంది? అని కూడా భావించవచ్చు.
ఇది అవిశ్వాసుల ఆలోచనాతీరు. అలా ఆలోచించలేకపోవడమే అబ్రాహాము ప్రత్యేకతగా భావించి అలాంటి మరికొన్ని సుగుణాల కారణంగా దేవుడాయన్ని విశ్వాసులకు జనకుణ్ణి చేశాడు. ఆ రోజు వచ్చిన వారు పరదేశులు కాదు, పరదేశుల్లాగా కనిపించిన దేవదూతలని అబ్రాహాముకి ఆ తర్వాత అర్థమయింది. వారు తృప్తిగా భోజనం చేసి సంతోషంగా వెళ్లిపోతూ, త్వరలోనే అబ్రాహాము, శీరాలు కడు వృద్ధాప్యంలో కూడా ఒక కుమారుని పొందబోతున్నారని, ఆ మేరకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరబోతున్నదని నిశ్చయతనిచ్చి వెళ్లిపోయారు. ఈ విషయాన్నే హెబ్రీ పత్రికలో ప్రస్తావిస్తూ కొందరు పరదేశులకు ఆతిథ్యమిచ్చి తమకు తెలియకుండానే దేవదూతలకు సేవచేశారని శ్లాఘించారు (ఆది 18: 1–15; హెబ్రీ 13:2) ఆతిథ్యం విశ్వాసుల ఇంటికి సంబంధించిన విషయం కాదు, అది వారి హృదయానికి చెందిన విషయం!!
– ఆశ్రయ
Comments
Please login to add a commentAdd a comment