అమ్మకానికి పౌరసత్వం..
డబ్బులకు కటకటలాడుతున్న కొన్ని కంట్రీలు నిధుల సమీకరణ కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం అత్యంత చౌకగా తమ దేశ పౌరసత్వాన్ని ఇచ్చేస్తామంటున్నాయి. తమ పాస్‌పోర్టు తీసుకుంటే బోలెడన్ని ప్రయోజనాలు ఉంటాయంటూ ఊదరగొడుతున్నాయి.
మన దగ్గర ఒక మోస్తరు సిటీలో కాస్త మెరుగైన ఇల్లు కొనుక్కోవాలంటే.. అరవై, డెబ్భై లక్షల పైచిలుకు అవుతోంది. దాదాపు అంతే మొత్తానికి కొన్ని కరీబియన్, యూరోపియన్ దేశాలు ఏకంగా పౌరసత్వాన్నే ఇచ్చేస్తున్నాయి. తాజాగా యూరోపియన్ దేశం మాల్టా .. ఇలాగే సుమారు రూ. 5.5 కోట్లు కట్టిన వారికి తమ దేశ పౌరసత్వం ఇచ్చేస్తామంటూ ప్రకటించడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
ఇంత డబ్బు కట్టి మాల్టా పాస్‌పోర్టు తీసుకున్న వారికి .. యూరోపియన్ యూనియన్‌లో 27 దేశాల్లో ఎక్కడైనా నివసించేందుకు అధికారాలు లభిస్తాయట. ఆఖరికి యూరోపియన్ పార్లమెంటు సభ్యులు అయ్యేందుకు కూడా హక్కులు లభిస్తాయట. ఇంత కన్నా చౌక ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
1. సుమారు 73,000 మంది జనాభా ఉండే డొమినికా కేవలం రూ. 60 లక్షలకు పౌరసత్వం ఇస్తోంది. దీనికోసం ఆ దేశానికి ప్రత్యేకంగా వెళ్లనక్కర్లేదు.. అక్కడే ఉండాలన్న నిబంధన కూడా ఉండదు. ఈ దేశం పాస్‌పోర్టు పొందిన వారు 50 దేశాలకు వీసా సమస్య లేకుండా వెళ్లొచ్చు.
2. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్‌ది కూడా ఇదే ధోరణి. తమ దేశ చక్కెర మిల్లుల్లో రిటైరయిన ఉద్యోగుల నిధి కోసం దాదాపు రూ. 1.5 కోట్లు విరాళమిస్తే అక్కడి పౌరసత్వం ఇస్తామంటోంది. ఈ దేశ పాస్‌పోర్టుతో 139 దేశాలకు వీసాల్లేకుండా వెళ్లొచ్చు.
3. హంగరీలో రూ. 2 కోట్లతో ప్రత్యేక బాండు కొనుక్కుంటే నివసించేందుకు పర్మిట్ దొరుకుతుంది.
4. పోర్చుగల్‌లో రూ. 4 కోట్లు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తే రెసిడెన్సీ పర్మిట్ లభిస్తుంది.
5. ఇటీవల కొన్నాళ్ల కిందటి దాకా గ్రామీణ ప్రాంతాల్లో సుమారు రూ. 58 లక్షలతో ప్రాపర్టీ కొన్నా, సిటీల్లో రూ. 1.1 కోట్లు పెట్టి రియల్టీ కొన్నా లాత్వియా తమ దేశంలో అయిదేళ్లు నివసించేందుకు పర్మిట్ ఇచ్చేది. ప్రస్తుతం ఈ మొత్తాన్ని రూ. 2 కోట్ల పైచిలుకు పెంచేసింది.
ఇలాగే, అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రియా తదితర దేశాలు కూడా తమ దేశంలో ఇన్వెస్ట్ చేస్తే పౌరసత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. కానీ, మిగతా చిన్నా, చితకా దేశాలతో పోలిస్తే వీటిలో నిబంధనలు, ఇన్వెస్ట్ చేయాల్సిన డబ్బు చాలా భారీ స్థాయిలో ఉంటుంది.