కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి | Companies can sponsor | Sakshi
Sakshi News home page

కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి

Published Sun, Sep 21 2014 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి

కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి

మై క్యాంపస్ లైఫ్- ఐఐటీ - ఢిల్లీ
 
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

(ఐఐటీ) - ఢిల్లీ.. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటి. ఇంజనీరింగ్ కోర్సుల్లో అత్యుత్తమ బోధన, పరిశోధనలకు పెట్టింది పేరు. ఇటీవల క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ జాబితాలో ప్రపంచంలోనే 235వ స్థానంలో నిలిచింది. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న చలమలశెట్టి యువ నాగ సాయి అవినాశ్ కార్తీక్ తన క్యాంపస్ లైఫ్ విశేషాలను, ప్రత్యేకతలను వివరిస్తున్నారిలా..
 
మాది హైదరాబాద్. విద్యానగర్‌లో ఉంటాం. నాన్న నాగోల్‌లో టీవీఎస్ షోరూమ్‌ను నిర్వహిస్తున్నారు. అమ్మ గృహిణి. అక్క యూఎస్‌లోని రైట్ స్టేట్ యూనివర్సిటీ - ఒహియోలో ఎంఎస్ చేస్తోంది. నేను ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు హైదరాబాద్‌లోనే విద్యనభ్యసించాను. పదో తరగతిలో 557 మార్కులు, ఇంటర్మీడియెట్‌లో 979 మార్కులు సాధించాను. జేఈఈ మెయిన్స్‌లో జాతీయస్థాయిలో 389, అడ్వాన్స్‌డ్‌లో 69, బీఆర్క్‌లో 14వ ర్యాంకులు వచ్చాయి.
 
 కమిటీ పరిశీలిస్తుంటుంది

ప్రవేశం లభించిన వారందరికీ హాస్టల్ వసతి ఉంటుంది. ఒక్కో రూమ్‌కు ముగ్గురు చొప్పున ఉంటారు. రూమ్‌లో స్టడీ టేబుల్, బెడ్, ఇంటర్నెట్ కనెక్షన్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. ప్రతి హాస్టల్‌కు కామన్‌రూమ్‌లో భాగంగా పత్రికలు, మ్యాగజైన్లు, టీవీ ఉంటాయి. క్యాంపస్‌లో ర్యాగింగ్ లేదు. ఒక కమిటీ క్యాంపస్ అంతా తిరుగుతూ పరిశీలిస్తుంటుంది. ర్యాగింగ్ జరిగినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
 
క్యాంపస్‌లో 250 మంది తెలుగు విద్యార్థులే

క్యాంపస్‌లో తెలుగు విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఆ యా బ్రాంచ్‌లు.. సబ్జెక్టులకనుగుణంగా షెడ్యూల్ ను బట్టి క్లాసులు ఉంటాయి. మధ్యాహ్నం 12 గంట ల నుంచి 2 గంటల వరకు లంచ్ ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి 9 వరకు డిన్నర్. భోజనంలో రెండు కూరలు, రైస్, చపాతీ వడ్డిస్తారు. ఉదయం 7.30 నుంచి 9.30 వరకు అల్పాహారం ఇస్తారు. వారంలో రెండు రోజులు సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఉంటాయి.హాస్టల్‌కు వార్డెన్‌గా ప్రొఫెసర్ ఉంటారు. అప్పుడప్పుడు హాస్టల్, క్యాంటీన్‌ను సందర్శించి సమస్యలు తెలుసుకుంటారు. ఫుడ్ నాణ్యతను పరిశీలిస్తారు. వార్డెన్‌ను అడిగి సబ్జెక్టు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వార్డెన్ కాకుండా ఒక కేర్‌టేకర్ కూడా ఉంటారు.
 
సీనియర్ల సహకారం ఎంతో

తరగతిలో బోధన బాగుంటుంది. ఫ్యాకల్టీ బాగా చెబుతారు. స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అవుతారు. ఇతర విద్యా సంస్థల ప్రొఫెసర్లు కూడా వచ్చి గెస్ట్ లెక్చర్స్ ఇస్తుంటారు. ఎంత గ్రేడింగ్ ఇవ్వాలి? ఎన్ని మార్కులు కేటాయించాలి? ఎలా బోధించాలి? వంటి అంశాలన్నీ ప్రొఫెసర్ల చేతిలోనే ఉంటాయి. బోధనలో భాగంగా అవసరమైతే ఐసీటీ (ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ), పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, వీడియో వంటివాటిని కూడా ప్రొఫెసర్లు వినియోగిస్తారు. ఫ్యాకల్టీపైన, చదివే కోర్సుపైన విద్యార్థులు ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు. యూజర్ ఐడీతో వెబ్‌సైట్‌లో లాగినై కోర్సు ఎలా ఉంది? ప్రొఫెసర్లు పాఠాలు ఎలా బోధిస్తున్నారు వంటి అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయాలు తెలియజేయొచ్చు. సీనియర్ స్టూడెంట్స్ అకడమిక్‌గా ఎదురయ్యే సందేహాలు, ఫ్యూచర్ కెరీర్ ప్లాన్స్, జాబ్ ఇంటర్వ్యూలను ఎదుర్కోవడం వంటి వాటిపై సహాయసహకారాలు అందిస్తారు.
 
ప్రతి సెమిస్టర్‌లో 7 కంటే ఎక్కువ సీజీపీఏ రావాలి

నాలుగేళ్ల ఇంజనీరింగ్‌లో ఏడాదికి రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఒక్కో సెమిస్టర్‌కు అన్నీ కలుపుకుని దాదాపు రూ.75,000 వరకు ఖర్చు అవుతుంది. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4.5 లక్షలు లోపు ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తారు. ఇందులో భాగంగా ట్యూషన్ ఫీజులో ఎక్కువ భాగం మినహాయింపు ఉంటుంది. స్కాలర్‌షిప్ పొందాలంటే ప్రతి సెమిస్టర్‌లో 7 కంటే ఎక్కువ సీజీపీఏ పొందాల్సి ఉంటుంది. 7 కంటే తక్కువ సీజీపీఏ ఉంటే స్కాలర్‌షిప్ అందించరు.
 
ఎయిమ్స్‌లో ఉచిత వైద్యం

క్యాంపస్‌లో ఆడుకోవడానికి క్రీడా మైదానాలెన్నో ఉన్నాయి. ఇంకా అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఆడిటోరియం, లైబ్రరీ, ల్యాబ్‌లు; బ్యాంకు లు, ఏటీఎంలు కొలువుదీరాయి. విద్యార్థులు అస్వస్థతకు గురైతే 24 గంటలు సేవలందించే ఆస్పత్రి క్యాంపస్‌లో ఉంది. చిన్నపాటి వ్యాధులకు ఢిల్లీలోని ప్రఖ్యాత వైద్య సంస్థ ఎయిమ్స్‌లో ఉచిత వైద్యం అందిస్తారు.
 
క్యాంపస్.. కలర్‌ఫుల్

క్యాంపస్‌లో ప్రతి ఏటా వివిధ ఫెస్ట్‌లు జరుగుతుంటాయి. ప్రతి ఏడాది మార్చిలో టెక్నికల్ ఫెస్ట్ ఉంటుంది. ఇందులో భాగంగా నాలుగు రోజులపాటు టెక్నాలజీ సంబంధిత అంశాలపై పోటీలు, గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి. దేశవిదేశాల్లోని ప్రముఖ విద్యా సంస్థలు, పరిశోధన సంస్థల నుంచి ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఈ ఫెస్ట్‌కు హాజరవుతారు. ఏటా అక్టోబర్‌లో కల్చరల్ ఫెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇవేకాకుండా ఐఐటీల వరకు ప్రత్యేకంగా ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. క్యాంపస్‌లో దీపావళి, హోళి వంటి పండుగలను బాగా చేస్తాం. శని, ఆదివారాలు క్లాసులుండవు. అప్పుడప్పుడు ఢిల్లీ, ఆగ్రా పరిసర ప్రాంతాలను సందర్శించి మానసిక ఉల్లాసం పొందుతాం.
 
కంపెనీలు ఫండింగ్ చేస్తాయి

క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ సెల్ కూడా ఉంది. కొత్త స్టార్టప్స్ ఏర్పాటు చేయాలనుకునేవారికి వివిధ కంపెనీలతో ముఖాముఖి ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా వివిధ కంపెనీల హెడ్‌లు క్యాంపస్‌కు వస్తారు. విద్యార్థుల ఆలోచనలు నచ్చితే కంపెనీలు ఫండింగ్ సదుపాయం కల్పిస్తాయి. సెల్ ఆధ్వర్యంలో గెడైన్స్, ఇతర సూచనలు, సలహాలు అందిస్తారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఫేస్‌బుక్ వంటి కంపెనీలు ప్రతిభా వంతులకు ఇంటర్న్‌షిప్స్ ఆఫర్ చేస్తున్నాయి.
 
సివిల్స్ రాస్తా


బీటెక్ పూర్తయ్యాక ఒకటి లేదా రెండేళ్లు ఉద్యోగం చేస్తాను. ఆ తర్వాత సివిల్స్ రాయాలనుకుంటున్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement