
ఇళ్లు, భవనాలు.. ఆఖరుకు వంతెనలైనా సరే.. కాంక్రీట్ వాడినప్పుడు కొంతకాలం తరువాత పగుళ్లు ఏర్పడటం సహజం. వాటిని గమనించి సకాలంలో పూడిస్తే మంచిదే... లేదంటే నిర్మాణం మొత్తం కూలిపోయే ప్రమాదముంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు న్యూయార్క్‌లోని బింగ్‌హామ్‌టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న మార్గాన్ని కనుక్కున్నారు. కాంక్రీట్‌కు ప్రత్యేక రకానికి చెందిన ఫంగస్ (శిలీంధ్రం)ను చేరిస్తే.. పగుళ్లు వాటంతట అవే పూడిపోతాయని వీరు అంటున్నారు. కాంక్రీట్‌లో పగుళ్లు ఏర్పడినప్పుడు గాలి, నీరు అక్కడకు చేరుకుంటాయన్నది మనకు అనుభవమైన విషయం. కాంక్రీట్‌లో ఫంగస్ తాలూకూ గుడ్లు (స్ఫోర్స్), పోషకాలూ ఉన్నాయనుకోండి... గాలిలోని ఆక్సిజన్, నీరును ఉపయోగించుకుని ఎదుగుతాయి.
పెరిగే క్రమంలో ఇవి కాల్షియం కార్బొనేట్ (నత్తగుల్లల పెంకు ఈ పదార్థంతోనే తయారవుతుంది)ను విడుదల చేస్తాయి. ఫలితంగా అక్కడి చీలిక కాస్తా పూడిపోతుంది. ఆక్సిజన్, నీరు అందదు కాబట్టి ఫంగస్ మళ్లీ నిద్రాణ స్థితికి చేరుకుంటుంది. అయితే తమ పరిశోధన ప్రస్తుతానికి ప్రారంభ దశలో మాత్రమే ఉందని, మరింత విస్తృత పరిశోధన తరువాత గానీ ఈ ఫంగస్ కాంక్రీట్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకు రావడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment