concrete cement
-
దానికదే పగుళ్లు పూడ్చుకునే కాంక్రీటు..!
భవన నిర్మాణంలో వాడే కాంక్రీటు దృఢంగా ఉంటుంది. అయితే వాతావరణంలోని తేమ లేదా ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గుల వల్ల కాంక్రీటు నిర్మాణాల్లోనూ పగుళ్లు ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడు దాని నిర్వహణకోసం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పగుళ్లతో కొన్నిసార్లు కాంక్రీటు మూలకాలు క్షీణించే ప్రమాదం ఉంది. ఈ సమస్యలను నివారించటానికి డ్రెక్సెల్ యూనివర్సిటీ పరిశోధకులు వినూత్నమైన కాంక్రీటును రూపొందించారు. ఇది తనకు తానే మరమ్మతు చేసుకుంటుంది. ఇందులోని బయోఫైబర్లు బ్యాక్టీరియా సాయంతో పగుళ్లను పూరిస్తాయి. కాంక్రీటు నిరంతరం వాతావరణ ప్రభావానికి గురవుతున్నప్పుడు పగుళ్లు ఏర్పడుతుంటాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత మరీ పెరిగితే పగుళ్లు మరింత పెద్దగా అవుతాయి. పైగా తేమ సైతం వివిధ ప్రక్రియలతో కాంక్రీటు క్షీణించేలా చేస్తుంది. కాబట్టి కాంక్రీటు నిర్మాణాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సి ఉంటుంది. తరచూ మరమ్మతులు అవసరమవుతాయి. దీనికి ఖర్చు అవుతుంది. అసౌకర్యమూ కలిగిస్తుంది. అందుకే కాంక్రీటు క్షీణించే వేగాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అందుకు అనుగునంగా డ్రెక్సెల్ యూనివర్సిటీ పరిశోధకులు బయోఫైబర్లు రూపొందించారు. ఈ పాలిమర్ ఫైబర్లు కేవలం కాంక్రీటుకు దన్నుగా నిలవటమే కాకుండా పగుళ్లు వాటికవే పూడిపోయేలా చేసి మన్నికగా ఉండే కాలాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ ఫైబర్లకు సన్నటి రంధ్రాలు కలిగిన హైడ్రోజెల్ పూత పూస్తారు. ఇందులో బ్యాక్టీరియా ఉంటుంది. ఇదీ చదవండి: చాట్ జీపీటీ-4కు ప్రత్యామ్నాయాలు ఇవిగో..! ఇది నిద్రాణంగా ఉంటూ తీవ్ర వాతావరణ పరిస్థితులనూ తట్టుకొని జీవిస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా పగుళ్లు ఏర్పడితే వాటిలోంచి నీరు వెళ్లి బయోఫైబర్లును తాకుతుంది. అప్పుడు హైడ్రోజెల్ విస్తరిస్తుంది. ఈ క్రమంలో బ్యాక్టీరియా నిద్రలేస్తుంది. కాంక్రీటు చుట్టూ ఉండే కార్బన్, క్యాల్షియంను తినటం ఆరంభిస్తుంది. అప్పుడు వీటి నుంచి క్యాల్షియం కార్బొనేట్ ఉత్పత్తి అవుతుంది. ఇది పగుళ్లను పూడుస్తుంది. నిర్మాణ పదార్థాలను మెరుగు పరచటానికి జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో బయోఫైబర్లతో కూడిన కాంక్రీటు ఆసక్తి కలిగిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. -
కలప వ్యర్థాలతో కాంక్రీట్ మరింత దృఢం!
మీరెప్పుడైనా కట్టెల మిల్లుకు వెళ్లారా? అక్కడ నేలంతా చిందరవందరగా పడి ఉండే రంపపు పొట్టును చూసే ఉంటారు. దీంట్లో కొంత ఏదో ఒకరకంగా ఉపయోగపడుతుందేమోగానీ.. చాలావరకూ వృథా అవుతూంటుంది. ఈ వ్యర్థానికీ ఓ పరమార్థం ఉందని నిరూపించారు సింగపూర్‌కు చెందిన నేషనల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఈ వ్యర్థాన్ని కలపడం ద్వారా కాంక్రీట్‌ను మరింత దృఢంగా చేయడంతో పాటు నీరు లోపలికి చొరబడకుండా బాగా అడ్డుకుంటుందని వీరు నిరూపించారు. సింగపూర్‌లోని ఫర్నిచర్ ఫ్యాక్టరీల ద్వారా ఏటా దాదాపు 5 లక్షల టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతూంటాయని దీన్ని సమర్థంగా ఉపయోగించుకునేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న కువా హార్న్ వీ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. కలప వ్యర్థాన్ని అతి తక్కువ ఆక్సిజన్ సమక్షంలో మండిస్తే బొగ్గులాంటి పదార్థం మిగిలిపోతుందని.. కాంక్రీట్లోకి దీన్ని కొద్దిమోతాదులో కలిపితే కాంక్రీట్ దృఢంగా మారుతుందని చెప్పారు. ఒక టన్ను కాంక్రీట్లోకి ఇలాంటి బొగ్గు పొడిని దాదాపు 50 కిలోలు కలపవచ్చునని వీ చెప్పారు. ఈ లెక్కన నిర్మించే ప్రతి కొత్త ఇంటి ద్వారా దాదాపు ఆరు టన్నుల కలప వ్యర్థాన్ని సద్వినియోగం చేసుకోవచ్చునని వీ వివరించారు. -
కాంక్రీట్ పగుళ్లు పూడిపోతాయి!
ఇళ్లు, భవనాలు.. ఆఖరుకు వంతెనలైనా సరే.. కాంక్రీట్ వాడినప్పుడు కొంతకాలం తరువాత పగుళ్లు ఏర్పడటం సహజం. వాటిని గమనించి సకాలంలో పూడిస్తే మంచిదే... లేదంటే నిర్మాణం మొత్తం కూలిపోయే ప్రమాదముంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు న్యూయార్క్‌లోని బింగ్హామ్టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న మార్గాన్ని కనుక్కున్నారు. కాంక్రీట్‌కు ప్రత్యేక రకానికి చెందిన ఫంగస్ (శిలీంధ్రం)ను చేరిస్తే.. పగుళ్లు వాటంతట అవే పూడిపోతాయని వీరు అంటున్నారు. కాంక్రీట్‌లో పగుళ్లు ఏర్పడినప్పుడు గాలి, నీరు అక్కడకు చేరుకుంటాయన్నది మనకు అనుభవమైన విషయం. కాంక్రీట్‌లో ఫంగస్ తాలూకూ గుడ్లు (స్ఫోర్స్), పోషకాలూ ఉన్నాయనుకోండి... గాలిలోని ఆక్సిజన్, నీరును ఉపయోగించుకుని ఎదుగుతాయి. పెరిగే క్రమంలో ఇవి కాల్షియం కార్బొనేట్ (నత్తగుల్లల పెంకు ఈ పదార్థంతోనే తయారవుతుంది)ను విడుదల చేస్తాయి. ఫలితంగా అక్కడి చీలిక కాస్తా పూడిపోతుంది. ఆక్సిజన్, నీరు అందదు కాబట్టి ఫంగస్ మళ్లీ నిద్రాణ స్థితికి చేరుకుంటుంది. అయితే తమ పరిశోధన ప్రస్తుతానికి ప్రారంభ దశలో మాత్రమే ఉందని, మరింత విస్తృత పరిశోధన తరువాత గానీ ఈ ఫంగస్ కాంక్రీట్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకు రావడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. -
మంజూరు చేరోడ్ల నిధులు గుంతల పాలు!
సాక్షి, ముంబై: నగరంలో రోడ్ల మరమ్మతుల కోసం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా నిరుపయోగంగానే మారుతున్నాయి. బీఎంసీ పరిధిలో రోడ్లన్నింటినీ కాంక్రీట్ సిమెంట్(సీసీ) రోడ్లుగా మార్చాలని పరిపాలనా విభాగం లక్ష్యంగా పెట్టుకుంది. కాని ఆ సంస్థలో పనిచేసే సిబ్బంది మాత్రం కమీషన్లకు కక్కుర్తిపడి తారురోడ్ల ఏర్పాటుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి..నగర రహదారులను 1990 నుంచి సీసీ రోడ్లుగా మార్చడం ప్రారంభించారు. ప్రతీ యేటా 250 కి.మీ. సీసీ రోడ్లుగా మార్చాలని బీఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ప్రకారం పనులు వేగంగా చేపట్టినట్లయితే నగరవాసులకు ప్రస్తుతం గుంతల సమస్య ఉండేదికాదేమో.. కాని బీఎంసీ అధికారులు సీసీ రోడ్ల పనులను పట్టించుకోకుండా తారు రోడ్ల నిర్మాణంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా ఏటా వర్షాకాలంలో ముంబైకర్లకు గుంతల బెడద తప్పడం లేదు. బీఎంసీ పెట్టుకున్న లక్ష్యం ప్రకారం ఏటా 250 కి.మీ. రోడ్లు సీసీగా తయారుకావాలి. కాని 1990 నుంచి ఇప్పటివరకు కేవలం 760 కి.మీ. మేర రోడ్లు సీసీగా మార్చారు. అంటే ఏడాదికి సుమారు 30 కి.మీ. రోడ్లు మాత్రమే సీసీ రోడ్లుగా మారుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ యేడు 433 కి.మీ. మేర రోడ్లను తారురోడ్లుగా మార్చాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. అందుకు రూ.561 కోట్లు మంజూరు చేసింది. కాని ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు కాంట్రాక్టర్లు చేపట్టిన నాసి రకం పనులను బట్టబయలు చేస్తున్నాయి. సాధారణంగా తారు రోడ్ల జీవితకాలం ఏడేళ్లు ఉంటుంది. కాని ఇప్పుడు నిర్మిస్తున్న తారురోడ్లు ఒక ఏడాది కూడా మన్నికగా ఉండడం లేదు. గుంతలు పూడ్చేందుకు కోల్డ్ మిక్స్ అనే ఆధునిక పద్ధతిని ఉపయోగిస్తున్నప్పటికీ ఫలితం ఉండటంలేదు. సీసీ రోడ్లు వేస్తే కొన్నేళ్ల వరకు వాటి వైపు చూడాల్సిన పనిలేదు. అదే తారు రోడ్లు వేస్తే ఏటా వర్షా కాలానికి ముందు, తర్వాత కూడా టెండర్లు ఆహ్వానించవచ్చు. తమకు ఎక్కువ శాతం కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్‌కు ఈ పనుల బాధ్యతలు కట్టబెట్టవచ్చనే ఉద్దేశంతోనే బీఎంసీ అధికారులు తారురోడ్ల నిర్మాణంపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.