భవన నిర్మాణంలో వాడే కాంక్రీటు దృఢంగా ఉంటుంది. అయితే వాతావరణంలోని తేమ లేదా ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గుల వల్ల కాంక్రీటు నిర్మాణాల్లోనూ పగుళ్లు ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడు దాని నిర్వహణకోసం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పగుళ్లతో కొన్నిసార్లు కాంక్రీటు మూలకాలు క్షీణించే ప్రమాదం ఉంది.
ఈ సమస్యలను నివారించటానికి డ్రెక్సెల్ యూనివర్సిటీ పరిశోధకులు వినూత్నమైన కాంక్రీటును రూపొందించారు. ఇది తనకు తానే మరమ్మతు చేసుకుంటుంది. ఇందులోని బయోఫైబర్లు బ్యాక్టీరియా సాయంతో పగుళ్లను పూరిస్తాయి. కాంక్రీటు నిరంతరం వాతావరణ ప్రభావానికి గురవుతున్నప్పుడు పగుళ్లు ఏర్పడుతుంటాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత మరీ పెరిగితే పగుళ్లు మరింత పెద్దగా అవుతాయి. పైగా తేమ సైతం వివిధ ప్రక్రియలతో కాంక్రీటు క్షీణించేలా చేస్తుంది. కాబట్టి కాంక్రీటు నిర్మాణాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సి ఉంటుంది. తరచూ మరమ్మతులు అవసరమవుతాయి. దీనికి ఖర్చు అవుతుంది. అసౌకర్యమూ కలిగిస్తుంది.
అందుకే కాంక్రీటు క్షీణించే వేగాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అందుకు అనుగునంగా డ్రెక్సెల్ యూనివర్సిటీ పరిశోధకులు బయోఫైబర్లు రూపొందించారు. ఈ పాలిమర్ ఫైబర్లు కేవలం కాంక్రీటుకు దన్నుగా నిలవటమే కాకుండా పగుళ్లు వాటికవే పూడిపోయేలా చేసి మన్నికగా ఉండే కాలాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ ఫైబర్లకు సన్నటి రంధ్రాలు కలిగిన హైడ్రోజెల్ పూత పూస్తారు. ఇందులో బ్యాక్టీరియా ఉంటుంది.
ఇదీ చదవండి: చాట్ జీపీటీ-4కు ప్రత్యామ్నాయాలు ఇవిగో..!
ఇది నిద్రాణంగా ఉంటూ తీవ్ర వాతావరణ పరిస్థితులనూ తట్టుకొని జీవిస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా పగుళ్లు ఏర్పడితే వాటిలోంచి నీరు వెళ్లి బయోఫైబర్లును తాకుతుంది. అప్పుడు హైడ్రోజెల్ విస్తరిస్తుంది. ఈ క్రమంలో బ్యాక్టీరియా నిద్రలేస్తుంది. కాంక్రీటు చుట్టూ ఉండే కార్బన్, క్యాల్షియంను తినటం ఆరంభిస్తుంది. అప్పుడు వీటి నుంచి క్యాల్షియం కార్బొనేట్ ఉత్పత్తి అవుతుంది. ఇది పగుళ్లను పూడుస్తుంది. నిర్మాణ పదార్థాలను మెరుగు పరచటానికి జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో బయోఫైబర్లతో కూడిన కాంక్రీటు ఆసక్తి కలిగిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment