సాక్షి, ముంబై: నగరంలో రోడ్ల మరమ్మతుల కోసం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా నిరుపయోగంగానే మారుతున్నాయి. బీఎంసీ పరిధిలో రోడ్లన్నింటినీ కాంక్రీట్ సిమెంట్(సీసీ) రోడ్లుగా మార్చాలని పరిపాలనా విభాగం లక్ష్యంగా పెట్టుకుంది. కాని ఆ సంస్థలో పనిచేసే సిబ్బంది మాత్రం కమీషన్లకు కక్కుర్తిపడి తారురోడ్ల ఏర్పాటుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి..నగర రహదారులను 1990 నుంచి సీసీ రోడ్లుగా మార్చడం ప్రారంభించారు. ప్రతీ యేటా 250 కి.మీ. సీసీ రోడ్లుగా మార్చాలని బీఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఆ ప్రకారం పనులు వేగంగా చేపట్టినట్లయితే నగరవాసులకు ప్రస్తుతం గుంతల సమస్య ఉండేదికాదేమో.. కాని బీఎంసీ అధికారులు సీసీ రోడ్ల పనులను పట్టించుకోకుండా తారు రోడ్ల నిర్మాణంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా ఏటా వర్షాకాలంలో ముంబైకర్లకు గుంతల బెడద తప్పడం లేదు. బీఎంసీ పెట్టుకున్న లక్ష్యం ప్రకారం ఏటా 250 కి.మీ. రోడ్లు సీసీగా తయారుకావాలి. కాని 1990 నుంచి ఇప్పటివరకు కేవలం 760 కి.మీ. మేర రోడ్లు సీసీగా మార్చారు. అంటే ఏడాదికి సుమారు 30 కి.మీ. రోడ్లు మాత్రమే సీసీ రోడ్లుగా మారుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ యేడు 433 కి.మీ. మేర రోడ్లను తారురోడ్లుగా మార్చాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. అందుకు రూ.561 కోట్లు మంజూరు చేసింది. కాని ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు కాంట్రాక్టర్లు చేపట్టిన నాసి రకం పనులను బట్టబయలు చేస్తున్నాయి. సాధారణంగా తారు రోడ్ల జీవితకాలం ఏడేళ్లు ఉంటుంది. కాని ఇప్పుడు నిర్మిస్తున్న తారురోడ్లు ఒక ఏడాది కూడా మన్నికగా ఉండడం లేదు. గుంతలు పూడ్చేందుకు కోల్డ్ మిక్స్ అనే ఆధునిక పద్ధతిని ఉపయోగిస్తున్నప్పటికీ ఫలితం ఉండటంలేదు. సీసీ రోడ్లు వేస్తే కొన్నేళ్ల వరకు వాటి వైపు చూడాల్సిన పనిలేదు. అదే తారు రోడ్లు వేస్తే ఏటా వర్షా కాలానికి ముందు, తర్వాత కూడా టెండర్లు ఆహ్వానించవచ్చు. తమకు ఎక్కువ శాతం కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్‌కు ఈ పనుల బాధ్యతలు కట్టబెట్టవచ్చనే ఉద్దేశంతోనే బీఎంసీ అధికారులు తారురోడ్ల నిర్మాణంపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మంజూరు చేరోడ్ల నిధులు గుంతల పాలు!
Published Tue, Aug 13 2013 12:32 AM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement
Advertisement