మొటిమలు తుడిచి... మెటికలు విరిచి! | control actions to pimples | Sakshi
Sakshi News home page

మొటిమలు తుడిచి... మెటికలు విరిచి!

Published Mon, Oct 6 2014 11:06 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

మొటిమలు తుడిచి... మెటికలు విరిచి! - Sakshi

మొటిమలు తుడిచి... మెటికలు విరిచి!

చాలామంది తల్లిదండ్రులు టీనేజ్‌లో మొటిమలు రావడం సహజమే అనుకుంటారు. కానీ ఆక్నేకి ఆ సమయంలోనే ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. దీనికి మెడికల్ ట్రీట్‌మెంట్, కెమికల్ ట్రీట్‌మెంట్, లేజర్ ట్రీట్‌మెంట్ ఉంటాయి.
 
 
ప్రీతి ఆ రోజు స్నేహితురాళ్లతో కలిసి క్లాస్ డే ఫంక్షన్‌లో పాల్గొనాలి. పద్నాలుగేళ్ల ఆ అమ్మాయి చాలా ఉద్వేగంగా ఉంది. అందునా త్రైమాసిక పరీక్షలూ పూర్తికావడంతో క్లాస్‌లో జరగబోయే వేడుకలపై పూర్తి దృష్టి కేంద్రీకరించవచ్చన్న ఆనందం కూడా. ఆ తర్వాత క్లాస్‌డే ఫంక్షన్ తర్వాత కొన్ని రోజులు సెలవలు కూడా. దాంతో రెట్టించిన ఉత్సాహంతో ఉంది. క్లాస్‌కు వెళ్లడానికి తయారవుతూ అద్దంలో చూసుకుని అకస్మాత్తుగా నిరుత్సాహపడిందా అమ్మాయి. కారణం... ఆమె కుడి బుగ్గ మీద ఎర్రగా చిన్న ఉబ్బు. పరిశీలించి చూసి అది మొటిమ అని గ్రహించింది. అంతే... ఆమె ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లయ్యింది. ఆ చిన్న కారణంతోనే పూర్తిగా నిరుత్సాహానికీ, నిర్వేదానికీ లోనై ఆవేళ పార్టీ ఎగొట్టింది.
     
అచ్చం ప్రీతిలా ఫీలయ్యే టీనేజీ పిల్లలు ఎందరో! వాళ్ల అందం పట్ల, లుక్స్ పట్ల కాస్త అనుమానం వచ్చినా చాలు ఎంతో డీలా పడిపోతారు. మానసికంగా కుంగిపోతారు. ఆ వయసులో మొటిమలు చాలా సాధారణమైనవన్న విషయాన్ని జీర్ణించుకోలేరు. చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు... బాల్యం దాటి అలా యుక్తవయసులోకి ప్రవేశిస్తుండగానే వాళ్ల ముఖాలు, బుగ్గలపై మొటిమలు మొదలైపోతాయి.

బుగ్గలపై మొటిమలు రావడానికి ముఖంపై ఉండే ‘పైలో సబేషియస్ యూనిట్’ అనే వ్యవస్థ చాలా చురుగ్గా పనిచేయడమే. ముఖంపై ఉండే ‘సబేషియస్ గ్రంథులు’ ముఖంపై నూనె వంటి పదార్థాన్ని స్రవిస్తుంటాయి. ఒక్కోసారి ఈ గ్రంథుల చివర్లు మూసుకుపోతాయి. దాంతో నూనె వంటి పదార్థం లోపలే చిక్కుకుపోతుంది. దాంతోపాటు అక్కడ బ్యాక్టీరియా పెరిగి ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీస్తుంది. అది క్రమంగా చీము పేరుకుపోడానికి కూడా కారణం కావచ్చు. ఇలా మొటిమ (ఆక్నే) అభివృద్ధి చెందుతుంది.
 
యుక్తవయసులో కనిపించే సాధారణ మొటిమలు (ఆక్నే వల్గారిస్)
బాల్యం దాటి కౌమార్యం ప్రవేశించేనాటికి ఈ మొటిమలు మొదలవుతుంటాయని మొదటే చెప్పుకున్నాం. ఎందుకంటే బాల్యం నుంచి కౌమార దశలోకి ప్రవేశించే సమయంలో కొన్ని రకాల కొత్త హార్మోన్ల ఉత్పత్తి శరీరంలో ప్రారంభమవుతుంది. మగపిల్లల్లో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పన్నం కావడం మొదలువుతుంది. దీంతో మగపిల్లల్లో సెబేషియస్ గ్లాండ్స్ ప్రభావితమై, తీవ్రంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. (హైపర్ ఆక్టివ్ అవుతాయి). ఆ గ్రంథుల్లోంచి ‘సెబమ్’ అనే నూనెవంటి పదార్థం స్రవిస్తుంది. అయితే ఈ గ్రంథుల చివర్లలో ఉన్న కణజాలం మృతిచెంది ఆ నూనెవంటి పదార్థాన్ని బయటకు రాకుండా ఆపినప్పుడు, నూనె గ్రంథి మూసుకుపోయి మొటిమ వస్తుంది. దీన్ని గిల్లినప్పుడు సీబమ్ బయటకు వచ్చేసి, అక్కడ చిన్న గుంట మిగిలిపోతుంది.
 
ఆక్నే (మొటిమల)లో రకాలు
 
1. నియోనేటల్ ఆక్నే: అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా మొటిమలు వస్తాయి. పిల్లల రక్తంలో మిగిలిన తల్లుల రక్తం అవశేషాల వల్ల ఇలా అప్పుడే పుట్టిన పిల్లల్లో మొటిమలు వస్తాయి. దీన్నే నియోనేటల్ ఆక్నే అంటారు.
 
2. ఇన్‌ఫ్యాంటైల్ ఆక్నే :
ఇది మూడు నుంచి ఆరు నెలల పిల్లల్లో వచ్చే అరుదైన మొటిమలు. పిల్లలు పెరుగుతూ పోతూ ఉన్న కొద్దీ ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో పెరిగిపోవచ్చు.
 
3. ఆక్నే వల్గారిస్ : ఇవి మనకు సాధారణంగా కనబడే మొటిమలు. బాల్యం నుంచి యుక్తవయసులోకి ప్రవేశించిన పిల్లల్లో కనిపించే మామూలు మొటిమలు. వీటిని వైద్య పరిభాషలో ‘ఆక్నే వల్గారిస్’ అంటారు. ఇవి పిల్లల్లో తరచూ కనిపిస్తాయి. యుక్తవయసులో స్రవించడం మొదలుపెట్టే ‘హార్మోన్లే’  వీటికి ప్రధాన కారణం. ఇప్పుడు మనం ఈ కథనంలో  విపులంగా చర్చించబోయేది ప్రధానంగా యుక్తవయసులో వచ్చే ఈ మొటిమల గురించే. ఎందుకంటే యుక్తవయసులోకి రాగానే తమ లుక్స్ గురించి ఆడపిల్లలూ, మగపిల్లలూ అందరు బెంగపడేది ప్రధానంగా వీటి గురించే కాబట్టి.
 
4. అడల్ట్ ఆక్నే: ఇవి కౌమార వయసులో వచ్చే ఆక్నేకు కొనసాగింపుగా వస్తూ ఉండేవి. అయితే కొందరిలో కౌమారంలో రాకపోయినా ఆ తర్వాతి దశలో ఇవి రావచ్చు. ఇవి ప్రధానంగా మహిళల్లో ఎక్కువ. ఎందుకంటే వాళ్లలో సాధారణంగా అనేక రకాల హార్మోన్లు స్రవిస్తాయి. వాటి అసమతౌల్యతల కారణంగా అడల్ట్ ఆక్నే మహిళల్లోనే ఎక్కువ. ఇవి ఎక్కువ దవడ కింది భాగంలో, చుబుకం, ప్రధాన ముఖానికి పక్క భాగంలో (పెరీఓరల్) ఎక్కువగా కనిపిస్తాయి.
 
5. ఆక్నే కంగ్లాబేట్ : ఇవి మొటిమల్లో చాలా తీవ్రమైన రకం. ఇవి యువకుల్లో, యువతుల్లో కనిపిస్తాయి. సాధారణంగా ముఖానికి పరిమితం కాకుండా ఛాతీ, భుజాలు, వీపు, పిరుదులు... ఇలా అన్ని శరీర భాగాల్లో వస్తాయి. ఇవి ఒక్కోసారి బ్యాక్టీరియల్ (గ్రామ్ పాజిటివ్ బాక్టీరియా) ఇన్ఫెక్షన్ రూపాన్ని తీసుకోవచ్చు. ఇక ఇవి వచ్చినప్పుడు ఆయా భాగాల్లో పెద్ద మచ్చలు ఏర్పడతాయి.
 
6. ఆక్నే ఇన్‌వర్సా : వీటినే హైడ్రెడినైటిస్ సప్యురేటివా అని కూడా అంటారు. తీవ్రంగా వచ్చే మొటిమలు మళ్లీ మళ్లీ తిరగబెట్టడాన్ని ఇలా అభివర్ణిస్తారు. సాధారణంగా ఇవి తొడలు, చంకలు, మర్మావయవాలు కలిసే ముడుతలు (గ్రోయిన్), రెండు పిరుదుల మధ్య భాగంలో వస్తాయి. చాలా శ్రద్ధతో తీవ్రమైన చికిత్స చేయడం వల్లనే తగ్గడం సాధ్యం.
 
7. ఆక్నే ఫల్మినన్స్ : ఇవి తీవ్రమైన సిస్టిక్ ఆక్నే. అంటే గుల్లలుగా వచ్చే మొటిమలు అన్నమాట. ఇవి ప్రధానంగా రక్తస్రావం అవుతూ ఉండే కండర భాగాలతో పాటు మొటిమలుగా పైకి తేలి కనిపిస్తుంటాయి. ఇవి ప్రధానంగా పుండ్లలా కనిపిస్తాయి. ఇవి ఒక్కోసారి ఆర్థరైటిస్ వచ్చిన వారిలో ఎక్కువగా కనిపిస్తాయి.
 
8. ఆక్నే కాస్మటికా : కొన్ని రకాల కాస్మటిక్ పదార్థాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల వచ్చే మొటిమలు ఇవి. ఉదాహరణకు లానోలిన్, వెజిటబుల్ ఆయిల్స్, బ్యుటైల్ స్టియరైట్, లారిల్ ఆల్కహాల్, ఆలియాక్ ఆసిడ్ వంటివి.
 
9. ఐట్రోజెనిక్ ఆక్నే : కొన్ని రకాల మందులు వాడిన తర్వాత కనిపించే మొటిమలు ఇవి. ఉదాహరణకు... కార్టికోస్టెరాయిడ్స్, యాంటీసెప్టిక్స్, యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ సైకోటిక్స్, యాంటీ ట్యూబర్కులోన్స్, యాంటీ నియోప్లాస్టిక్ (యాంటీ క్యాన్సర్), యాంటీవైరల్, కాలమైన్, కొన్ని రకాల విటమిన్ మాత్రలు (ప్రధానంగా విటమిన్ బి12, బీ కాంప్లెక్స్) రకాలకు చెందినవి వాడాక ఇవి కనిపిస్తుంటాయి.
 
10. ఆక్నే ఎక్స్‌గోరి: ఇవి ఒత్తిడి కారణంగా కనిపించే మొటిమలు. వీటిని గట్టిగా ఒత్తడం, గిల్లడం వల్ల ఇవి మరింత తీవ్రమవుతాయి. ప్రధానంగా మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొనే మహిళల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి.
 
మొటిమలు... లక్షణాలు
మొటిమల్లో ప్రధానంగా నాలుగు గ్రేడ్స్ ఉంటాయి. అవి...
 
గ్రేడ్ - 1 : (కొమెడోజెనిక్) : ఈ దశలో ఉన్న మొటిమను వైట్ హెడ్ లేదా బ్లాక్ హెడ్ అని పిలుస్తారు. దీని బయటి చివరి భాగం (మూతి భాగం) మూసుకుపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఇది తెల్లరంగులో గడ్డగట్టుకుపోయిన చిన్న బంతి ఆకృతిలో కనిపిస్తుంది. ఒక్కోసారి మన బాల్‌పాయింట్ పెన్‌లోచి చివరి టిప్ సైజ్‌లో ఈ వైట్‌హెడ్ ఉంటుంది. ఒకవేళ మూతి చివరి చర్మకణాలు చనిపోయి నల్లగా మారిపోతే దాన్ని బ్లాక్‌హెడ్‌గా అభివర్ణిస్తారు.
 
గ్రేడ్ - 2 : (పాప్యులర్ ఆక్నే) : ఈ దశలో మొటిమలో కొద్దిపాటి వాపు, మంట (ఇన్‌ఫ్లమేషన్) కనిపిస్తుంది. ఇలా ఇన్‌ఫ్లమేషన్ కనిపించే దశను పాపులర్ ఆక్నే అంటారు. ఈ దశలో ఇది చిన్నగా ఎర్రగా బయటికి తన్నుకొని వచ్చినట్టు కనిపిస్తుంది.
 
గ్రేడ్ - 3 : (పస్టులార్ ఆక్నే): ఈ దశలో ఇన్‌ఫ్లమేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా ఈ దశలో ప్రాపియోనిక్ బ్యాక్టీరియా అనే ఒక తరహా బ్యాక్టీరియా ఆ మొటిమకు తోడవుతుంది. ఈ దశలో మొటిమలో ఇన్‌ఫ్లమేషన్‌కు తోడుగా చీము చేరుతుంది. దాంతో ఎర్రటి ఉబ్బుకు వచ్చిన భాగం మీద తెల్లటి చీము కనిపిస్తూ ఉంటుంది.
 
గ్రేడ్ - 4 :  (సిస్టిక్ ఆక్నే) : ఒకవేళ పైన పేర్కొన్న పుస్టులార్ ఆక్నే మరింత తీవ్రమైనప్పుడు అది చిన్న నాడ్యూల్‌గా (నీటి తిత్తిగా) మారిపోయి, బయటకు తన్నుకు వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇందులో ఇన్‌ఫ్లమేషన్‌తో పాటు, చీము, నొప్పి, నీటిగుల్ల... ఇవన్నీ కలిపి ఉన్నందున మొటిమ తాలూకు తీవ్రమైన రూపంగా పరిగణిస్తారు.
 
కొన్ని మొటిమల్లో మొదటి గ్రేడ్ నుంచి నాలుగో గ్రేడ్ వరకూ ఒకే మొటిమలోనే అన్ని దశలూ కనిపించవచ్చు. ఈ తరహా మొటిమలు ముఖం, ఛాతీ, భుజాలు, వీపు... ఇలా అన్ని భాగాల్లో రావచ్చు.
 
తీవ్రతరం చేసే మరిన్ని అంశాలు
మురికిగా ఉండే సెల్‌ఫోన్లు : టీనేజి పిల్లల్లో మొటిమలు వస్తున్నప్పుడు వారు మురికిగా ఉండే సెల్‌ఫోన్లు వాడితే మొటిమల సమస్య మరింత తీవ్రమవుతుంది. ఈ వయసు పిల్లలు తాము వాడే సెల్‌ఫోన్ ఉపరితలాన్ని, స్క్రీన్‌ను శుభ్రంగా తుడిచి ఉపయోగిస్తుండాలి.
 
హెయిర్ స్ప్రే ల వాడకం : ఈ వయసు పిల్లలు హెయిర్ స్ప్రేలు, హెయిర్ స్టిఫెనర్లు, తలకు రంగులు, స్రెచ్‌లు, జెల్‌లు, క్రీములు వంటివి ఎక్కవగా వాడుతుంటారు. ఒక్కోసారి వీటి వల్ల సమస్య మరింత తీవ్రం కావచ్చు. ఇలాంటి సమయాల్లో మొటిమలు నుదుటి భాగంలో కనిపించడం చాలా సాధారణం.
 
చాలా రకాల కాస్మటిక్స్ వాడకం : కొందరు తాము మరింత అందంగా కనిపించాలనే ఉద్దేశంతో అనేక రకాల కాస్మటిక్స్ వాడుతుంటారు. ఇలా రకరకాల కాస్మటిక్స్ వాడేవారిలో (వాళ్లు మగపిల్లలైనా, ఆడపిల్లలైనా) వాళ్లు ఉపయోగించే పదార్థాలలో కొమిడొజెనిక్ ఏజెంట్స్ అని పిలిచే లెనోలిన్, వెజిటబుల్ ఆయిల్స్, బ్యూటల్ స్ట్రియటైట్, లారిల్ ఆల్కహాల్, శరీరాన్ని తెల్లబరిచేందుకు ఉపయోగించే కాస్మటిక్స్ ఇలాంటి పరిణామాలకు దారి తీస్తాయి. అందుకే కాస్మటిక్స్ కొనేముందు అవి ‘నాన్ కొమిడోజెనిక్ కాస్మటిక్స్’ అని ధ్రువీకరించుకున్న తర్వాతనే వాటిని కొనుగోలు చేయాలి.
 
ముఖాన్ని అతిగా కడగటం : ముఖం తేటగా కనిపించాలనే ఉద్దేశంతో మాటిమాటికీ కడగటం, స్క్రబ్బింగ్ చేయడం, ఆవిరిపట్టించడం (స్టీమింగ్), ఫేషియల్స్ అతిగా ఉపయోగించడం వంటి పనులు చేయడం వల్ల కూడా ముఖానికి నష్టం వాటిల్లుతుంది.
 
మొటిమలను గిల్లడం, నొక్కడం :
మొటిమలను గిల్లడం, గట్టిగా నొక్కడం ద్వారా వాటి నుంచి విముక్తి పొందడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. ఈ తరహా చేష్టల వల్ల వాటి తీవ్రత పెరుగుతుంది. అంతేకాదు ముఖంపై చిన్నచిన్న గుంటలు పడే అవకాశం ఉంది. ఇన్‌ఫ్లమేషన్ వంటివి సంభవిస్తే ముఖం మరింత అసహ్యంగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ తరహా చేష్టలకు దూరంగా ఉండాలి.
 
తల్లిదండ్రుల దృక్పథం : చాలా మంది తల్లిదండ్రులు వయసు పెరుగుతున్న కొద్దీ మొటిమలు వాటంతట అవే తగ్గుతాయని అపోహ పడుతుంటారు. కొందరి విషయంలో అది వాస్తవమే. కానీ అన్ని రకాల మొటిమలు అలా వయసు పెరుగుతున్న కొద్దీ వాటంతట అవే తగ్గవు. అవి ఏ తరహాకు చెందినవి, వయసుతో పాటు వస్తున్నాయా లేక తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల వస్తున్నాయా లేదా అమ్మాయిలు ఏదైనా సంకోచాలు (స్టిగ్మా)తో బాధపడుతున్నారా అనే విషయాలను గమనించారు. ఇలా అమ్మాయి ఏదో కారణాల వల్ల బాధపడుతూ, ఆ సమస్యకు తోడు ఒత్తిడితో మొటిమలు కూడా వస్తే అంతర్ముఖురాలిగా మారిపోవచ్చు. ఆమె తన సహజమైన కలివిడితనాన్ని వదిలేయవచ్చు.

స్నేహితులు, బంధుమిత్రులను కలవడానికి ఇష్టపడకపోవచ్చు. దీనివల్ల ఆ అమ్మాయి తన బాల్యం/కౌమార్యంలో కొన్ని మాధుర్యాలను మిస్ అయ్యే అవకాశం ఉంది. అది మానసిక పెరుగుదలకు, ఆత్మస్థైర్యానికి విఘాతం అయ్యే అవకాశం ఉంది. ఇది వారి కెరియర్‌కు సంబంధించిన పరీక్షల ఫలితాలపై కూడా తీవ్రమైన ఫలితాలను చూపే అవకాశం ఉంది. అందుకే అవి ఏ తరహా మొటిమలు అయినప్పటికీ ఒకసారి డర్మటాలజిస్ట్‌కు చూపించి, సలహా పొందడం వారు ఏదైనా మందులు సూచిస్తే వాడటం వల్ల అమ్మాయిలు / అబ్బాయిలకు ఆ సమయంలో అందాల్సిన మానసిక స్థైర్యం చేకూరి, ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. కాబట్టి సమయానికి చికిత్స అందడం మొటిమల విషయంలో చాలా ముఖ్యమని గ్రహించండి. అంతేగాని అవి వాటంటత అవే తగ్గుతాయనే భావనతో వాటిని ముదరనివ్వకండి. దాంతో పిల్లల మానసిక వికాసానికీ విఘాతం కలిగే అవకాశం ఉంది.
 
కొన్ని సూచనలు
ఓపికగా ఉండండి.
డాక్టర్ ఇచ్చిన సూచనలు తప్పక పాటించండి. కొద్దిగా తగ్గగానే మందులు లేదా సూచనలు మానేయకండి.
ఆహార విషయాల్లో జాగ్రత్తలు పాటించండి.
నూనె పాళ్లు తక్కువగా ఉండే లేపన ద్రవ్యాలనే (స్కిన్ ప్రాడక్ట్స్)నే వాడండి.
చర్మాన్ని చాలా సున్నితంగా, సుకుమారంగా చూసుకోండి.

 
కారణాలు
ఇవి టీనేజీ దశలో స్రవించే హార్మోన్లు: దీనికి ప్రధాన కారణం బాలలు ఒక్కసారిగా యౌవన (కౌమార) దశలోకి ప్రవేశించడం. దీన్నే ప్యూబర్టీ స్పర్ట్‌గా పేర్కొంటారు. ముందుగా చెప్పినట్లు మగపిల్లల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఒక్కసారిగా ఉత్పన్నమయి సబేషియస్ గ్లాండ్స్‌ను ప్రేరేపించడంతో మగపిల్లల్లో మొటిమలు వస్తాయి. ఇక టీనేజీ అమ్మాయిల్లోనైతే అనేక రకాల హార్మోన్లు స్రవిస్తుంటాయి. అవి అనేకం ఉండటం వల్ల వీటి మధ్య సమతౌల్యత లోపిస్తే మొటిమలు కనిపిస్తాయి. ముఖ్యంగా ‘పాలీసిస్టిక్ ఒవేరియన్ డిజార్డర్’ లేదా పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఉన్న అమ్మాయిల్లో ముఖాలపై మొటిమలు చాలా ఎక్కువ.
 
ఆహారం : ఎక్కువ చక్కెరపాళ్లు ఉండే (హై గ్లూకోజ్) ఆహారాన్ని తీసుకునే వారిలో మొటిమల సమస్య చాలా ఎక్కువ. ప్రతిరోజూ పాల ఉత్పాదనలతో కూడిన స్వీట్లు, చాక్లెట్లు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం, నూనె ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకునేవారిలో మొటిమలు ఎక్కువగా వస్తాయి. మనం ఈ తరహా ఆహారాన్ని తగ్గిస్తే మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి. అయితే అన్ని కేసుల్లోనూ ఇదే జరుగుతుందన్న హామీ ఉండదు. కొన్నిసార్లు ఆహారాన్ని మార్చినా తగ్గకపోవచ్చు. ఇక మొటిమలకూ, ఇన్సులిన్ మెటబాలిజమ్ (ఇన్సులిన్ జీవక్రియల తీరు), స్థూలకాయానికీ సంబంధం ఉందని స్పష్టంగా కొన్ని అధ్యయనాల్లో తేలింది.
 
జన్యుసంబంధమైన కారణాలు : కొందరిలో ఇవి ఎలాంటి కారణం లేకుండా కేవలం జన్యుసంబంధరమైన కారణాలతోనూ రావచ్చు.
 
ఒత్తిడి : తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే కొందరిలో మొటిమలు ఎక్కువగా వస్తాయని స్పష్టంగా తెలిసింది.
 
ఇన్ఫెక్షన్ ఏజెంట్స్ : కొన్ని రకాల బ్యాక్టీరియా అంటే... ప్రోపియోనీ బ్యాక్టీరియా, స్టెఫాలోకోకస్ ఆరియస్, డెమోడెక్స్ ఫాలిక్యులోరమ్ వంటి ఇన్ఫెక్షన్లను కలిగించే బ్యాక్టీరియాతోనూ కొందరిలో మొటిమలు రావచ్చు. పిగ్మెంటేషన్ తగ్గడానికి మెడికల్ షాపుల్లో లభించే స్టిరాయిడ్ క్రీముల వాడకం వల్ల కూడా మొటిమలు రావచ్చు.
 
వృత్తిపరంగానూ : కొందరు ఎరువుల ఫ్యాక్టరీలలో పనిచేస్తుంటారు. మరికొందరు సిమెంట్ పరిశ్రమల్లో పనిచేస్తుంటారు. ఇలాంటి పరిశ్రమల్లో పనిచేసేవారికి మొటిమలు రావడం చాలా సాధారణం. అయితే ఈ తరహా మొటిమలు కాళ్లు, మోకాళ్ల కిందిభాగాలు, ముంజేతులు, మోచేతుల వంటి భాగాల్లో ఇవి వస్తాయి. ఇలాంటి మొటిమలు వచ్చిన వారు సదరు వృత్తులనుంచి దూరమైతే... ఈ తరహా మొటిమలు కూడా వాటంతట అవే తగ్గుతాయి.
 
నివారణ / చికిత్సలు
మొటిమల నివారణ చాలా సులువు. ఉదాహరణకు టీనేజ్ పిల్లలు తీసుకునే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం వంటివి. అవి...

చాక్లెట్లు / కాఫీలు : చాక్లెట్లు, కాఫీ లోని కెఫిన్ మొటిమలను ప్రేరేపించే అంశాల్లో చాలా ప్రధానమైనది. అందుకే ఆ వయసులో పిల్లలకు అందాల్సిన ఆహారాలు ఆరోగ్యకరంగానూ, కొవ్వులు, చక్కెరపాళ్లు తక్కువగా ఉండేవి గాను ఉండాలి. అవి సెబేషియస్ గ్రంథులను ప్రేరేపించే ఆహారాలని గుర్తిస్తే వాటికి దూరంగా ఉండాలి. ఈ తరహా నివారణ చర్యల తర్వాత కూడా మొటిమలు తగ్గకపోతే అప్పుడు క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్‌ను కలవాలి.
 
మళ్లీ మళ్లీ కనిపించే మొటిమలు : కొందరిలో చికిత్స తీసుకున్న తర్వాత తగ్గినట్లుగా కనిపించే మొటిమలే చికిత్స మానేయగానే పునరావృతమవుతుంటాయి. అందుకే కేవలం ఒకటి లేదా రెండు నెలల చికిత్స సరిపోదని గ్రహించాలి. మొటిమలు పూర్తిగా తగ్గాలంటే అవి ఏ తరహాకు చెందినవి అనే అంశం ప్రధానమైనది. కొందరిలో చికిత్స ఆరు నుంచి ఎనిమిది నెలలు కూడా పట్టవచ్చని గ్రహించాలి.

ఈ సమయంలోనే కొందరు పేషెంట్లు తగ్గినట్టే తగ్గి మళ్లీ మొటిమలు కనిపించగానే ఒక డాక్టర్ నుంచి మరో డాక్టర్ వద్దకు తిరుగుతూ ఉంటారు. మొటిమలు మాటిమాటికీ వచ్చే సమస్యల్లో ఒకటని గ్రహిస్తే ఈ తరహా తప్పటడుగులకు ఆస్కారం ఉండదు. మరికొందరు చికిత్స కోసం ఇతర చికిత్సా విధానాలపై ఆధారపడతారు. ఒక్కోసారి అది ప్రమాదకరం కావచ్చు.

పై అంశాలన్నింటినీ పరిశీలించి చూస్తే పిల్లల చర్మం చాలా సున్నితమైనదనీ, సమస్యను బట్టి వాటిని రకరకాల ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని గ్రహించాలి. పైగా కొన్ని రకాల మొటిమల్లో గుణం కనిపించడానికి చాలా వ్యవధి పట్టవచ్చని కూడా తెలుసుకోవాలి. కాబట్టి మొటిమల్లోని అనేక రకాలను బట్టి చికిత్సలు మారుతుంటాయని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకోవాలనే అవగాహనను పెంచుకుంటే మానసికంగానూ అవి కల్పించే ఇబ్బందులను చాలా సమర్థంగా ఎదుర్కోవచ్చు. అందుకే మొటిమల చికిత్సలో పిల్లల (యుక్తవయసు, కౌమార బాలల) పాత్ర ఎంత ముఖ్యమో, వారి తల్లిదండ్రుల భూమికా అంతే ప్రధానం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement