కరోనా వైరస్ విజృంభించాక జనం మనసులో అనేక అనుమానాలు. దేనిపై వైరస్ ఉందో అంటూ ఎన్నెన్నో సంశయాలు. ఏ పేస్టో, బ్రష్షో... లేదా అట్ట పెట్టెలో ప్యాక్ అయి ఉండేదో కొన్నారనుకోండి రేపర్‌నూ పారేసి... చేతులు శానిటైజ్ చేసుకుని నిశ్చింతగా వాడుకోవచ్చు. మరి అలా ప్యాక్‌లలో రానివైతేనో? కరోనా వైరస్ అట్టపెట్టెలూ, ఇతరత్రా వాటిపై కొద్దిగంటల పాటే ఉన్నా... ప్లాస్టిక్ మీద గరిష్ఠంగా 72 గంటల పాటు ఉంటుందని మనకు తెలుసు కాబట్టి ఏ వస్తువునైనా గరిష్టంగా మూడు రోజులు ముట్టుకోకుండా నాలుగో రోజు నుంచి వాడుకుంటే సేఫ్.
కానీ కూరగాయలూ, ఆకుకూరలూ, పండ్లు నిల్వ ఉండవు. కూరగాయలూ, ఆకుకూరలంటే మంట మీద వండుతాం. కాబట్టి దాదాపు సురక్షితమే. కానీ పండ్లను వండలేం. కొన్నింటిని పొట్టు వలిచి తిన్నా... చాలావాటిని అలాగే తినేస్తాం. కాబట్టి కూరగాయలూ, ఆకుకూరలూ, పండ్లు మొదలైన తినే పదార్థాలనూ ఎలా శుభ్రపరచుకోవాలో తెలుసుకుందాం. మనం తినే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను శుభ్రం చేసుకోవాల్సిందే. అయితే అన్నిరకాల వెజిటబుల్స్‌ను ఒకేలా శుభ్రం చేయడం సరికాదు. వేర్వేరు వెజిటబుల్స్‌ను, పండ్లను ఎలా శుభ్రపరచుకోవాలో చూద్దాం.
ముందుగా చేతులు శుభ్రపరచుకోండి...
కూరగాయలూ, ఆకుకూరలూ శుభ్రపరచడానికి ముందుగా మన చేతుల్ని శుభ్రపరచుకోవాలి. సాధారణంగా ఇతర పరిస్థితుల్లో మనం శానిటైజర్‌తో శుభ్రం చేసుకున్నా... కూరగాయలూ, ఆకుకూరలూ, పండ్లు కడిగే ముందర మాత్రం శానిటైజర్‌ను వాడటం సరికాదు. ఇందుకోసం కేవలం యాంటీబ్యాక్టీరియల్ సబ్బుతో చేతుల్ని కడుక్కోవాలి.
ఆహారాన్ని ఎలా శుభ్రం చేయాలంటే...
ముందుగా ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసుకోవాలి, ఆ నీళ్లకు కాస్తంత వెనిగర్ కలుపుకుని నీటి సొల్యూషన్‌ను సిద్ధం చేసుకోవాలి. ఈ సొల్యూషన్ తయారు చేయడానికి... నాల్గింట మూడొంతుల నీళ్లు తీసుకొని అందులో ఒక వంతు వెనిగర్ కలపడం ద్వారా ఈ సొల్యూషన్‌ను తయారు చేయాలి. ఒకవేళ వెనిగర్ లేనివారు కేవలం కిచెన్‌లోని నీళ్లతోనే శుభ్రం చేస్తుంటే... కడగబోయే కూరగాయలపైనా, పండ్లపైనుంచి నీరు కాసేపు పైనుంచి ధారగా పడుతూ ప్రవహించేలా చేయాలి.
మట్టి కింద ఉండే దుంపల్ని శుభ్రం చేయడమిలా...
- మట్టి కింద ఉండే బంగాళదుంప, క్యారట్ వంటి వాటిని వెంటనే శుభ్రపరచకుండా, ముందుగా కొద్దినిమిషాలు నీళ్లలో నాననివ్వాలి. ఎలాగూ చెక్కుతీసి వాడినప్పటికీ, నానాక కోసే ముందు ఇంకోసారి ధారగా పడే నీళ్లలో కడగాలి.
- కాలిఫ్లవర్, బ్రకోలీ లాగా ముడుతలు ముడుతలుగా ఉండి, ఆ ముడుతల్లో మట్టి చేరే అవకాశమున్న పువ్వుకూరలను కాసేపు నీళ్లలో నాననివ్వాలి. ఆ తర్వాత నీళ్లు కారిపోయేలా రంధ్రాలుండే పాత్ర (కొలాండర్)లోకి వాటిని తీసుకోవాలి.
- కాయగూరల పైపొర చెక్కు తీసేలా ఉండే పొట్లకాయ, బీరకాయ, సొరకాయ వంటివాటిని పైనుంచి ధారగా పడుతున్న నీటిలో ఒకటికి రెండుసార్లు కడిగిన తర్వాతే కోయాలి.
- పుట్టగొడుగులను వాడేవారు మష్‌రూమ్ బ్రష్‌తో వాటిని చల్లటి నీటిలో కడిగి, టిష్యూతో శుభ్రం చేయాలి.
- కూరగాయలలో వంకాయలను కోసే పద్ధతి కాస్త వేరుగా ఉంటుంది. ముందుగా వంకాయలను ధారగా పడుతున్న నీటిలో కడగాలి. ఆ తర్వాత కాస్తంత నిమ్మనీరు, కాస్తంత ( 2 శాతం) చింతపండు నానేసిన నీరు, కాస్తంత ఉప్పు, 4 శాతం అసిటిక్ ఆసిడ్ ద్రవాలను ఒక పెద్ద పాత్రలోని నీళ్లలో కలిపి, ఆ ద్రవంలో ఒక్కొక్క వంకాయను విడివిడిగా కడగాలి. దీనివల్ల వంకాయల మీద ఉన్న క్రిమిసంహారకాలు పోతాయి.
- పండ్లను ఇలా కడగాలి...
- పుచ్చకాయ, కర్బూజకాయ లాంటి వాటిని ధారగా పడుతున్న నీటికింద కడుగుతూ మెత్తటి కుచ్చులున్న వెజిటబుల్ బ్రష్‌తో శుభ్రంగా కడిగాకే, ముక్కలుగా కోయాలి.
- ఇక నేరేడు, బెర్రీపండ్ల వంటి వాటిని వెనిగర్ సొల్యూషన్‌లో కడగాలి. మనం షాపింగ్ చేస్తున్నప్పుడే పండుపై దెబ్బలేని వాటిని ఎంపిక చేయాలి.
మొత్తం ఒకే కట్టగా ఉండేవాటిని కడగడం ఇలా...
కొత్తిమీర, కర్వేపాకులను సాధారణంగా మొత్తం కట్టకట్టనంతా ఒకేసారి కడుగుతుంటారు. వీటిని నీరు నిండి ఉన్న బౌల్‌లో రెండు మూడుసార్లు రౌండ్ రౌండ్‌గా తిప్పుతూ కడగాలి. అలా కడిగిన ప్రతిసారీ ఆ నీటిని పారబోసి మరోసారి రౌండ్‌గా తిప్పుతూ కడగాలి. ఆ తర్వాత పేపర్ టవల్‌తో తుడవాలి. కొలరాడో స్టేట్ యూనివర్సిటీ చెప్పేదేమంటే... ఇలాంటి వాటిని కడగడానికి ఉపయోగించే నీటిలో కాస్తంత నిమ్మరసం, కొంత వెనిగర్ వేయడం వల్ల కట్ట మీది బ్యాక్టీరియా, ఈ–కొలై శుభ్రంగా కడుక్కుపోవడంతో పాటు కాస్తంత మంచిదీ కొత్తదీ అయిన రుచి (ఫ్లేవర్) కూడా వస్తుంది.
ఇవి మాత్రమే కాదు...
ఇవేగాక... మనం రోజూ వాడుకునే వంట ప్లాట్‌ఫామ్‌ను ఏదైనా డిజ్‌ఇన్ఫెక్టెంట్ కలిపిన నీళ్లతో శుభ్రంగా కడిగి పొడిగా తుడవాలి. అలాగే మనం వాడే స్టౌను రోజూ డిజ్ ఇన్ఫెక్టెంట్‌తో శుభ్రపరచుకోవాలి. ఇక కూరగాయలు తరిగే చాకులు, కత్తిపీటలు, స్పూన్లు, ఫోర్క్‌లు, గిన్నెలు దించడానికి వాడే పట్టకార్లూ వంటి వాటిని కూడా. అయితే వీటికి డిజ్‌ఇన్ఫెక్టెంట్ వాడకుండా... సబ్బు/డిటర్జెంట్‌తో కడుక్కుని, తర్వాత మరోసారి మంచినీళ్లతోనూ కడుక్కోవాలి.
హై టచ్ పాయింట్స్...
మనం కిచెన్‌లో రోజులో తరచూ ముట్టుకునే ప్రదేశాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు కిచెన్ వాష్‌బేసిన్ నాబ్స్, నల్లా/కొళాయి (ట్యాప్) నాబ్స్, చేతులు తుడుచుకునే న్యాప్‌కిన్స్, ఫ్రిజ్ హ్యాండ్లింగ్, గ్రైండర్లు, రైస్ కుక్కర్లూ, డోర్ హ్యాండ్లర్స్ (నాబ్స్) వీటిని తరచూ (ఒక్కోసారి మనకు తెలియకుండానే) ముట్టుకుంటూ ఉంటాం. కాబట్టి వీటిని హై టచ్ పాయింట్స్ అనుకోవచ్చు. వీటిని తరచూ లేదా రోజులో రెండుమూడుసార్లు డిజ్‌ఇన్ఫెక్టెంట్స్‌తో శుభ్రపరచుకుంటూ ఉండాలి.
గిన్నెలు కడగడమిలా...
గిన్నెలు, బౌల్స్‌ను డిటెర్జెంట్ కలిపిన వేణ్ణీళ్లతో మొదట కడగాలి. ఆ డిటర్జెంట్ తాలూకు సబ్బు పూర్తిగా కడుక్కుపోయేలా మళ్లీ ఓసారి మంచినీళ్లతో కడగాలి. ఆ తర్వాతే మనం శుభ్రం చేసుకున్న కూరగాయలను ఆ గిన్నెలలో పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు గిన్నెలు లోహంతో చేసినవి కాకుండా, పింగాణీవి అయితే అవి చాలా శుభ్రంగా ఉండే అవకాశాలు ఎక్కువ. ఇక గ్రైండర్స్ లాంటివి శుభ్రపరచుకోవడం మామూలే. అయితే గ్రైండర్స్‌ను డిటెర్జెంట్‌తోనూ, ఆ తర్వాత మంచినీళ్లతో శుభ్రపరచుకున్నప్పటికీ... వాటి హ్యాండ్లింగ్స్‌ను మాత్రం డిజ్‌ఇన్ఫెక్టెంట్‌తో శుభ్రం చేసుకుని, ఆ తర్వాత తుడుచుకోవాలి.
వేర్వేరు వెజిటబుల్స్ శుభ్రపరిచే పద్ధతులివి...
చిన్న కాడకు అంటి ఉండే పండ్లను మొదట బాగా శుభ్రం చేశాక... తర్వాత కాడ వద్ద మరోసారి శుభ్రపరచాలి. ఎందుకంటే మురికి పేరుకునే అవకాశాలు కాడ వద్దే ఎక్కువ. ఇలా కాడ ఉన్న పండ్లను శుభ్రం చేశాక తినేముందర అటు కాడ వైపు, ఇటు రెండో చివరివైపు చెక్కు తీసినట్లుగా కత్తితో కోయడం మంచిది. ఆపిల్, పియర్, పీచ్ పండ్ల విషయంలో ఇలా చేయవచ్చు ∙మందంగా తోలు ఉండే పండ్లు (ఉదాహరణకు నారింజ, కమలాలు) తెచ్చినరోజే కడుక్కుని పెట్టుకుంటే మనకు నిశ్చింతగా ఉంటుంది.
దాన్ని ఎన్నిసార్లు ముట్టుకున్నా మనకు వైరస్‌గానీ... లేదా ఇతర సూక్ష్మజీవుల భయంగాని ఉండదు. ఇక ఎలాగూ తినబోయే ముందు తొక్క వలుచుకుని తింటాం కదా. మరీ అనుమానంగా ఉంటే ఓసారి కాస్తంత తేలిగ్గా కడగడం మేలు ∙ఇక పాలకూర, లెట్యూజ్, కొత్తిమీర, కరివేపాకు, క్యాబేజీ లాంటి వాటిని శుభ్రం చేసే ముందర వాటిని నల్లా/కొళాయి కింద ప్రవహించే నీళ్ల కింద కాసేపు ఉంచి, శుభ్రం చేయడం మంచిది. క్యాబేజీ పైన ఉన్న ఆకులు ఒకటి రెండు పొరలను తీసేస్తే చాలు.
మిగతాదంతా శుభ్రంగా ఉంటుంది ∙ఆకుకూరల్ని శుభ్రంగా కడిగాక వాటిపై నీళ్లు ఆరేలా కాసేపు ఆగాలి. ఆ తర్వాత శుభ్రమైన టవల్‌తో వాటిని తుడవాలి. అప్పుడే వాటిని కోయాలి. అంతేగానీ ఆకుకూరల్ని కోశాక వాటిని కడగడం సరికాదు. అలా చేస్తే పోషకాలు కోల్పోతాం. అంతేకాదు... తరిగాక కడిగితే... వాటిపైనున్న మురికి... కోసిన ప్రాంతంలో అతుక్కునే ప్రమాదముంది ∙సలాడ్స్ కోసం... ఆకుకూరలను, కాయగూరలను తాజాగా ఉండగానే కడిగి సలాడ్స్ చేసుకోవాలి.
ఆహారం శుభ్ర పరచడంలో చేయ కూడనివి...
ఆహారాన్ని ఎప్పుడైనా సబ్బుతోగాని, డిటెర్జెంట్‌తో గాని, బ్లీచింగ్ పదార్థాలతో గాని, రసాయన పదార్థాలతోగాని శుభ్రం చేయకూడదని గుర్తుంచుకోండి. కేవలం పరిశుభ్రమైన నీటితో మాత్రమే శుభ్రం చేయాలని తెలుసుకోండి.
కడగటం అవసరం లేకున్నా ఒకసారి కడిగితే మేలు..
వాస్తవానికి ఈ కింద పేర్కొన్న ఆహారపదార్థాలను కడగాల్సిన అవసరం లేదు. కడగకున్నా పర్లేదు. అయినా ఒకసారి కడగడం వల్ల నష్టం లేదు. అవి... ∙ఉల్లిగడ్డ ∙అవకాడో ∙మొక్కజొన్న పైనాపిల్ ∙మామిడిపండ్లు ∙కివీ క్యాబేజీ ∙బొప్పాయి ∙పుచ్చకాయ ∙బ్రాకోలీ ∙టొమాటో ∙చిలగడదుంప (మోరంగడ్డ). వీటిలో ఉల్లిగడ్డ విషయానికి వస్తే కడగటం కుదరకపోతే... ఒకటి రెండు పొరలను తీసి వాడటం మంచిది.
- సుజాతా స్టీఫెన్, సీనియర్ న్యూట్రీషనిస్ట్
Comments
Please login to add a commentAdd a comment