కలవరపరిచే కీళ్లనొప్పి... రుమటాయిడ్ ఆర్థరైటిస్
నాకు కీళ్లలో విపరీతమైన నొప్పిగా ఉంది. కీళ్ల కదలికలు చాలా కష్టంగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఉదయం వేళలో ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంది. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? దయచేసి వివరంగా చెప్పండి.
– ఎల్. నిరంజన్‌రావు, మధిర
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే మన శరీర భద్రతావ్యవస్థ మనపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వస్తుంది. ఈ వ్యాధి చిన్న ఎముకలు, కీళ్లు, మెడ ఎముకలు వంటి చోట్ల వచ్చే అవకాశం ఉంది. కీళ్ల చుట్టూ ఉండే పొరలో వాపు వచ్చి అక్కడి కణాలు పెద్దగా మారి, అక్కడ స్రవించే ద్రవపదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దానివల్ల ఎముకలు దెబ్బతిని, కీళ్లు బిగపట్టినట్లు అవుతుంది. దాంతో కదలికలు కష్టంగా మారతాయి.
లక్షణాలు
⇔ కీళ్ల వాపు, నొప్పి, కదలికలు కష్టంగా మారతాయి.
⇔ ఉదయం లేచిన వెంటనే కీళ్లు బిగబట్టినట్లుగా ఉండి, నొప్పి ఎక్కువగా వస్తుంది.
⇔ కీళ్లు దెబ్బతినడం వల్ల చేతి వేళ్లు కొంకరపోవడం, స్వాన్‌నెక్ డిఫార్మిటీ, జడ్ థంబ్ డిఫార్మిటీ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
⇔ మడమ, చేతి ఎముకలపై చిన్న గడ్డలు రావచ్చు.
⇔ నీరసం, అలసట, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
ఇతర లక్షణాలు
⇔ వ్యాధి తీవ్రస్థాయికి చేరినప్పుడు కీళ్లనే కాకుండా ఊపిరితిత్తుల్లో నీరు పట్టడం, ఊపిరితిత్తులు గట్టిపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
⇔ మూత్రపిండంలోని నెఫ్రాన్స్ పొరలు వాచి మూత్ర సమస్యలు రావచ్చు.
⇔ గుండె పొరల వాపు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, గుండెపోటు వంటి సమస్యలు రావచ్చు.
⇔ కంటి పొరల వాపు, కాలేయం వాపు, రక్తహీనత, నరాల సమస్యల వంటివి వచ్చే అవకాశం ఉంది.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు
∙రక్తపరీక్షలు (సీబీపీ), ఈఎస్‌ఆర్ ∙ఎమ్మారై జాయింట్స్ lకీళ్ల ఎక్స్–రే (దీనితో వ్యాధి తీవ్రతను తెలుసుకోవచ్చు) lరుమటాయిడ్ ఫ్యాక్టర్ ∙క్రియాటివ్ ప్రోటీన్ ∙రీనల్ ఫంక్షన్ టెస్ట్ ∙లివర్ ఫంక్షన్ టెస్ట్ ∙ఏసీపీఏ టెస్ట్‌తో మన శరీరంలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలను తెలుసుకోవచ్చు.
హోమియో చికిత్స
ఈ సమస్యకు హోమియోలో కాల్సికమ్, ఆర్సినికమ్ ఆల్బమ్, లైకోపోడియమ్, రోడోడెండ్రాన్ వాడదగిన మందులు. అయితే లక్షణాలను బట్టి నేట్రమ్ ఆర్స్, డల్కమెరా, క్యాలి అయోడ్, నేట్రమ్‌మూర్, ఆసిడ్ బెంజ్, రూస్టాక్స్ వంటి మందులు కూడా ఉపశమనానికి బాగా ఉపయోగపడతాయి.
నిద్రలో కాళ్లు కదులుతున్నాయి... ఎందుకిలా?
నా భార్య వయసు 49 ఏళ్లు. డయాబెటిస్‌తో బాధపడుతోంది. ఇటీవల నిద్రలో ఆమె కాళ్లను చాలా వేగంగా కదిలిస్తోంది. నిద్రలోంచి లేచి పిక్కలు పట్టేస్తున్నాయని (మజిల్ క్రాంప్స్) అంటోంది. దీంతో ఆమె నిద్రకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దయచేసి ఆమె విషయంలో తగిన సలహా ఇవ్వండి.
– రామానుజరావు, వరంగల్
నిద్రలో ఇలా కుదుపుతున్నట్లుగా కాళ్లు వేగంగా కదిలించడాన్ని ‘పీరియాడిక్ లింబ్ మూవ్‌మెంట్ డిజార్డర్’ (పీఎల్‌ఎమ్‌డీ) అంటారు. సాధారణంగా నిద్రపోతున్న సమయంలో మన శరీరంలో శ్వాస తప్ప మరే కదలికా ఉండదు. కానీ నిద్రజబ్బులో ఇలా కదలికలు కనిపించే జబ్బు ఇదే. ఇక్కడ ‘పీరియాడిక్’ అనే పదం కదలికలు ఎంత ఫ్రీక్వెన్సీతో వస్తున్నాయనేందుకు ఉపయోగిస్తారు. ఇవి క్రమబద్ధంగా ప్రతి 20 – 40 సెకండ్ల పాటు వస్తుంటాయి. పీఎల్‌ఎమ్‌డీ అనేది నిద్రకు సంబంధించిన వ్యాధి. దీనితో బాధపడేవారు రాత్రివేళ నిద్ర తక్కువ కావడం వల్ల పగలు మగతగా ఉంటారు. పీఎల్‌ఎమ్‌డీ అనేది ఏ వయసు వారిలోనైనా రావచ్చు. అయితే సాధారణంగా మధ్యవయస్కుల్లో ఇది ఎక్కువ. పీఎల్‌ఎమ్‌డీలో ప్రైమరీ, సెకండరీ అని రెండు రకాలున్నాయి.
సెకండరీ పీఎల్‌ఎమ్‌డీ అనేది అంతర్గతంగా ఇతర వ్యాధులు ఉన్నవారిలో కనిపిస్తుంది. లేదా కొందరిలో దీనికి కారణం కూడా తెలియదు. మెదడు నుంచి కాళ్లు, చేతులకు వెళ్లే నరాల్లో సమస్యల వల్ల ఇది వస్తుందని తెలుసుకానీ, ఆ సమస్యలేమిటో ఇంకా పరిశోధనల్లో వెల్లడికాలేదు. సెకండరీ పీఎల్‌ఎమ్‌డీకి చాలా కారణాలు ఉన్నాయి. అవి... ∙డయాబెటిస్ ∙ఐరన్ లోపం lవెన్నెముకలో కణుతులు ∙వెన్నెముక దెబ్బతినడం lస్లీప్ ఆప్నియా (గురక) lనార్కోలెప్సీ (క్రమమైన వేళల్లో నిద్రపట్టడం, నిద్రలేవడం జరగకపోవడం) lయురేమియా (రక్తంలో యురియా, నైట్రోజన్ సంబంధిత వ్యర్థపదార్థాల పాళ్లు పెరగడం), రక్తహీనత మొదలైనవి.
పీఎల్‌ఎమ్‌డీతో బాధపడే చాలామందిలో కాళ్ల కదలికలు లేకుండా నిద్రపట్టకపోవడం, దాంతో పగటినిద్ర ఎక్కువగా ఉంటాయి. కొందరిలో ఒక కాలు, లేదా మరికొందరిలో రెండుకాళ్లూ కదులుతూ ఉండవచ్చు. దీని నిర్ధారణకు నిర్దిష్టంగా పరీక్షలేవీ లేకపోయినా, రక్తహీనత వంటి వాటి ద్వారా కారణాన్ని ఊహించవచ్చు. ఈ సమస్య ఉన్నవారికి బెంజోడయజిపైన్స్, క్లోనోజెపామ్, డోమమినెర్జిక్ ఏజెంట్స్, యాంటీ కన్వల్జెంట్ ఏజెంట్స్, గాబా ఆగోనిస్స్ వంటి మందులతో చికిత్స చేయవచ్చు.