మళ్లీ మళ్లీ ఛాతీలో నీరుచేరుతోంది!
మా తాతయ్య ఛాతీలో నీరు నీరు చేరిందన్నారు. చాలాసార్లు తీశారు. మళ్లీ మళ్లీ ఛాతీలోకి నీరుచేరుతోంది. ఛాతీలోకి ఇలా నీరెందుకు చేరుతోంది. దీనికి తగిన వైద్యం ఉందా?
- సుశాంత్, హైదరాబాద్
ఛాతీలో నీరు చేరడాన్ని ‘ప్లూరల్ ఎఫ్యూజన్’ అంటారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఇది నీరు కావచ్చు, చీము లేదా రక్తం కావచ్చు. ఇది ఒక పక్క లేదా రెండువైపులా చేరవచ్చు. నీరు ఎక్కువగా చేరితే దాన్ని ‘మాసివ్ ప్లూరల్ ఎఫ్యూజన్’ అంటారు. వారిలో ఆయాసం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటివారికి వెంటనే నీరు తీయాలి. ఇలా ఛాతీలోకి నీరు చేరడం అనేది హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ సమస్య, లివర్ సమస్యలను సూచిస్తుంది. చీము చేరడం అనేది ఊపిరితిత్తులకు గాని, ప్లూరల్ స్పేస్‌కుగానీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జరుగుతుంది. ఉదా: నిమోనియా, టీబీ ఇన్ఫెక్షన్లు. సాధారణంగా మొదటిదశలో చీము అవునా, కాదా అన్నది కనుక్కోలేము. నీటిని పరీక్షలకు పంపించి మాత్రమే కనుక్కోగలం. కాబట్టి ఈ సమస్యను ట్రాన్స్‌డేటివ్ లేదా ఎగ్జూడేటివ్ అని విభజిస్తారు.
ట్రాన్స్‌డేటివ్ నీరు చేయడం అన్నది సాధారణంగా మందులతో తగ్గిపోతుంది. ఎగ్జుడేటివ్ నీరు చేరడం అన్నది దాని దశని బట్టి చికిత్స మారుతుంటుంది. నిమోనియా ఉండి కొంచెం నీరు ఉంటే, సాధారణంగా యాంటీబయాటిక్స్‌తో తగ్గిపోతుంది. కానీ చీము చాలా ఉంటే, వెంటనే ఛాతీలోకి గొట్టం వేసి దాన్ని డ్రైయిన్ చేయాలి (బయటకు ప్రవహించేలా చేయాలి... అంటే తొలగించాలి). ఒకసారి గొట్టం వేశాక చీము రోజుకు ఎంతమొత్తంలో బయటకు డ్రైయిన్ అవుతోంది అన్న అంశం మీద దాన్ని తీసేయడం ఆధారపడి ఉంటుంది. చీము తీసేయడం ఆలస్యం అయితే, లోపల అనేక ఫైబ్రస్ పార్టిషన్స్ (గదులు) ఏర్పడి, అక్కడ తేనెతుట్టెలాగా మారిపోతుంది. అలాంటి దశలో ఆపరేషన్ అవసరం కావచ్చు. గొట్టం వేసి, అది కరగడానికి ఫిబ్న్రోలైటిక్స్ అనే మందులు లోపలికి మూడు రోజుల పాటు పంపుతారు. అప్పటికీ లోపలి ఫైబ్రస్ పార్టిషన్స్ కరగకపోతే ఆపరేషన్ ఒక్కటే మార్గం.
అసలు ఈ చీము ఎందుకు చేరుతుందో ముందుగా కనుక్కోవాలి. అందుకోసం తగిన పరీక్షలూ, కల్చర్స్ చేయించాలి. ఇన్ఫెక్షన్ అదుపు చేయడానికి కావలసిన మందులు సూచించినంత కాలం వాడాలి. కొంతమందికి ఈ ఇన్ఫెక్షన్ వల్ల చీము చేరడమే కాకుండా ఊపిరితిత్తులకు కన్నం పడుతుంది. దానివల్ల గాలి లీక్ అవుతుంది. దీన్ని ‘బ్రాంకోప్లూరల్ ఫిస్టులా’ అంటారు. ఇలాంటివారిలో ఛాతీలో గొట్టం ఎక్కువరోజులు... అంటే ఫిస్టులా మూసుకుపోయే వరకూ ఉంచాలి. ఇందుకు ఒక్కోసారి ఆర్నెల్లు కూడా పట్టవచ్చు. కొంతమందిలో ఆపరేషన్ ద్వారా ఫిస్టులాను రిపేర్ చేయవచ్చు. మీ తాతగారికి నీరు తీస్తున్నా మళ్లీ మళ్లీ వస్తుందన్నారు. అలా వెంటవెంటనే నీరు చేరుతుందంటే, అది క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాటికి సంబంధించి పరీక్షలూ, అవసరమైతే ప్లూరల్ బయాప్సీ చేయించండి.
డాక్టర్ ఎస్.ఎ.రఫీ
కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్,
హైదరాబాద్
పల్మునాలజీ కౌన్సెలింగ్
Published Fri, Jul 17 2015 10:34 PM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM
Advertisement
Advertisement