చెమటకాయల్లా కనిపిస్తున్నాయి... ఏం చేయాలి?
నా వయసు 28. నా పురుషాంగం మీద, వృషణాల మీద చిన్న చిన్న చెమటకాయల్లా వచ్చాయి. వాటి సైజ్ క్రమంగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించుకున్నాను. సబేషియస్ సిస్ట్స్ అని చెప్పి సర్జరీ చేయాలన్నారు. సర్జరీ చేయిస్తే ఇవి తగ్గుతాయా? అవి కనిపించినప్పట్నుంచి నాలో అంగస్తంభనలు కూడా లేవు. నేను పెళ్లి చేసుకోవచ్చా? భవిష్యత్తులో సంసారజీవితానికి పనికివస్తానా? తగిన సలహా ఇవ్వండి.
- బి.వి.ఆర్., అనంతపురం
వృషణాల మీద ఉన్న చర్మంపై తెల్లటి పచ్చటి రంగుల్లో బుడిపెల్లాగా వచ్చే వాటిని సబేషియస్ సిస్ట్స్ అంటారు. ఇవి పూర్తిగా చర్మం పైపొర నుంచే వస్తాయి. సబేషియస్ సిస్ట్స్‌తో పాటు ఆ కొద్దిపాటి చర్మాన్ని తీసివేస్తే అది పూర్తిగా నయమయినట్లే. కాకపోతే... ఇలాంటి వి చాలా ఉన్నప్పుడు వాటిననన్నింటినీ తొలగించాల్సి ఉంటుంది. ఎన్ని తొలగించినా - అది కేవలం చర్మం పైభాగం మాత్రమే కాబట్టి వృషణాలకు గాని, అంగస్తంభనలకు గాని, వీర్యం తయారీకి గాని ఈ సర్జరీతో ఏమాత్రం సంబంధం ఉండదు. కాకపోతే ఇవి మళ్లీ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మళ్లీ వాటిని తొలగించుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ తర్వాత మామూలుగానే సెక్స్ చేయవచ్చు. దీనికీ... పిల్లలు కలగడానికి ఏమాత్రం సంబంధం లేదు. మీరు నిర్భయంగా పెళ్లి చేసుకోవచ్చు. మీకు అంగస్తంభనలు లేకపోవడానికి కారణం కేవలం మానసికంగా కలిగిన జంకు మాత్రమే.
నాకు 25 ఏళ్లు. ఈమధ్యనే పెళ్లయ్యింది. ఈమధ్య ఒకసారి సెక్స్ చేశాక వీర్యంలో కొంచెం రక్తం వచ్చింది. ఆ తర్వాత ఒకసారి హస్తప్రయోగంలో కూడా రక్తం వచ్చింది. అయితే అంగస్తంభనలు బాగానే ఉంటున్నాయి. ఇలా వీర్యంలో రక్తం రావడానికి కారణం ఏమిటి? నాకు భయంగా ఉంది. తగిన సలహా ఇవ్వండి.
- ఎస్.ఆర్.డి., తాడేపల్లిగూడెం
మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీకిలా వీర్యంలో రక్తం రావడం పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి కాకపోవచ్చు. వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉన్నా, టీబీ ఉన్నా, వీర్యం వచ్చే మార్గంలో నీటిబుడగలు (సిస్ట్స్) ఉన్నా, ఏవైనా గడ్డలు ఉన్నా ఇలా వీర్యంతో పాటు రక్తం రావచ్చు. కాని ఎక్కువమందిలో ఇలా జరగడానికి ఏ కారణం కనిపించదు. చికిత్స చేసినా చేయకపోయినా ఈ పరిస్థితి దానంతట అదే తగ్గిపోవచ్చు. ఆందోళన పడాల్సిందేమీ లేదు. చాలావరకు అది నిరపాయకరమైన సమస్యే అవుతుంది. మీరు ఒకసారి యూరిన్ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని యూరాలజిస్ట్‌ను కలవండి.
-డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్
గర్భధారణ సమయంలో ఎందుకీ నీరసం..?
నాకు ఇప్పుడు ఐదో నెల. కాళ్లవాపులు కూడా కనిపిస్తున్నాయి. అదేమన్నా ప్రమాద హేతువా? గత కొంత కాలంగా ఏ చిన్నపని చేసినా అలసిపోతున్నాను. నా అలసట తగ్గడానికి ఏం చేయాలి?
- సునంద, చీపురుపల్లి
మీరు చెప్పిన లక్షణాలతో గతంలోనూ, ఇప్పుడూ మీకు రక్తహీనత (అనీమియా) ఉండవచ్చని తెలుస్తోంది. మనదేశంలో రక్తహీనత అన్నది గర్భవతుల్లో చాలా సాధారణం. రక్తహీనత అనే కండిషన్‌లో రక్తంలోని హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ తగ్గడం వల్ల కలుగుతుంది. రక్తంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే తొందరగా అలసిపోవడం, నిస్సత్తువగా ఉండటం, తలతిరుగుతున్నట్లు అనిపించడం, ఊపిరి ఆడకపోవడం, కాళ్లవాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో పేషెంట్‌కు సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) చేయించాలి. ఈ పరీక్ష ద్వారా రక్తహీనత తీవ్రతతో పాటు దానికి కారణం కూడా కొంతమేరకు తెలుస్తుంది.
సీబీపీని ఆధారంగా తీసుకుని తదుపరి పరీక్షలను నిర్ణయిస్తారు. ఇక చికిత్స విషయానికి వస్తే రక్తహీనత తీవ్రతను బట్టి, గర్భవతికి ఎన్నో నెల అన్న అంశాన్ని బట్టి... ఆమెకు ఐరన్ టాబ్లెట్లు ఇవ్వడం, ఇంజెక్షన్లను సూచించడం, అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించడం వంటివి చేయాల్సి ఉంటుంది. దాదాపు గర్భవతులందరిలోనూ రక్తం పలుచబారడం అన్నది చాలా సాధారణమైన అంశం కాబట్టి సాధారణంగా గర్భవతులందరికీ 16వ వారం ప్రెగ్నెన్సీ నుంచి 60 ఎం.జీ. ఐరన్ టాబ్లెట్లను సూచిస్తుంటాం. వాస్తవానికి వీటిని పరగడుపున తీసుకుంటే బాగా రక్తం పడుతుంది.
అయితే చాలామందికి ఇలా తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే మొదట కాస్త టిఫిన్ తిన్నాక... గంటసేపటి తర్వాత ఐరన్ టాబ్లెట్ తీసుకుని, నిమ్మరసం వంటివి తాగాలని సూచిస్తుంటాం. దీంతో రక్తం బాగాపడుతుంది. ఇక మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ డాక్టర్‌ను సంప్రదించి, ఒకసారి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్ష చేయించుకుని, రక్తహీనతకు కారణాన్ని తెలుసుకుంటే, దాన్ని బట్టి తగిన చికిత్స తీసుకోండి. ఇక రక్తహీనత నివారణ కోసం... మాంసాహారం తినేవారైతే మాంసం, కాలేయం, చేపలు... శాకాహారం తినేవారైతే ఆకుకూరలు, ఖర్జూరం, బెల్లంతో చేసిన పదార్థాలు తినాలి. దాంతో రక్తం బాగా పడుతుంది.
డాక్టర్ సుశీల వావిలాల
ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్,
ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్