మందంగా... అందంగా!
‘అమ్మా! ఈ జీన్స్ ప్యాంటు ఇక వేసుకోను, ఒక్కసారికని తమ్ముడికిస్తే వాడు ప్యాంటు అంచులు చించేశాడు’ అనే కంప్లయింట్ కూతురి నుంచి. ‘అక్క ప్యాంటు పొడవుగా ఉంది, ఆడుకునేటప్పుడు అంచులు నేలకు తాకి నలిగిపోయింది నేనేం చేయను’ తన పొరపాటేమీ లేదన్నంత అమాయకంగా వస్తుంది కొడుకు నుంచి జవాబు. ‘సరే! ఇక చేసేదేముంది... ఆ ప్యాంటు అంచులు కత్తిరించి మడిచి కుట్టిస్తే సరి, ఈసారి పండక్కి తమ్ముడికి ప్యాంటు కొనక్కర్లేదు’ ఈ సమాధానంతో కూతురి ముఖం వెలిగిపోతుంది, కొడుకు ముఖం ఉక్రోషంతో ఎర్రబడుతుంది. కొంచెం అటూ యిటూగా ప్రతి ఇంట్లో ఇలాంటి సీన్లు ఉండనే ఉంటాయి.
పుట్టినరోజులు, పండుగలు ఇలా పిల్లలకు ఏడాదికి కనీసం నాలుగు నుంచి ఆరు జతలు తప్పనిసరిగా కొనక తప్పదు. వార్డ్‌రోబ్ నిండా లెక్కలేనన్ని డెనిమ్ క్లాత్ ప్యాంట్లు, షర్టులు చేరుతుంటాయి. పిల్లలు పైకి చెప్పరు కానీ లోలోపల ‘వీటిని వదిలించుకోవడం ఎలా’ అనుకుంటుంటారు. ‘జీన్స్ ప్యాంట్లు అన్ని షేడ్‌లలోనూ ఉన్నాయి. ఈ సారి బర్త్‌డేకి ఏ షేడ్ కొనుక్కోవాలి’ అనేది వాళ్లకో మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి సమాధానంగా ఒక్కో ప్యాంటుని తీసి కత్తిరించి ముక్కలు చేయండి... ఆ ముక్కలను కలిపి ఇక్కడ ఫొటోల్లో ఉన్నట్లు కుట్టండి. దానికి అంచుగా మెత్తటి క్లాత్‌తో బోర్డర్ కుట్టండి. దట్టమైన క్విల్ట్ (బొంత) రెడీ అవుతుంది. పైగా వచ్చేది చలికాలం కూడ. చక్కగా ఉపయోగపడుతుంది.
డెనిమ్ క్లాత్ మందంగా ఉంటుంది కాబట్టి వలయాకారపు డిజైన్ల జోలికి పోవద్దు. డెనిమ్ క్లాత్‌ని నలుచదరంగా కానీ దీర్ఘచతురస్రంగా కానీ కత్తిరించుకుంటే కుట్టడం సులువు. క్విల్ట్ ఆకర్షణీయంగా ఉండాలంటే రంగురంగుల క్లాత్‌ని పువ్వుల్లా కత్తిరించి ప్యాచ్ వర్క్ చేసుకోవచ్చు.