నిజం గడపదాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగొస్తుందట!చలనం చెప్పులేసుకొనే లోపలే సంచలనం భూభ్రమణం చేసేస్తుందట!న్యాయానికి కళ్లుండవు... మీడియాకు కళ్లెం ఉండదు!న్యాయం ్రçప్రభవించే లోపలే నిందితుడు నేరస్థుడైపోతాడు!జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్...చివరకు జైలు నుంచి మనిషిని బయటకు తేవచ్చు కానిమనిషిలోంచి జైలును బయటకు తేలేం కదా!సమాజం ఇచ్చే బ్రేకింగ్ తీర్పులో ఉండే క్రైమ్...క్రిమినల్ జస్టిస్!!
ఆదిత్య శర్మ.. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యి.. ఏంబీఏకు ప్రిపేర్ అవుతున్న మధ్యతరగతి యువకుడు. ఫుట్‌బాల్ ప్లేయర్. అమ్మా, నాన్న, అక్క, బావ.. అతని కుటుంబం. అమ్మ, నాన్న కిరాణా షాప్ నడిపిస్తుంటారు. అక్క స్టార్ హోటల్‌లో ఫ్రంటాఫీస్ ఎంప్లాయ్. బావ.. బ్యాంక్ లోన్‌తో కారు కొనుక్కొని క్యాబ్ రన్ చేస్తుంటాడు.
ఆ రోజు..
ఆదిత్యశర్మ వాళ్ల జట్టు ఫుట్‌బాల్ మ్యాచ్ గెలుస్తుంది. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ రాత్రి పార్టీ చేసుకోవాలనుకుంటారు. ఆ రోజే ఆదిత్య వాళ్ల అక్క పెళ్లిరోజు. ఆమె ప్రెగ్నెంట్ అనే శుభవార్తా తెలుస్తుంది ఆదిత్యకు. ఆ సంతోషంతోనే రెడీ అయ్యి పార్టీకి వెళ్లబోతున్న ఆదిత్యను ‘‘నీ పార్టీకి ఇంకా టైమ్ ఉంది కదా.. రెండుమూడు రైడ్స్ చేసి పార్టీకి వెళ్లవా?’’ అంటూ బతిమాలుతుంది అక్క. కాదనలేక సరే అని రైడ్‌కి వెళ్తాడు.
ఆ రాత్రి..
రైడ్స్ కంప్లీట్ చేసేసి పార్టీకి టర్న్ అవుతూండగా పొరపాటున ఇంకో రైడ్ యాక్సెప్ట్ చేస్తాడు ఆదిత్య. పికప్ చేసుకోలేను రైడ్ క్యాన్సల్ చేయమని ఆ ప్యాసెంజర్‌ని రిక్వెస్ట్ చేసి పక్కనే ఉన్న మెడికల్‌షాప్‌కి వెళ్తాడు. వచ్చేటప్పటికి వెనకసీట్లో ఓ అమ్మాయి కూర్చుని ఉంటుంది. ఆమె పేరు సనాయా. ఆశ్చర్చపోయి ‘‘ఎవరు మీరు’’ అని అడుగుతాడు. ఇందాక రైడ్ బుక్ చేసింది తనే అని చెప్తుంది ఆమె. క్యాన్సిల్ చేయమన్నాను కదా అని ఆదిత్య అంటున్నా వినకుండా డెస్టినేషన్‌లో డ్రాప్ చేయమని దబాయిస్తుంది. కార్లో వెళ్తున్నంత సేపూ టెన్షన్‌గా ఫోన్‌లో అరుస్తూ.. మాటిమాటికి డెస్టినేషన్స్ మారుస్తూ ఆదిత్యకు చిరాకు తెప్పిస్తుంది. అయినా ఓపిగ్గానే∙ గమ్యానికి చేరుస్తాడు. దిగకుండా అక్కడి నుంచి మళ్లీ ఇంకో డెస్టినేషన్ సెట్ చేస్తుంది. తీసుకెళ్లకపోతే కంప్లయింట్ చేస్తానని బెదిరిస్తుంది.
కామ్‌గా ఆమె చెప్పిన అడ్రస్‌కు డ్రైవ్ చేస్తాడు. టెన్షన్ తగ్గి నార్మల్ అయ్యాక అతనితో మాట కలుపుతుంది. అతనిని ఇబ్బంది పెట్టినందుకు నొచ్చుకుంటుంది. గమ్యం వచ్చాక థ్యాంక్స్ చెప్పి దిగి వెళ్లిపోతుంది ఆమె. ఆదిత్య కూడా పార్టీకి చేరుకోవాలనే తొందరలో కారు స్పీడ్ పెంచుతాడు. ఓ స్పీడ్ బ్రేకర్ దగ్గర వెనక సీట్లోంచి ఏదో కిందపడ్డ చప్పుడు వినపడి చూస్తాడు. ఫోన్ కనపడుతుంది. రివర్స్ చేసుకొని మళ్లీ ఆమె ఇంటికి వెళ్లి ఫోన్ ఇస్తాడు. లోపలికి రండి అంటూ ఇన్‌సిస్ట్ చేస్తుంది. తటపటాయిస్తూనే వెళ్తాడు ఆదిత్య. త్వరగానే మచ్చికవుతారు. డ్రింక్స్ తీసుకుంటారు. వంటింట్లో కూరగాయల కత్తితో ఆమె ఓ ఆట నేర్పిస్తుంది అతనికి. ఆ ఆటలో గురి తప్పి ఆమెకు గాయం చేస్తాడు అతను. గాబరాపడ్తాడు. బాధపడ్తాడు. చనువు పెరుగుతుంది. ఇద్దరూ బెడ్‌రూమ్‌లోకి వెళ్తారు. మత్తు వదిలి మెలకువ వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటాడు ఆదిత్య. అప్పటికే మధ్య రాత్రి దాటుంటుంది.
గబగబా బట్టలు వేసుకొని బెడ్‌రూమ్‌లోకి వెళ్తాడు. వీడ్కోలు చెబ్దామని ఆమెను కదపబోతుంటే వీపు మీద విచక్షణారహితంగా పొడిచిన కత్తిగాట్లతో రక్తం మడుగులో ఉంటుంది. భయంతో అక్కడి నుంచి పారిపోబోతూ అంతకుముందు ఆడుకున్న కత్తిని కడిగి జర్కిన్‌లో పెట్టుకుంటాడు. నేల మీద తనకు కనిపించిన రక్తపు మరకల్నీ శుభ్రం చేసి కిందకు పరిగెడ్తాడు. ఆ కంగారులో పార్కింగ్‌లో కార్ కీ పడిపోతుంది. గమనించుకోకుండా కార్ దగ్గరకు వెళ్లి డోర్ లాగుతాడు. సెన్సార్ మోగుతుంది. ఆ చప్పుడికి పక్కింటి వ్యక్తి కిటికీలోంచి ఆదిత్యను చూస్తాడు. ఆదిత్య మళ్లీ వెనక్కి వచ్చి పార్కింగ్‌లో కీ తీసుకొని కార్లో వెళ్లిపోతాడు. ఆ కంగారులో యాక్సిడెంట్ చేస్తాడు. పోలీసులొచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ కింద స్టేషన్లో కూర్చోబెడ్తారు. ఈలోపు ఆదిత్యను చూసిన పక్కింటి వ్యక్తి పోలీసులకు సమాచారం ఇస్తాడు మర్డర్ అయిందని.
తర్వాత?
పోలీస్ ఎంక్వయిరీలో భాగంగా స్టేషన్‌కు వచ్చిన ఆ పక్కింటి వ్యక్తి అక్కడ ఆదిత్యను చూసి హత్య చేసింది అతనే అని పోలీసులకు చెప్తాడు. ఆదిత్యను తనిఖీ చేసిన పోలీసులకు అతని దగ్గర కత్తి దొరుకుతుంది. కేస్ నమోదవుతుంది.
మీడియా ఎంట్రెన్స్
రైడ్ మొదలు అతను ఆమె ఇంటికి వెళ్లడం, క్రైమ్ సీన్.. కత్తి.. అన్నీ ఆదిత్యను నేరస్థుడిగా చూపిస్తుంటాయి. డ్రింక్స్ తీసుకుని బెడ్‌రూమ్‌కి వెళ్లిన తను మెలకువ వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర ఎలా ఉన్నాడో? ఆ గ్యాప్‌లో ఏం జరిగిందో ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాదు. ఆ రాత్రి ‘‘డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ కోసం సబ్ ఇన్‌స్పెక్టర్ నామ్‌దేవ్ పిలిస్తే వచ్చిన మాధవ్ మిశ్రా అనే లాయర్.. అది మర్డర్ కేస్‌గా టర్న్ అయ్యాక ఆదిత్య తరపున వాదించాలనుకుంటాడు. ఆదిత్యకు పరిచయం చేసుకొని కేస్ టేకప్ చేస్తానని భరోసా కూడా ఇస్తాడు. కొడుకు మర్డర్ కేస్‌లో ఇరుక్కొనేసరికి కుప్పకూలి పోయిన ఆదిత్య తల్లిదండ్రులు, సోదరికీ ధైర్యం చెప్తాడు మాధవ్. ఈలోపు మీడియా సంచలనం చేయడం మొదలుపెడ్తుంది.
క్యాబ్‌డ్రైవర్ ఓ లేడీ ప్యాసెంజర్‌ను రేప్ చేసి, దారుణంగా చంపాడంటూ కథనాలు.. మానసిక విశ్లేషకులతో ప్యానల్ డిస్కషన్స్‌తో. ఇవి చూసిన క్యాబ్ కంపెనీ తమ క్రెడిబిలిటీ కాపాడుకోవడానికి ఇందినా మథుర్ అనే పేరున్న లాయర్‌ను హైర్ చేసుకొని ఆదిత్య తరపున వాదించడానికి పంపిస్తుంది. అయితే ఆదిత్యకు బెయిల్ నిరాకరిస్తుంది కోర్ట్. మాధవ్ మిశ్రాకు మాత్రం ఆదిత్య ఎరక్కపోయి ఇరుక్కున్న అమాయకుడిగానే కనిపిస్తూంటాడు. ఆ దిశగానే ఆ కేస్ పరిశోధనలో పడ్తాడు అతను. కాని ఆదిత్యే నేరస్థుడని నిర్ధారణకు వచ్చేసిన ఇన్‌స్పెక్టర్‌కు మాధవ్ ఎంక్వయిరీ అంతా దోషిని విడిపించే ట్రయల్‌గా తోస్తుంది. అదేం లెక్క చేయక ఎస్‌ఐ నామ్‌దేవ్‌కి లంచం ఇస్తూ పరిశోధన సాగిస్తూనే ఉంటాడు మాధవ్.
అక్కను.. అమ్మను..
ఆదిత్య కేసు వాదనలను వింటున్న మహిళా జడ్జి నేరం రుజువు కానిదే ఆదిత్యను దోషి అనడాన్ని ఖండిస్తూ ఉంటే మీడియా మాత్రం తన ప్రసారాల్లో ఆదిత్యను నేరస్థుడిగానే ప్రచారం చేస్తూంటుంది. ఆదిత్య సోదరిని, తల్లిని మిస్ లీడ్ చేసి.. ఎడిటింగ్ గిమ్మిక్కులతో వాళ్లతోనే అతనిని అపరాధిగా చెప్పిస్తుంది. దీనివల్ల ఆ కుటుంబం వీధికెక్కుతుంది.
జైల్లో..
దొమ్మీలు, గ్యాంగ్ వార్స్, డ్రగ్స్, సెల్ ఫోన్ల స్మగ్లింగ్స్‌తో అండర్ వరల్డ్‌ను తలపిస్తున్న జైలును చూసి షాక్ అవుతాడు ఆదిత్య. ముస్తఫా, లాయక్ అనే ఇద్దరు కరడు గట్టిన ఖైదీల మధ్య శాండ్‌విచ్ అవుతాడు. ఆ జైల్ ముస్తఫా ఆధిపత్యంలో ఉంటుంది. అయిదు లక్షలు ఇస్తే లాయక్ నుంచి రక్షణ కల్పిస్తానని చెప్తాడు ముస్తఫా. అతనిచ్చిన ఫోన్‌తోనే వాళ్లక్కకు కాల్‌చేసి అయిదు లక్షలు సర్దమంటాడు ఆదిత్య. భర్తకు తెలియకుండా అయిదు లక్షలు పంపుతుంది ఆమె. కార్ ఈఎమ్‌ఐలు కట్టకుండా తమ్ముడికి డబ్బు సర్దిందని తెలిసీ ఆమెతో గొడవపెట్టుకుంటాడు భర్త. తమ్ముడు మర్డరర్, అక్క దొంగ అంటూ నిందలేస్తాడు. ఇటు జైల్లో ఆదిత్యకు బాసటగా ఉంటూనే అతని చేత డ్రగ్స్‌ను స్మగుల్ చేయిస్తుంటాడు ముస్తఫా. ఈ విషయాన్ని మాధవ్ పసిగట్టి జాగ్రత్త అంటూ ఆదిత్యను హెచ్చరిస్తాడు.
యావజ్జీవ కారాగారం..
ఇందిరా మాథుర్ తన వాదనతో ఆదిత్య రేప్ చేయలేదని మాత్రం నిరూపించగలుగుతుంది కాని హత్య చేయలేదనడానికి కావల్సిన సాక్ష్యాలను సంపాదించలేకపోతుంది. అవి కూడా మాధవ్ మిశ్రా సంపాదించినవే. నిర్దోషి అని రుజువు చేయడానికి ఆధారాల్లేవ్ కాబట్టి గిల్టీగా ఒప్పుకోమని ఆదిత్య మీద ఒత్తిడి తెస్తుంది ఇందిరా. అంతకుముందే పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో ఒప్పందానికి వచ్చి. సందిగ్ధంలో పడ్తాడు ఆదిత్య. ఇందిర అసిస్టెంట్ సలహా మేరకు నాట్ గిల్టీ అనే చెప్తాడు జడ్జి ముందు.
ఆ నిర్ణయానికి కోపం తెచ్చుకున్న ఇందిర ఆ కేస్‌ను తప్పుకొని అసిస్టెంట్‌కు ఇస్తుంది. మాధవ్ మిశ్రా సలహా, సహకారంతో కేస్ టేకప్ చేస్తుంది కాని ఓడిపోతుంది ఆ అసిస్టెంట్. హత్యానేరం కింద ఆదిత్యకు యావజ్జీవిత కారాగార శిక్ష పడ్తుంది. ఆ తీర్పు రోజే వాళ్లక్క డెలివరీ అవుతుంది. మగపిల్లాడు పుడతాడు. మరోవైపు జైలు వాసం తప్పదని తెలిసిన ఆదిత్య దానికి అలవాటు పడిపోతాడు. ముస్తఫాకు రైట్ హ్యాండ్‌గా మారుతాడు. లాయక్ పీచమణిచే నాయకుడిగా ఎదుగుతాడు.
అసలు నేరస్థులు..
ఇంకోవైపు చనిపోయిన సనయా గురించి ఆరా తీస్తుంటే చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్తుంటాయి మాధవ్ మిశ్రాకు. ఒకప్పుడు సనాయా డ్రగ్ ఎడిక్ట్. తన సవతి తండ్రి స్నేహితుడు నడిపే డీ ఎడిక్షన్ సెంటర్‌లో చేరి ఆరోగ్యవంతురాలవుతుంది. తర్వాత న్యూయార్క్ వెళ్తుంది. కొన్నాళ్లకు తిరిగొచ్చి ఆ డీ ఎడిక్షన్ సెంటర్‌లోనే వలంటీర్‌గా చేరుతుంది. స్లమ్స్‌లోని పిల్లలకూ ఆ సెంటర్ ఫ్రీ ట్రీట్‌మెంట్.. చదువు.. బట్టలు ఇప్పిస్తూంటుంది. ఆ పిల్లల పట్ల సనాయా చాలా శ్రద్ధ తీసుకుంటూంటుంది. అయితే ఆమె హత్య జరిగేకంటే కొన్ని గంటల ముందు ఆ సెంటర్‌కు సంబంధించి ఓ ఘోరమైన నిజం తెలుస్తుంది ఆమెకు.. ఆ పిల్లలతో తన తండ్రి స్నేహితుడు చైల్డ్ ప్రాస్టిట్యూషన్ చేయిస్తున్నాడని. హతాశురాలై ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. ఆ నిర్వాహకుడిని బెదిరిస్తుంది.
ఆ నిర్వాహకుడి భార్య కూడా సెంటర్ నిర్వహణలో భాగస్వామే. సనాయాకు నిజం తెలిసిందని ఆమెకూ అర్థమవుతుంది. ఇదంతా మాధవ్ మిశ్రా ఆరా తీస్తాడు. వీటితో కేస్‌ను అనఫీషియల్‌గా రీ ఓపెన్ చేయమని ఇన్‌స్పెక్టర్‌ను కోరుతాడు. కన్విన్స్ అయిన ఇన్‌స్పెక్టర్ ఓకే అంటాడు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్, క్రైమ్ సీన్ ఎవిడెన్సెస్ రీ చెక్ చేస్తారు. చైల్డ్ ప్రాస్టిట్యూషన్ ఎలిగేషన్ మీద ఆ ఇద్దరినీ స్టేషన్‌కు రప్పించి ఇంటారగేషన్ చేస్తాడు. సనాయాను చంపింది తనే అని ఒప్పుకుటుంది డీ ఎడిక్షన్ సెంటర్ ఓనర్ భార్య. అంటే సనాయా సవతి తండ్రి స్నేహితుడి భార్య. నిర్దోషిగా విడుదలవుతాడు ఆదిత్య. మాధవ్ మిశ్రాగా పంకజ్ త్రిపాఠి, ఆదిత్యగా విక్రాంత్ మస్సే, ఇందిరా మాథుర్‌గా మీతా వశిష్ట్, ముస్తఫాగా జాకీ ష్రాఫ్ నటించారు.
సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment