కోటీ పడగలరా?
కోట్లకు పడగలెత్తిన ఈ మహిళలతో మగవాళ్లు పోటీపడగలరా?
మహిళల్ని ‘ఆకాశంలో సగం’ అంటారు. మరి అవకాశాల్లో? సగంలో సగం, ఆ సగంలో సగమైనా మహిళలకు అందుబాటులో లేవు. అయినప్పటికీ అందివచ్చిన అవకాశాలతోనే తమ సత్తాను చాటుకుంటున్నారు మహిళలు. భర్త సంపాదనను కుటుంబఅవసరాలకు అనుగుణంగా సర్దడమే కాదు... అవసరమైన చోట ఆ సంపాదనా బాధ్యతనూ తీసుకుంటున్నారు. ఇంటి నిర్వహణలో తమ సాటి లేదని ఎలా నిరూపించుకుంటున్నారో... పెద్ద పెద్ద వ్యాపారాల్లోనూ తమకు పోటీ లేని సమర్థులుగా నిలుస్తున్నారు. ఆ నైపుణ్యం ఇవాళ ఎంతోమంది మహిళామణులను భారీ శాలరీ అందుకుంటున్న వారి జాబితాలో చేర్చింది.
సాధారణంగా.. పెద్ద హోదాలో ఉన్న వారి జీతాలను ఏడాదికి లెక్కేస్తారు. పురుషులతో పోలిస్తే సాధారణ హోదాలలో స్త్రీల జీతభత్యాలు కొంత తక్కువగానే ఉన్నప్పటికీ, అత్యున్నత స్థాయిలో... పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలుగా, సీఎండీలుగా, చైర్‌పర్సన్లుగా భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నారు. వివిధ బిజినెస్ జర్నల్స్, మ్యాగజీన్స్ జరిపిన సర్వేలను బట్టి అత్యధిక మొత్తంలో డబ్బు సంపాదిస్తున్న తొలి పది మంది భారతీయ మహిళల జీతాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో మీరే చూడండి. (గత ఆర్థిక సంవత్సరాన్ని అనుసరించి).
కావేరీ కళానిధి
మీడియా టైకూన్ కళానిధి మారన్ భార్య. జీతం రు.59 కోట్ల 89 లక్షలు. నిజానికి ఇది తగ్గిన జీతం. అంతకుముందు ఏడాది కావేరి పే ప్యాకెట్ 72 కోట్ల రూపాయలు. సన్ గ్రూపులోనే కాకుండా స్పైస్ జెట్ లిమిటెడ్ చైర్మన్‌గా, ఆ సంస్థకే నాన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా కావేరి పని చేస్తున్నారు.
రేణు సూద్ కర్నాడ్
హెచ్.డి.ఎఫ్.సి. మేనేజింగ్ డెరైక్టర్. ప్రాడక్ట్ డెవలప్‌మెంట్, స్ట్రాటెజీ, బడ్జెడ్ అంశాలలో ఆమె కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్య రంగ వ్యవహారాలలో నిపుణురాలిగా ప్రఖ్యాతిగాంచారు. జీతం రూ.7,16,19,159
ఉర్వి ఎ పిరమల్
అశోక్ పిరమల్ గ్రూపు చైర్‌పర్సన్. 32 ఏళ్ల వయసులో 1948 లో ఊర్వి తమ కుటుంబ వ్యాపారంలోకి వచ్చారు. వ్యాపార విభజన తర్వాత తనకు, తన కొడుకులకు వాటాగా వచ్చిన డయింగ్ టెక్స్‌టైల్ మిల్లును, రెండు ఇంజినీరింగ్ కంపెనీల బాధ్యతలను స్వీకరించారు. ఆమె జీతం రూ.7,03,00,000.
చందా కొచ్చర్
ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకు ఎండీ, సీఈవో. పదేళ్లుగా ఫోర్బ్స్ ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్’ లిస్టులో ఉంటున్నారు. ఇండియాలోని రిటైల్ బ్యాంకింగ్ సెక్టారును చక్కగా మలచడంలో చందా విశేషమైన పాత్ర పోషించారు. ఐ.సి.ఐ.సి.ఐ. అభివృద్ధిలో కూడా ఆమెదైన ముద్ర కనిపిస్తుంది. కొచ్చర్ జీతం రూ.5,22,82,644.
సునీతారెడ్డి
అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్. ఆర్థిక వ్యవహారాలలో దిట్ట. ప్రపంచబ్యాంకు ప్రశంసించే విధంగా ‘అపోలో రీచ్ హాస్పిటల్స్ మోడల్’కు నేతృత్వం వహించారు. ఆమె జీతం రూ. 5,18,40,000
ప్రీతారెడ్డి
అపోలో హాస్పిటల్ ఎంటర్‌ప్రైజస్ మేనేజింగ్ డెరైక్టర్. హెల్త్ కేర్ రంగంలో సారథ్య సంస్థగా అపోలోను నడిపిస్తున్నారు. అపోలో, భారత ప్రభుత్వం కలిసి సంయుక్తంగా ఆరోగ్య సేవలను అందించేందుకు గాను ‘నేషనల్ అక్రెడిషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్’ (ఎన్.ఎ.బి.హెచ్) ను ఏర్పాటు చేశాయి. ప్రీతారెడ్డి జీతం రూ. 5,11,10,000.
వినీతా సింఘానియా
జె.కె.లక్ష్మి సిమెంట్ మేనేజింగ్ డెరైక్టర్. సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తొలి మహిళా అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. భర్త శ్రీపతి సింఘానియా హఠాన్మరణంతో ఆమె 1998లో బిజినెస్‌లోకి వచ్చారు. వినీత నేతృత్వంలో కంపెనీ లాభాల బాటలో నడిచింది. బాధ్యతలు స్వీకరించిన ఐదేళ్లలోనే కంపెనీ టర్నోవర్‌ను ఆమె 100 నుంచి 450 కోట్లకు పెంచగలిగారు! వినీత జీతం రూ.4,39,73,000.
వినీతా బాలి
బ్రిటానియా ఇండస్ట్రీస్ సీఈవో. టాప్ 50 బిజినెస్ ఉమెన్‌లో ఒకరిగా నిలిచారు. ఫోర్బ్స్ లీడర్‌షిప్ అవార్డును పొందారు. ఆమె జీతం రూ. 4,10,83,742
శోభనా భార్తియా
రాజ్యసభ మాజీ సభ్యురాలు. ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ గ్రూపు చైర్ పర్సన్, ఎడిటోరియల్ డెరైక్టర్. తండ్రి కె.కె.బిర్లా నుండి ఆమె ఈ వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించారు. ఆ సమయంలో పెద్దగా లాభాల్లో లేని ఆ సంస్థను శోభన తన సామర్థ్యంతో లాభాల్లోకి తెచ్చారు. ఆమె జీతం రూ. 2,68,80,000.
కిరణ్ మజుందార్ షా
బయోకాన్ లిమిటెడ్ సీఎండీ. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతులైన తొలి వంద మంది మహిళల్లో షా ఒకరు. విజ్ఞాన, రసాయన శాస్త్ర రంగాలలో విశిష్టమైన సేవలు అందించినందుకు షా ‘ఓత్మర్ గోల్డ్ మెడల్’ ను కూడా పొందారు. ఫోర్బ్స్ మ్యాగజీన్ అయితే తనకు తానుగా సంపన్నురాలిగా ఎదిగిన మహిళ అని షాను కీర్తించింది. ఈమె జీతం రూ. 1,63,47,463.