
పండు కూర అయ్యింది...
తిండి గోల
ప్రపంచ ఆరోగ్యప్రదాయిని ఎవరు అంటే ఠకీమని చెప్పే ఒకే ఒక పేరు టొమాటో. ప్రపంచం మొత్తమ్మీద విస్తృతంగా వాడే కూరగాయ ఏంటీ అంటే వినిపించే పేరు టొమాటో. ఏ కూరగాయ లేకున్నా ఆ రోజుకు సర్దుబాటు చేసుకోవచ్చేమో కానీ, టొమాటో లేకుండా మాత్రం అస్సలు కుదరదు. నిజానికి టొమాటో పండుజాతికి చెందింది. కానీ, వంటకాలలో వాడటంతో అది కాస్తా కూరగాయల జాబితాలో చేరిపోయింది. దీని పుట్టినిల్లు అమెరికా. కానీ, మెక్సికో ప్రజలే ముందుగా టొమాటోను వాడుకలోకి తెచ్చారు. మొదట్లో అమెరికన్లు టొమాటో విషపూరితమని, తింటే చనిపోతారని భయపడేవారట.
ప్రపంచ యాత్రికుడైన క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికా ఖండాన్ని కనుగొన్నప్పుడు టొమాటో యూరప్ దేశాలకు పరిచయమైంది. స్పానిష్‌లో 1493లోనే టొమాటో ఉన్నట్టు చారిత్రాక ఆధారాలున్నాయి. టొమాటోలో ఔషద గుణాలు ఉన్నట్టు 1544లో యూరప్ సాహిత్యకారుడు ఇటాలియన్ జీవశాస్త్రవేత్త పీట్రోఆండ్రే మటియోలి తన రచనలలో వివరించారు. యూరప్ దేశాలలో ఎర్రని టొమాటోను కొద్దిగా ఉడికించి, ఉప్పు, మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్ చల్లుకొని తింటుంటారు. దీనిని ‘గోల్డెన్ యాపిల్’ గా అభివర్ణిస్తారు. 17 శతాబ్దం చివరిలో 18వ శతాబ్దం మొదట్లో బ్రిటన్‌లో అడుగుపెట్టిన టొమాటో మన దేశంలోనూ ఆనాటి నుంచే టేబుల్ మీద అందంగా ముస్తాబైంది.