జస్పాల్ భట్టీ :80–90ల కాలంలో దూరదర్శన్ చూసేవారికి జస్పాల్ భట్టీ పరిచయమే. అమృతసర్ వాసి అయిన జస్పాల్ ‘కింగ్ ఆఫ్ కామెడీగా, కింగ్ ఆఫ్ సెటైర్’గా పేరొందారు. ‘ఫ్లాప్ షో’ తో పాటు ‘ఉల్టా పల్టా’, ‘ఫుల్ టెన్షన్’ లోనూ జస్పాల్ నటించి మెప్పించారు. వ్యంగ్య, హాస్య నటుడు, రచయిత, దర్శకుడు అయిన జస్పాల్ 2012లో మరణించారు. జస్పాల్ మరణించిన ఏడాదికి పద్మభూషణ్ అవార్డ్, అత్యున్నత పౌరపురస్కారాలతో భారత ప్రభుత్వం జస్పాల్‌ని గౌరవించింది. ఇవన్నీ చదువుతుంటే ఇప్పటికీ ఇలాంటి ఎన్నో సంఘటనలు మనమధ్యే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇందులో కొన్ని మనం ఫేస్ చేసినవే అయుంటాయి. ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచే ఈ స్ట్రాంగ్ కథనాలను 80ల కాలంలోనే దూరదర్శన్ ప్రేక్షకుడి కళ్లకు కట్టింది. ‘ఫ్లాప్ షో’ హిట్ ఫార్ములాగా ప్రజల మనసులను గెలుచుకుంది.– ఎన్.ఆర్
ఓ గవర్నమెంట్ డాక్టర్.. పేషంట్‌కి ఆపరేషన్ చేసి కత్తిని అతని కడుపులోనే మరిచిపోతాడు.
ఓ ప్రొఫెసర్..తను చెప్పింది వినకపోతే విద్యార్థిని ఎంతకాలమైనా పాస్ చేయడు.
ఓ అధికారి..చేయి తడపకపోతే ఫైల్ పైన సంతకం చేయనే చేయడు..ఇవన్నీ మనదేశంలో ఎప్పుడూ తాజాగా వినిపించే వార్తలు. గవర్నమెంటు ఆఫీసులలో ఉద్యోగులు, కళాశాలలో ప్రొఫెసర్లు, ఆసుపత్రులలో డాక్టర్లు, పెద్ద పెద్ద ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టే కాంట్రాక్టర్లు.. ఇలా ప్రభుత్వ ఉన్నతఅధికారుల నిర్లక్ష్య ధోరణిని వ్యంగ్యాత్మకంగా ఎండగట్టిన మొట్టమొదటి సీరియల్ ‘ఫ్లాప్ షో.’ ఈ దేశంలో సామాన్యుడు సామాజిక సమస్యలను ఏ విధంగా ఎదుర్కొంటున్నాడో కళ్లకు కట్టిన షో కూడా ఇదే. పదే పది ఎపిసోడ్స్ అయినా పదికాలాల పాటు అందరి మదిలో నిలిచిపోయిన ‘ఫ్లాప్ షో’ని దూరదర్శన్ 1989లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి పెద్ద సాహసమే చేసింది. బుల్లితెర చేసిన ఈ ఆలోచన ప్రేక్షకుడి మదిని తట్టిలేపింది. ‘ఫ్లాప్ షో’ని కాస్తా హిట్ షోగా మార్చింది. ఈ వ్యంగ్య హాస్య సీరియల్‌కి మూలకర్త ఇండియన్ టెలివిజన్ పరిశ్రమలో ప్రముఖుడిగా పేరొందిన జస్పాల్ భట్టి.
ప్రభుత్వ యంత్రాంగ తీరుతెన్నులను వ్యంగ్యంగా చూపుతూనే వారు సమయాన్ని, డబ్బును ఎలా దుర్వినియోగం చేస్తుంటారో ఈ సీరియల్ ద్వారా ప్రజలకు తెలిసేలా పూనుకున్నారు జస్పాల్. మొత్తం పది ఎపిసోడ్లు. ప్రతీ ఎపిసోడ్ లో ఓ ప్రభుత్వ అధికారి కుట్రపూరిత చర్యలు, నిర్లక్ష్యంతో కూడిన కథనం ఉంటుంది. ఈ సీరియల్‌కి దర్శకుడు, రచయిత మాత్రమే కాదు ఇందులోని ప్రధాన పాత్రధారి కూడా జస్పాల్ భట్టీయే. జస్పాల్ భార్యా సవితా భట్టి ఈ సీరియల్‌లో నటించడడమే కాకుండా నిర్మాతగానూ ఉన్నారు.
తప్పిపోయిన కుక్క
తప్పిపోయిన తన పెంపుడు కుక్కను వెతకడానికి ఓ అధికారి ప్రభుత్వ వనరులను వాడుకున్న విధం, అతని వృధా ఖర్చును ఈ షోలో చూపించడం విశేషం.
నకిలీ మెడికల్ బిల్స్‌తో బురిడీ
ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ కింద నగదు మొత్తం చెల్లిస్తుంది. దీని కోసం వీరు నకిలీ పత్రాలను సృష్టిస్తారనే వాదనను వ్యంగ్యాత్మకంగా తీసుకున్నారు జస్పాల్ భట్టి. ఇందులో జస్పాల్ గవర్నమెంట్ ఆఫీసర్. జస్పాల్ స్నేహితుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరుతాడు. అతని మెడికల్ బిల్స్‌తో జస్పాల్ రీయింబర్స్‌మెంట్ కోసం నకిలీ పత్రాలను సృష్టిస్తాడు. అయితే, చికిత్స పొందుతూ జస్పాల్ స్నేహితుడు చనిపోతాడు. దీంతో అంతా జస్పాల్ చనిపోయినట్టు భావిస్తారు. హాస్యంగా భావించినా ఇందులోని వాస్తవాన్ని అంతా గుర్తించారు.
కాంట్రాక్టర్ల ఆస్తులు
రియల్ ఎస్టేట్ యజమానుల కష్టాలన్నీ డబ్బు చుట్టూతా తిరుగుతూ ఉంటాయి. రకరకాల వెంచర్ల పేరుతో కొత్త కొత్త స్కీములు సృష్టించడం వాటిలో ప్రజలను ఇరికించడం.. ఏ విధంగా ఉంటాయో వ్యంగ్యాత్మకంగా తీసుకున్నారు ఈ ఎపిసోడ్‌లో. ఇతరులకు చెందిన ఆస్తులను కబ్జా చేయడం, వారు సృష్టించే కొన్ని వంచక పథకాలను ఈ ఎపిసోడ్ హైలైట్ చేసింది. అంతేకాదు నాణ్యత లేకుండా ప్రభుత్వ భవననిర్మాణాలను చేపట్టే కాంట్రాక్టర్ల పనికిమాలిన చర్యలను ఇందులో చూపించారు. కాంట్రాక్టర్లు నిర్మించిన ఈ నాణ్యతలేని భవనాలను ప్రభుత్వం ప్రజలకు ఇవ్వడం, ఆ గృహసముదాయాలలో నివాసితులు ఎలాంటి ఇబ్బందుల పాలవుతుంటారో చూపుతుంది ఈ ఎపిసోడ్.
బెదిరింపుల పీహెచ్‌డి
పోస్టుగ్రాడ్యుయేట్ రీసెర్చ్ విద్యార్థులు తమ గ్రంథ రచనకు ప్రొఫెసర్ల వద్ద చేరుతుంటారు. ప్రొఫెసర్ల చేతిలో ఆ విద్యార్థులు పడే పాట్లను ‘ప్రొఫెసర్ అండ్ పీహెచ్‌డీ స్టూడెంట్స్ గైడ్’ ఎపిసోడ్‌లో చూపింది. ప్రొఫెసర్ తన వద్ద రీసెర్చ్ స్టూడెంట్‌గా చేరిన అతని చేత తన ఇంటిపనులన్నీ చేయించుకుంటుంటాడు. చివరికి తన మరదలిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకునేట్లయితేనే పాస్ చేస్తానని బెదిరిస్తాడు. ఇప్పటికీ ఇలాంటి ప్రొఫెసర్ల గురించి కథనాలు వెలువడుతూనే ఉండటం గమనార్హం.
పనికిమాలిన మీటింగ్‌లు..
కొంతమంది ప్రభుత్వ ఉన్నతోద్యోగులు రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా అర్థం లేని సమావేశాలను ఏర్పాటుచేసుకొని బాతాఖానీ కొడుతుంటారని ‘మీటింగ్’ అనే ఎపిసోడ్‌లో చూపుతారు జస్పాల్.
పొట్టలో వాచీ
ప్రభుత్వ ఆసుపత్రులలో కొంతమంది డాక్టర్లు తమ విధుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో ‘డాక్టర్’ ఎపిసోడ్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. జస్పాల్ భట్టి ఇందులో డాక్టర్ పాత్ర పోషించారు. రోగికి ఆపరేషన్ చేసి అతని పొట్టలో తన వాచీని మర్చిపోయిన విధానాన్ని ఈ ఎపిసోడ్‌లో చూపించారు. ఇలాంటి సంఘటనలను ఇప్పటికీ వార్తల్లో చూస్తుంటాం.
ముఖ్య అతిథి ఎప్పుడూ ఆలస్యమే...
ప్రజా వేదికలలో పాల్గొనాల్సిన ముఖ్య అతిథి కోసం జనం అంతా గంటలతరబడి ఎదురుచూస్తూ ఉంటారు. అయితే, ఆ వ్యక్తి ఎప్పుడూ ఫంక్షన్ టైమ్‌కి హాల్‌కి చేరుకోడు. ఇది తన ఒక ముఖ్యమైన అర్హతగా భావిస్తుంటాడు. ప్రభుత్వ అధికారులలో ఇప్పటికీ ఇలాంటి వారు ఉండటం గమనార్హం.
గజిబిజి కనెక్షన్ల లైన్‌మ్యాన్
ఇండియన్ టెలీఫోన్ డిపార్ట్‌మెంట్‌ని, అందులోని అధికారులను ఈ ఎపిసోడ్‌లో తూర్పారబట్టారు భట్టీ. ఇప్పుడంటే స్మార్ట్‌ఫోన్ల పరంపర వల్ల టెలీఫోన్ కనెక్షన్లు గురించి దిగుల్లేదు కానీ నాటి రోజుల్లో ఇదో పెద్ద తపస్సు. టెలీఫోన్ కనెక్షన్ కోసం అప్లయ్ చేసుకోవడం, నెలలు గడుస్తున్నా కనెక్షన్ రాకపోవడం, వచ్చినా నాణ్యతలేని టెలిఫోన్ పరికరాలను అమర్చడం.. వంటివెన్నో జరిగేవి. వాటన్నింటినీ ఈ ఎపిసోడ్‌లో చూపించారు.
అర్హతలు లేనివారి చేతిలో సృజన
సీరియల్ అన్నదే సృజన ఉన్న కంటెంట్. అయితే, దానిని కొంతమంది టీవీ నిర్మాతలు ఎలా విస్మరిస్తారో ఇందులో చూపించారు. ఎలాంటి అర్హతలు లేని డబ్బున్న వ్యక్తులు టెలివిజన్ కార్యక్రమాలు నిర్మించడం గురించి ఈ ఎపిసోడ్ చూపుతుంది.
Comments
Please login to add a commentAdd a comment