డార్విన్ పుస్తకం పుట్టినరోజు!
ఆ నేడు 24 నవంబర్, 1859
చార్లెస్ డార్విన్ (1809 - 1882) ప్రకృతిని ప్రేమించాడు. ప్రకృతిని పరిశోధించాడు. ప్రకృతిని పరిశీలించడం కోసం వైద్య విద్యను నిర్లక్ష్యం చేశాడు. తండ్రి అతడిని క్రైస్తవ ప్రబోధకునిగా శిక్షణకు పంపిస్తే, మధ్యలోనే మానేశాడు. ఐదేళ్ల సముద్రయానానికి బ్రిటన్ నుంచి బయల్దేరిన బీగిల్ నౌకలో మిగతా శాస్త్రవేత్తలతో కలిసి జల, ఉభయ చరాలపై సునిశిత అధ్యయనం చేశాడు. డార్విన్‌కు పదిమంది పిల్లలు. భార్య ఎమ్మా వెడ్జ్‌వుడ్. ఇంగ్లండ్‌లోని ష్రూస్‌బరీ డార్విన్ జన్మస్థలం. ‘వానరానికి మెరుగైన రూపం... మానవుడు’ అని డార్విన్ అభిప్రాయపడ్డారు. 2009లో డార్విన్ ద్విశతజయంతి జరిగింది.
డార్విన్ 1859 నవంబర్ 24న ‘ఆరిజన్ ఆఫ్ ది స్పీషీస్’ సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు. అది ఇప్పటికీ జీవ పరిణామ క్రమ పరిశోధకులకు ఒక ప్రామాణిక గ్రంథం. ‘దేవుడిని విశ్వసించేవారు ఎలాగైతే శాస్త్ర సిద్ధాంతాలను తిరస్కరిస్తారో, అదే విధంగా నా వంటి భౌతికవాదులు... నమ్మకాలను బలహీనపరిచే ప్రతిపాదనలు చేస్తుంటారు. నమ్మకానికీ, శాస్త్రానికీ మధ్య ఏ అక్షాంశ రేఖాంశాల మీదనో సమన్వయం కుదిరే వరకు ఈ అయోమయం ఇలాగే కొనసాగుతుంది’ అన్నారు డార్విన్ ఈ గ్రంథంపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇస్తూ.